telugudanam.co.in

      telugudanam.co.in

   

కమ్యూనికేషన్ గ్యాప్

కమ్యూనికేషన్ గ్యాప్

సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకోవడం ఒక ఎత్తైతే ఆ నిర్ణయాన్ని సరైన సమయంలో సద్వినియోగం చేసుకోవడం మరో ఎత్తు. ఒక వ్యక్తి యొక్క ప్రతిభకు అద్దంపట్టేది ఆ వ్యక్తి సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధానం మాత్రమే. అతని నిర్ణయాన్ని విజయపధంవైపు మళ్ళించేది అతని సమయపాలన (టైమింగ్) మాత్రమే. కాబట్టి "టైం ఈజ్ మనీ" అన్నారు పెద్దలు. కానీ "టైం ఈజ్ మనీ". జీవితంలో మనీ కంటే విలువైనవి అనేకం ఉన్నాయి. ఆ అనేకంలో వ్యక్తి భవిష్యత్తు మొదటి స్థానంలో ఉంటుంది. తన భవిష్యత్తుకు రాచబాట వేసే తన నిర్ణయాన్ని తన వారికి సరైన సమయంలో వెల్లడించగలిగితేనే అందుకు తగ్గ ఫలం లభిస్తుంది. లేదంటే అ నిర్ణయం ఎంత గొప్పదైనా ఆ ఫలితం నిష్ఫలం కాకతప్పదు. చేతులు కాలాక ఆకులు పట్టుకోని ప్రయోజనం లేదు అంటారు పెద్దలు. పెద్దల మాట చద్ది మూట అన్నారు అందరూ.

ఆ పెద్దలకు వెల్లడించాల్సిన సమయంలో అనవసరమైన భయాందోళన వలనగానీ, లేనిపోని సందేహాల వలనగానీ, అహం (Ego) వలనగానీ సంకోచించినా లేదా వాయిదా వేసినా ఆ తరువాత ఎంత ప్రయత్నించినా లాభం లేదు. చేసుకునే సమాచార లోపమే అందివచ్చిన అవకాశాన్ని చేజేతులా పోగొడుతుంది. అందుకే మంచో, చెడో అభిప్రాయాన్ని మనకు కావలసినవారితో పంచుకోవడమే మంచిది. ఆ తరువాత ఒక్క క్షణం ఆలస్యమైనా ఆ అదృష్టానికి దూరమైనట్లే. మొహమాటాలకీ, భేషజాలకీ ఏమాత్రం తావుండకూడని సమాచార విషయంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడాన్నే "సమాచార లోపం" (Communication Gap) అంటారు. దీన్ని ఒక రకమైన శూన్యంగా పేర్కొనవచ్చు. ఈ శూన్యం అత్యంత ప్రమాదకరమైనది. భర్తీ చేయడానికి కూడా సాధ్యం కానిది. ఈ శూన్యం ఒక్కసారి ఏర్పడిందంటే అది అంతులేని అగాధమై పెరిగిపోతుంది, అవకాశాల పరంపర తరిగిపోతుంది. ఆ తరువాత జీవితమే అగాధంలోకి కూరుకుపోతుంది. అది దుఖానికి హేతువవుతుంది. ఇది నీడై జీవితాంతం వెంటాడుతుంది.

కమ్యూనికేషన్ గ్యాప్ సమాచార లోపం కుటుంబంతో మొదలుకుని సమాజంలోని అన్ని వ్యవస్థలనూ అవస్థలపాలు చేయగలదు. అందుకే మొదటగా తల్లితండ్రులకూ, బిడ్డలకూ మధ్య ఆత్మీయతతో కూడిన అభిప్రాయాల వెల్లడి అవసరం. పెద్దవారు కూడ తమ ఇగోలను కాస్త సడలించుకోగలిగితేనే ఇది సాధ్యపడుతుంది. ఎదుగుతున్న బిడ్డ స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు వాళ్ళ అవసరాలు వాళ్ళకుంటాయనే వాస్తవాన్ని తల్లితండ్రులు గ్రహించాలి. ఆ అవసరాలను తాము ఏమాత్రం తీర్చగలమో, ఎంతవరకు వాటిని అందిచగలమో తమ బిడ్డలకు అర్ధమయ్యేట్లుగా చెప్పగలగాలి. అవసరమనుకుంటే నచ్చజెప్పాలికూడా. బిడ్డలూ అంతే. కుటుంబ వాస్తవ పరిస్థితులను అవగాహన చేసుకుని మసలాలి. నిర్మొహమాటం అన్నది ఇక్కడి వస్తువు కానేకాదు. ఇక్కడ కావలసిందల్లా అవగాహన మాత్రమే. అవగాహన లేనినాడు సమాచార లోపం బహిర్గతమవుతుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. సమాచార లోపం అపార్ధాలకు దారితీస్తుంది. ఇది మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

"మావాడు బొత్తిగా మా మాట వినడంలేదు!" ....."మా డాడీ నన్ను సరిగ్గా అర్ధం చేసుకోవడం లేదు!" ఇవి ఇటీవల తరచూ అందరూ వింటున్న సంభాషణలు. సంప్రదాయాల చట్రంలో బిగిసిపోయిన తరం ఒక వైపు, స్వేచ్చా స్వాతంత్ర్యాల వైపు ఉరకలేస్తున్న టీనేజ్ యువత మరో వైపు సమాజ స్థితిగతులపై వేస్తున్న ముద్ర ఎటు దారితీస్తుందో తెలీని అయోమయం అన్నిచోట్లా నేడు నెలకొని ఉంది. పిల్లల ఆలోచనలవైపే మొగ్గాలని తల్లిదండ్రులకు ఎవరు చెప్పాలి? వారిని ఏవిధంగా నచ్చజెప్పాలి? అలాకాకుండా తల్లిదండ్రుల అభిప్రాయానికే విలువ ఇవ్వండని ఏ మధ్యవర్తి ద్వారా పిల్లలకు చెప్పించాలి? ఏది కరెక్టు? ఎవరి అభిప్రాయం గొప్పది అని ప్రశ్నిస్తే సమాజం ఎవరివైపు మొగ్గుతుంది? కుటుంబాన్నే సమాజంగా భావించి చర్చిస్తే దీనికి పరిష్కారం దొరుకుతుంది. ఎవరూ ఎవరికీ తమ బాధలు వెల్లడించనవసరంలేదు. ఎవరి సలహా కోసమూ దేబిరించనవసరంలేదు. ఒకరికొకరు అర్ధం కాకపోవడానికి గల కారణాలను ముందు అన్వేషిస్తే కొంత ఫలితం కంపిస్తుంది. ఒకరినొకరు అర్ధం చేసుకునేందుకు ప్రయత్నిస్తే పరిష్కారం లభిస్తుంది. అర్ధవంతమైన వాతావరణం ఇంట్లో ఆవిష్కరింపబడాలంటే "మాట్లాడాలి". ఒకరికొకరు ప్రత్యక్షంగా కూర్చుని పరిశుద్ధమైన మనసుతో చర్చించాలి. ఎటువంటి భావావేశాలకు ఎవరూ లోనుకాకుండా మనసు విప్పి మాట్లాడాలి. తమకు అవరోధంగా ఉన్న ప్రతి అంశాన్నీ బైటపెట్టాలి. వాదోపవాదాలకు అవకాశం ఇవ్వలి.

మాట్లాడ్డమే ఇక్కడ సమస్యకు పరిష్కారం. సమాచారాన్ని అందించడంలో భాషకు అధిక ప్రాధాన్యత ఉంటుందన్న విషయాన్ని మరచిపోకూడదు. ఆకట్టుకునే భాష ద్వారా చెప్పదలుచుకుంది సూటిగా అర్ధమయ్యేట్లు చెప్పవచ్చు. భావ ప్రకటనల (Facial expressions) ద్వారా కూడా అధిక సమాచారాన్ని అతి సులువుగా ఇవ్వవచ్చు. మాట్లాడడంతోపాటు వినడానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి చిన్న సంఘటనకీ భావోద్వేగాలకు లోనయ్యే యువత తమకు వ్యతిరేకంగా వచ్చిన నిర్ణయానికి భరించలేక డిప్రెషన్‌కు గురవుతుంటారు. కొన్ని సందర్భాలలో అది ప్రాణాంతకం కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పిల్లల మనసులోకి ప్రవేశించి వారే తాముగా ఊహించుకోని, ఆ వయసులో తామే ఉంటే తమ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో గ్రహించి దాన్నిబట్టి మాట్లాడ్డం అవసరం. తమ పిల్లలు చేప్పేటప్పుడు దృష్టిని మరోవైపు మరల్చకుండా శ్రద్ధగా ఆలకించాలి. వారి నుండి సమాచారాన్ని రాబట్టడానికి సున్నితమైన ప్రశ్నలను వేయాలి. మాట్లాడే విధానంలో నైపుణ్యం ఉండాలి. ఆకట్టుకునే రీతిలో మాట్లాడాలి. దూరమవుతున్న సంబంధ బాంధవ్యాలను తిరిగి పటిష్టపరుచుకోవడానికి ఇది ఎంతైనా అవసరం.

సమాచార లోపం కేవలం కుటుంబ వ్యవహారమే అనుకోవడానికే వీల్లేదు. సమాజంలోని ప్రతి రంగంలోనూ ఈ జాడ్యం ఉంది. అవి రాజకీయాలు కావచ్చు, వ్యాపారం కావచ్చు, మరేదైనా వృత్తి కావచ్చు. ఏ అంశంలోనైనా దీనికి ప్రాధాన్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల మధ్య కమ్యూనికేషన్ సరిగా లేకపోతే అది కేంద్ర ప్రభుత్వానికి వివిధ పధకాల నిర్వహణలో ఇబ్బంది కలిగించవచ్చు. అది సాధారాణ ప్రజా జీవనానికి ఎంత అవరోధమవుతుందో ఊహించనలవి కాదు. ప్రజా సంక్షేమమే దానివల్ల కుంటుపడొచ్చు. ఫలితంగా ప్రజాస్వామ్యానికే అది గొడ్డలిపెట్టు కావొచ్చు. సాధారణమైన పోస్ట్‌పోన్‌మెంట్ తత్వం కూడా కమ్యూనికేషన్ గ్యాప్‌కు దారితీయచ్చు. సమాచార లోపం వలన ప్రేమ వ్యవహారాలు కూడా దెబ్బతింటాయి. ఇన్ని అనర్ధాలకు మూలకారణమైన కమ్యూనికేషన్ గ్యాప్ విషయంలో ఏమరపాటు మంచిదికాదు.

కమ్యూనికేషన్ గ్యాప్ వ్యక్తి భవిష్య వికాసాన్ని నిరోధించే ఈ సమాచార లోపం వర్తమాన సమాజానికి పెద్ద జాడ్యంగా పరిణమించింది. ఆలోచనా తత్వం కొరవడడం, ఆలోచనా ధోరణి అలవడినా, ఆ ఆలోచనా పరిధిలో విశాలత్వం లేకపోవడం, అహం సమస్యలు, అంతరంగాల అలజడి, అనవసరమైన భయాలు, అలసత్వం, దూరదృష్టి లేకపోవడం, కాలంతోపాటు వేగంగా పరిగెత్తలేకపోవడం, ముఖ్యంగా విజ్ఞాన లోపం కమ్యూనికేషన్ గ్యాప్‌కు కారణాలవుతున్నాయి. మనకు తెలీకుండానే, మనలో ఉన్న ఈ సమస్యను గుర్తెరిగి ప్రవర్తించడం, ఆ లోపాన్ని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించడం, అవసరమైనప్పుడు ఎదుటి వారి సలహాలు స్వీకరించడం ఈ గ్యాప్‌ను తప్పనిసరిగా పూరిస్తాయి. ఈ దిశగా వెంటనే కార్యోన్ముఖులు కావడం ముఖ్యం. ఎందుకంటే ముహూర్తబలం కంటే కూడా మనో బలమే దీనికి ముఖ్యం కాబట్టి.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: