telugudanam.co.in

      telugudanam.co.in

   

అల్లరి వయస్సులో 'సత్ప్రవర్తన' అలవరచడమెలా?

" సత్ప్రవర్తన"

             "నిజాయితీ"

                          " చిత్తశుధ్ధి"

                                       "సచ్చీలత"

                                                    "విశ్వాసం"

                                                                 "బాధ్యత"

                                                                                    వీటిని మీ పిల్లలకు చిన్నతనం నుంచే అలవరిస్తే వయసుతో పాటు అవీ పెరిగి మీ పిల్లల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి.మనుషుల మధ్య బంధాలకి పునాది వేస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలబడటానికి దోహద పడుతాయి. చిన్నిచిన్ని చేతులతో పిల్లలు చేసే చిలిపి పనులు, ముద్దు, ముద్దు మాటలు చిన్నతనంలో కన్నవారికి ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే పెరిగి పెద్దవారై జీవితంలో విజయాన్ని సాధించి ఉన్నత స్థితికి చేరుకొంటే అంతకంటే సంతోషం ఏముంటుంది. అయితే పిల్లలో వయసుతోపాటు స్వతంత్ర భావాలు పెరుగుతాయి. సమాజంలో వుండే అరాచకపు నీడలు కూడా పిల్లలపై పడతాయి. వాటిని అధిగమించాలంటే పిల్లల మనసును నిజాయితీతో నింపాలి. వారికి సత్ప్రవర్తన అలవడేలా చూడాలి. ఆత్మీయత, అనురాగాలను పంచాలి. ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. అప్పుడు వారి ఆలోచనలు సక్రమంగా వుంటాయి. వారిలో, వారి స్వరంలో ఆత్మీయత ఉట్టిపడుతుంది. అది వారి ఉన్నతికి రాదారి అవుతుంది.అందుకే మీ పిల్లల పసి మనసులకి నిజాయితీని, నమ్మకాన్ని అలవరచండి.మీరు మీ పిల్లలతో మాట్లాడేటప్పుడు ఆ మాటల్లో నిజాయితీ, చిత్తసుద్ది వుండాలి.

మీరు మాట్లాడే విషయాలు ఏమయినా కావచ్చు. ఉదాహరణకు శృంగారం కానీ, గొడవలు, కొట్లాటలు కానీ, మరణాలు, ఆరోగ్యానికి సంబందింఛిన విషయాలు కానీ ఎలా ఏమయినా కావచ్చు, ఏ విషయాన్నయినా జాగ్రత్తగా విడమర్చి చెప్పాలి.ఎందుకంటే ఏదో ఒకరోజు మీపిల్లలువారి జీవితములో ఆ సంఘటనలను ఎదుర్కోవలసివస్తుంది. అందుకని వారు నిజాలను తెలుసుకోవాలి.మీరు మీపిల్లలతో స్వేచ్చగా ఎటువంటి అరమరికలు లేకుండా మాట్లాడాలి. మీ జీవితంలోని సంఘటనలను ఉదహరిస్తూ మాట్లాడితే వారుకూడా నిర్భయంగా వారిమనసులోని భావాలను వ్యక్తం చేయగలుగుతారు. వారి కష్టసుఖాలను మాట్లాడి మీసలహాలను తీసుకోవడానికి సందేహించరు. అటువంటప్పుడు మీపిల్లలతో మీసంబంధ బాంధవ్యాలు పటిష్టమవుతాయి. మీ పిల్లలు మాట్లాడేటప్పుడు వారి మాటలను తేలికగా తీసుకోకుండా, శ్రధ్ధగా ఆలకించండి. వారు మీపెద్దరికాన్ని గౌరవించి , నమ్మి స్వేచ్చగా వారి అభిప్రాయాలను, వారి కష్టాలను, భయాల్ని చెప్పి మీ సలహాలను పొందాలను కొంటారు. పిల్లల మాటలు వినడమేకాదు, వారి మనసుకు నచ్చిన విధంగా సలహాలివ్వడం, మీ అభిప్రాయాలను వెలిబుచ్చడం చేయాలి. అప్పుడు పిల్లలు వాటిని స్వీకరించి సరైన జీవన మార్గాన్ని ఎంచుకుని దిగ్విజయంతో ముందుకు సాగిపోవడానికి ప్రయత్నిస్తారు.

మీరంటే మీ యింట్లో ఒక నమ్మకాన్ని సృష్టించుకోవాలి. మీకు బయట ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటిని ఇంట్లో ప్రదర్సించకూడదు. కష్టసమయంలో కూడా మీరు మీ పిల్లలతో నిజాయితీగా వ్యవహరిస్తే మీరంటే ఎనలేని గురి, నమ్మకం, విశ్వాసం, అభిమానం కలుగుతాయి. పొరపాటున ఏ సందర్భంలో నయినా తప్పుగా వ్యవహరించవలసివస్తే దాన్ని వెంటనే గుర్తించి సిగ్గుపడకుండా పిల్లల్ని క్షమాపణ అడిగితే వారికి మీ మీద మరింత అభిమానం పెరుగుతుంది. మిమ్మల్ని వారు మార్గదర్శకులుగా తీసుకొంటారు. పిల్లల్లో వున్న చిన్నచిన్న తప్పుల్ని వారికి విశదీకరించి చెప్పండి. ఆ తప్పులు చేయడం వల్ల వారు జీవితంలో ఎటువంటి ఇబ్బందులకు గురవుతారో వివరించండి. జీవితంలో నిజాయితీ సత్ప్రవర్తనల అవసరాన్ని వారికి తెలియజేయండి. ప్రతి చిన్న విషయానికి పిల్లల నోటి వెంట ముందు అబధ్ధమే వస్తుంది. అది కూడదని చెప్పండి. నిజాన్ని నిజాయితీగా ప్రేమించమని చెప్పండి. వారి నిజాయితీని మీరు ఖచ్చితంగా గుర్తించండి. ఆసందర్భంలో వారిని ప్రశించండి మర్చిపోకండి. మీ పిల్లలో క్రమశిక్షణ, సత్ప్రవర్తనా లేని పక్షంలో మీరు వారిని ప్రశంసించడం ద్వారా వారు సత్ప్రవర్తన అలవరుచుకొంటారు.

జీవితంలో అన్ని రంగాలలో రాణించడనికి, జీవితానికి పనికి వచ్చే విధంగా సత్ప్రవర్తన అలవరుచుకోమని చెప్పాలి. సమాజంలో తోటివారిని కించపరిచే నైజం తగదని చెప్పాలి. ఆశాజనకమైన దృఖ్పధంతో వారు జీవించాలని తెలియజేయాలి. కొన్ని సందర్భాలలో నిజాలను నిర్భయంగా చెప్పడంవల్ల ఎదుటివారికి చెడుజరగవచ్చు. వారిని కించపరిచే విధంగా వుండవచ్చు. అటువంటప్పుడు నిజాలు చెప్పి వారిని బాధపెట్టకూడదనీ కూడా చెప్పాలి.మీలో ఆశావహ దృఖ్పధం వుండాలి. అది లేనప్పుడు ఏర్పరచుకుని మీపిల్లలు కూడా ఆశావహులుగా వుండేటట్లు చూసుకోవాలి. జీవితంలోని విజయాలను, పరాజయాల్ని సమానంగా చూడగలిగేటట్లు పిల్లల్ని పెంచాలి. పెరిగేపిల్లల ప్రవర్తనలో వచ్చే మార్పులను వెంటనే గుర్తించాలి. అలా వుండటం ఎంతమాత్రం సరైనది కాదని చెప్పండి.


మూలం 25 సెప్టెంబర్ 2005 వార్త ఆదివారము

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: