telugudanam.co.in

      telugudanam.co.in

   

పావురాల పెంపకం

పావురాలు

పిచ్చుకల మనిషికి అత్యంత చేరువలో ఉండే పక్షి పావురం. దేవాలయాల సిఖరాల పైన దర్పంగా నివశించే ఈ పక్షులంటే అందరికీ ఇష్టమే. అనేకమంది ఇళ్ళలో వీటిని హాబీగా పెంచుతుంటారు. ఇంటికి కొత్త శోభనిచ్చే ఈ పావురాలంటే చిన్నా పెద్దా అందరూ ప్రేమ చూపుతారు. వాటికి ప్రత్యేకమైన గూళ్ళను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రత్యేకమైన ఆహారాన్ని కూడా ఇస్తుంటారు. అత్యంత ప్రాచీనమైన విలాసాలలో పావురాలను పెంచడం ఒకటి. అతి సులువుగా మచ్చికవ్వడమే కాకుండా సుదూర ప్రాంతాలకు వెళ్ళినా తిరిగి బయల్దేరిన గమ్యానికి చేరే గుణంగల పక్షి కావడంతో అనేకమంది వీటిని ప్రత్యేకంగా పెంచేవారు. వీటిని విలాసాలకోసమే కాకుండా వీటి ద్వారా లాభాలను కూడా పొందేవారు.

పూర్వం యుద్ధాలలోనూ, శాంతి సమయాల్లోనూ రహస్య సందేశాలను పంపుకోవడానికి వీటిని ఉపయోగించేవారు. 776 బి.సి. మరియు 393 ఏ.డి.ల మధ్య ఒలంపిక్ ఆటల్లో వీటిని ఉపయోగించుకున్నారు. మొగలాయిలు పావురాలను పెంచడమేకాక వాటిపై పందేలు కట్టడానికి వాటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారు. ఔద్ నవాబు వజాద్ ఆలీ షా తన విలాసం కోసం 25,000 పావురాలను పెంచేవాడు. పశ్చిమ యూరప్‌లోని బెల్జియం పావురాల పందాలకు పుట్టిల్లు. 1818లో ఇక్కడ మొట్టమొదటి 100 మైళ్ళ పావురాల పందెం ఏర్పాటు చేశారు. 1820లో పారిస్, లేగ్‌ల మధ్య పందెం కట్టారు. 1823లో లండన్ మరియు బెల్జియంల మధ్య పావురాల పందెం జరిగింది.1800 సంవత్సరాంతానికి పందాలు యూరపు, అమెరికా రాజ్యాలకు కూడా ప్రాకిపోయింది. బెల్జియంలో ప్రతీ గ్రామంలో పావురాలను పెంచే Pigeon clubలను పెట్టారు. పందెపు పావురాలను హోమర్స్ (Homers) అంటారు. వీటికి ఇంటికి తిరిగి వచ్చే గుణం ఉంది. ఇవి సుమారు 1500 మైళ్ళ దూరం కూడా వెళ్ళి తిరిగి ఇంటికి చేరుకుంటాయి. ప్రతి హోమింగ్ పావురానికి రిజిస్ట్రేషన్ నంబరు, రంగు, వయస్సు మొదలైన వివరాలతో ఒక అల్యూమినియం కంకణం కాలికి కట్టేవారు. ప్రత్యేకంగా పందానికి ఉపయోగింపబడే పావురాలను పంజరాలలో పెట్టి పందెం ప్రారంభమయ్యే ప్రదేశానికి రైలులో పంపుతారు. పందెం ప్రదేశానికి ఈ పంజరాలు చేరడంతోటే ఇక్కడి స్తేషన్ మాస్టారు వాటిని పరిశీలించి సరిచూచి సరిగ్గా పొద్దున్నే 6 గంటలకు వీటిని వదులుతారు. ఇవి పగలంతా ఎగురుతూ రాత్రిపూట చెట్ల మీద, ఇళ్ళ మీద విశ్రాంతి తీసుకుంటాయి.

పావురాలు పావురాలను పెంచేవారు తమ పావురాల జాతిని జాగ్రత్తగా గమనించుకుంటారు. బాగా పెరిగిన రెక్కలు, ఎముకల నిర్మాణం, మంచి దృష్టి, క్రమశిక్షణ, మంచి ఆహారం తినే అలవాటు పందెపు పావురాలకు ఉండవలసిన ముఖ్య లక్షణాలు.సాధారణంగా పావురాల పెంపకం పావురం పుట్టిన 3 నెల్లలనుంచీ ప్రారంభమౌతుంది. ఇళ్ళ కప్పుల మీద నుంచి మెల్లిగా వీటిని పైకి విసురుతారు. ఈవిధంగా శిక్షణను ఇస్తూ మెల్లిమెల్లిగా ఎగురవలసిన దూరాన్ని అధికం చేస్తూ ఉంటారు. దూరాన్ని అధికం చేసేకొద్దీ అవి వాటి నావిగేషనల్ అయిడ్స్ ఉపయోగించుకుంటుంటాయి. సూర్య కాంతి, భూమి యొక్క అయస్కాంత ఆకర్షణతోపాటు వాటి మార్గం,చుట్టుప్రక్కల, పరిసర ప్రదేశాల గుర్తులు మొదలైనవాటిని పరిచయం చేసుకుని ఉపయోగించుకుంటాయి. మొదటిసారి అన్ని పావురాలను ఒకేసారి వదలాలి. ఆ తరువాత జతలు, జతలుగా రెండేసి చొప్పున వదలాలి. ఎప్పుడూ ఒకటి, ఒకటిగా వదలకూడదు. ఒకసారి ఒక పావురం 30 మైళ్ళు ఎగిరివచ్చిన తరువాత తిరిగి రెండవసారి ఎగురవేయడానికి మూడు లేక నాలుగు రోజుల విశ్రాంతి ఇవ్వాలి. ఇవి ఎడమవైపు, వెనుకకు, ముందుకు వచ్చి కుడివైపు తిరగడానికి నోటితో ఈలలు వేస్తూ క్రమశిక్షణను ఇస్తారు. చిన్న పావురం ఎగురగేసిన వెంటనే కొంచెం దూరం ఎగిరి వెంటనే ఇంటికి తిరిగి వస్తుంది. మెల్లమెల్లగా దూరం అధికం చేస్తూ 1500 మైళ్ళు పైగా వెళ్ళి రావడానికి శిక్షణను ఇస్తారు.పెట్టలు పుంజులను చేరే కాలంలో పుంజులను పందాలకు పంపకూడదు. వాతావరణం సరిగా లేనప్పుడు, చలిగా ఉన్నప్పుడు పావురాలను ఎగురవేయకూడదు. చిన్న పావురాలను పెద్ద పావురాలతో కలిసి ఎగురవేయకూడదు. దీని వల్ల వీటి వేగం తగ్గిపోతుంది. చిన్నవాటికి ప్రత్యేకంగా విడిగా శిక్షణ ఇవ్వాలి.


పెంపకంలోని జాగ్రత్తలు :

పావురాలు

పావురాలను పందాలకు తగ్గట్లుగా తీర్చిదిద్దడం అంత సులువు కాదు. బలిష్టంగా పెరిగిన మంచి జాతి పావురాలు పందాలకు అనువుగా ఉంటాయి. వీటి ఆహారం విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో వీటి ఆరోగ్యంపట్ల కూడా అంతే జాగ్రత్త తీసుకోవడం అవసరం. ఒకప్పుడు పోస్ట్ మేన్ విధిని నిర్వహించిన ఈ పావురాలను పరిరక్షించడం మన బాధ్యత.



Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: