telugudanam.co.in

      telugudanam.co.in

   

మీకు తెలుసా

[ వెనుకకు ] [ ముందుకు ]

వేసవిలో చేతిగోళ్ళు వేగంగా పెరుగుతాయా?

మన కాలి గోళ్ళ కన్నా చేతి గోళ్ళు వేగంగా పెరగటాన్ని మీరు గమనించే ఉంటారు.మనం తెలుసుకోవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మన చేతి గోళ్ళు చలి కాలం లో కన్నా ఎండాకాలం లో వేగంగా పెరుగుతాయి. అంతేకాదు మన రెండు చేతి గోళ్ళు ఒకేరకంగా పెరగవు. ఏ చేత్తో ఎక్కువ పని చేస్తామో, ఆచేతిగోళ్ళు కొంచెం వేగంగా పెరుగుతాయి. అంటే మనం కుడి చేతి వాటం వాళ్ళమయితే కుడిచేతి గోళ్ళు ఎడంచేతి వాటం వాళ్ళయితే ఎడం చేతిగోళ్ళు కొంచెం వేగంగా పెరుగుతాయన్నమాట.

ఇలా ఎందుకు జరుగుతుంది? అన్న ప్రశ్నకు ఇంకా కచ్చితమైన సమాధానం లభించనప్పటికీ ఇప్పటికి అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా శాస్త్రజ్ఞులు ఇలా చెప్తున్నారు.కాలి గోళ్ళ కన్నా చేతిగోళ్ళకు రక్త ప్రసరణ మెరుగ్గా జరిగి వాటికి సాపేక్షికంగా ఎక్కువ ఆక్సిజన్ లభించటం వల్ల వేగంగా పెరుగుతాయట.అదే్విధంగా చలికాలంలో మన శరీరంలో జరిగే వివిధ కార్యకలాపాలు అంతం చురుకుగా జరగకపోవటం వల్ల ఆరుతువులో గోళ్ళ పెరుగుదల వేగం మందగిస్తుంది.వేసవిలో దీనికి భిన్నంగా జరగటం వలన వేగం పెరుగుతుందని వారు చెబుతున్నారు. మనం ఏచెత్తో ఎక్కువ పని చేస్తామో ఆ చేతి గోళ్ళు వేగంగా పెరగతానికి కూడా ఇదే కారణం అంటున్నారు. చలికాలంలో సూర్యరశ్మి తగినంతగా అందుబాటులో లేకపోవటం కూడ గోళ్ళు పెరుగుదల మందగించటానికి ఒక కారణం కావచ్చని ఊహిస్తున్నారు.ఏదేమైనా గోళ్ళ పెరుగుదలలో ఇలా తేడాలు రావటానికి ఇతరత్రా కారణాలు కూడా కొన్ని ఉండవచ్చని వాటిని త్వరలోనే కనిపెట్టగలమని శాస్త్రజ్ఞులు భావిస్తున్నరు.


మంచి నీరు కొంచెమే ఉందా?

మన భూగోళం పై నాల్గింట మూడు వంతులు నీరేనని, మిగతా ఒక వంతు మాత్రమే నేల అని అందరికి తెలిసిందే కదా. అయితే భుమిపై ఉన్న నీటిలో ఏయే వనరుల్లో ఎంత నీరు ఉంది అన్న విషయం కొంచెం ఆశ్చ్రర్యం కలిగిస్తుంది.

మన భూగోళం మీద అన్ని వనరుల్లో ఉన్న నీరు కలిసి మొత్తం 32,60,74,440 ఘనపు మైళ్ళు (ఘనపరిమాణంతో) ఉండగా, ఇందులో 97.22 శాతం అంటే 31,70,00,000 ఘనపు మైళ్ళ నీరు ఒక్క మహాసముద్రాలలోనే ఉంది.మిగిలిన 2.78 శాతం నీటిలో 2.14 శాతం నీరు ఆర్కిటిక్‌ మరియు అంటార్కిటికా ప్రాంతాల్లోని గడ్డకట్టిన మంచులోనూ, ఇతర ప్రాంతాల్లోని మంచు కొండలపైన మంచు రుపం లో ఉంది. ఇది కూడా పోగా నదులు, సరస్సులు, భూగర్భజలాలు, చిన్న చిన్న ఉప్పు నీటి సముద్రాలు, నేల, గాలి వంటి అన్ని వనరుల్లోనూ కలిపి 20,74,400 ఘనపు మైళ్ళ నీరు మాత్రమే ఉంది.భూగోళం మీద ఉన్న మొత్తం నీటిలో ఇది కేవలం 0.64 శాతం మాత్రమే కావటం విశేషం.

మహా సముద్రాలను, మంచు ఖండాలను పక్కకు పెట్టగా మిగిలిన నీటిలో 20 లక్షల ఘనపు మైళ్ళ నీతితో భూగర్భజలాలు ప్రధమ స్ధానం లో ఉంటే, 30 వేల ఘనపు మైళ్ల నీటితో మంచినీటి సరస్సులు రెండో స్ధానం లోను, 25 వేల ఘనపు మైళ్ల నీటితో చిన్న సముద్రాలు మూడో స్ధానం లోనూ ఉన్నాయి.మొత్తం నీటి లో శాతాలపరంగా వరుసగా 0.61, 0.009, ఇంకా 0.008 నీరన్న మాట. ఇకపోతే నేల లో తేమ రూపంలో 16,000 ఘనపు మైళ్ళ నీరు (0.005 శాతం), గాలిలో తేమ రూపంలో 3,100 ఘనపు మైళ్ళ నీరు (0.001 శాతం) ఉంది. కాగా ప్రపంచం లోని నదులన్నిటిలో కలిపి కేవలం 330 ఘనపు మైళ్ళ నీరు మాత్రమే ఉంది.నేలలో, నీటిలో గాలిలో ఉన్న మొత్తం నీటి పరిమాణం లో మార్పు రాకపొయినా, ఒక కోవకు చెందిన జల వనరులల్లోని నీరు మరొ కోవకు చెందిన జలవనరుల్లోకి బదలాయింపబడే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి అది జీవుల మనుగడకు కూడా ప్రమాదకరంగా పరిణమించవచ్చు. ఉదాహరణకు మంచు ఖండాల్లోని నీరు కరిగి సముద్రాల్లో కలిసిపోవడం అలాంటి పరిస్ధితిని సృష్టిస్తుంది.


సముద్రాన్ని ఎంతదూరం దాకా చూడగలం?

ఏ బీచ్‌లోనో నిలబడి సముద్రం వంక చూసినప్పుడు చాలా దూరం దాకా సముద్రం మనకు కనిపిస్తోందని అనుకుంటాం.కాని వాస్తవానికి అలాంటి సందర్భాలలో మనం కేవలం ఒక మూడు మైళ్ళ దూరం దాకా మాత్రమే సముద్రాన్ని చుడగల్గుతాం. ఆ తరువాత ఎన్ని వేల మైళ్ళ దురం దాకా సముద్రం ఉన్నప్పటికీ అది మనకు కనిపించదు.ఇందుకు ప్రధాన కారణం భూమి గుండ్రంగా ఉండటమే!

భూమి గుండ్రంగా ఉండే కారణంగా...ఎదైనా ఒక సముద్ర తీరం లోగాని, లేదా ఎత్తుపల్లాలు లేని ఓ సువిశాలమైదాన ప్రాంతం లో గాని మనం నిలబడినప్పుడు-మనం నిలబడ్డ చోటు నుంచి ఒక 3 మైళ్ళ దాకా ఉన్న ప్రాంతం మాత్రమే మనకు కనిపిస్తుంది. గోళాకృతిలో ఉన్నందున ఎక్కడికక్కడ భూమి వంపు తిరిగే కారణంగా, సముద్రతీరం లో నిలబడినప్పుడు మూడు మైళ్ళ తరవాత వుండే జలభాగం మనకు కనిపించదు.

ఒకవేళ మనం నిలబడే ఎత్తుని పెంచుకుంటూ పోయినట్లయితే అప్పుడు మనం చూడగలిగే భూభాగం లేదా జలభాగం కూడ పెరుగుతుంది. ఉదాహరణకు మనం సముద్ర తీరం వద్ద ఒక మైలు ఎత్తులో నిలబడి సముద్రాన్ని చుసినట్లయితే అప్పుడు 98 మైళ్ళ దూరం దాకా ఉన్న సముద్రం మనకు కనిపిస్తుంది. అయితే వాతావరణం సరిగ్గా లేకపోయినా, పొగమంచు లాంటిదేమైనా వ్యాపించి వున్నా అలాగే గాలిలో తేమ బాగా ఉన్నా అప్పుడు అంత దూరం దాకా మనం చూడలేం. (వాతావరణం స్వచ్ఛంగా, నిశ్చలంగా వుంటే, ఎత్తైన కొండ మీద నిలబడి ఓ 80 కిలోమీటర్ల దూరంలో వుండే కొవ్వొత్తి జ్వాలను మనం గుర్తించగలము).


సముద్రపు గుర్రాలు కూడా రంగులు మారుస్తాయా?

సముద్రపు గుర్రాలు అనేవి సముద్ర జలాల్లో నివసించే ఒక రకమైన చేపలు. మన నేల మీద నివసించే గుర్రం ఆకారాన్ని పోలి ఉండడంతో వాటికి ఆ పేరు వచ్చింది. వీటిలో సుమారు 40 రకాలవి వున్నాయి. అందులో అన్నిటి కన్నా చిన్న సైజుకి చెందిన సముద్ర గుర్రాలు కేవలం ఒక అంగుళం పోడవు మాత్రమే ఉంటే, అన్నిటికన్నా పెద్దగా ఉండే జాతికి చెందినవి సుమారు ఒక అడుగు పొడవు ఉంటాయి. పలు రకాల చేపలకు లాగానే సముద్ర గుర్రాలు ( సీ హార్స్‌ ) కూడా అవసరాన్ని బట్టి తమ రంగులను మార్చేస్తాయి. కేవలం రంగులనే గాక కొన్ని కొన్ని సందర్భాలలో తమ ఆకారాన్ని కూడా కొంతమేరకు మార్చుకోగల్గడం విశేషం. సాధారణంగా ఈ జీవులు ఏదన్నా ప్రమాదాన్ని పసిగట్టగానే తమ రంగుని మార్చేస్తాయి. ఈ 'పని' ఎంత వేగంగా జరుగుతుందంటే దాన్ని తిందామని వచ్చే జలచరానికి ఏం జరిగిందో అర్ధం కాక, అయోమయంలో పడిపోతుంది. ఒకోసారి బాగా బెదిరిపోతుంది కూడా. ఇలా రంగుని మార్చేసుకుంటూ సముద్రగుర్రాలు తమ శత్రువులను బాగా బురిడీ కొట్టిస్తాయి. కొన్ని సముద్ర గుర్రాలు తమ రంగులను మార్చలేనప్పటికీ, వాటి ఒంటి మీద తెలుపు, పసుపు, గులాబీ, ఇంకా ముదురు నీలపు రంగుల మచ్చల ఉంటాయి. ఇలాంటి సముద్ర గుర్రాలు ఏదన్నా ప్రమాదాన్ని శంకించగానే సముద్రపు అడుగుభాగానికి చేరుకుని అక్కడి శిలల మధ్య కదలకుండా మెదలకుండా ఉండిపోతాయి. దాంతో వాటి శత్రువులకు అవి కూడా ఆ శిలల్లో ఒక భాగమేనని అనిపిస్తుంది. అన్నట్లు మన సముద్ర గుర్రం తాలూకూ శరీరంలో ఓ ప్రత్యేకమైన సంచీలాంటి నిర్మాణం ఉంటుంది. ఆడ సముద్రగుర్రం పెట్టే గుడ్లను మగజీవి ఈ సంచీలో భద్రపరుస్తుంది. ఆ గుడ్లు అక్కడే పొదగబడి వాటి నుంచి పిల్ల చేపలు వస్తాయి. ఈ సంగతి తెలియని వారు సముద్ర గుర్రం గుడ్లను కాక పిల్లల్నే కంటుందని, అందులోనూ ఆడజీవి కాక మగజీవే పిల్లల్ని కంటుందని అనుకుంటారు.

[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: