telugudanam.co.in

      telugudanam.co.in

   

ఫొటోగ్రఫీ

ఫొటోగ్రఫీ

ఆంగ్లంలో ఫొటోగ్రఫీ అనే మాటకు 'వెలుతురుతో రాయడం' అనే రెండు గ్రీకు పదాలు మూలమయ్యాయి. చాయా చిత్రానికి రెండు ప్రక్రియలు ఉన్నాయి. మొదటిది ప్రతిబింబాన్ని ఉత్పన్నం చేయడం, రెండవ ప్రక్రియలో ప్రతిబింబాన్ని నమోదు చేయడం. ఈ మొదటి ప్రక్రియ అనేక శతాబ్దాలకు ముందే అంటే ఈ చాయా చిత్ర గ్రహణాన్ని కనుగొనడానికి పూర్వమే మానవాళికి తెలిసింది. 1000, 1267 సం. ప్రాంతంలో అరబ్, ఖగోళ శాస్త్రవేత్తలు సూర్య గ్రహణాన్ని చూడడానికి కెమెరా ఆబ్‌స్క్యూరా అనే విచిత్రమైన ప్రభావాన్ని వాడుకున్నారు. నెమ్మదిగా ఈ కెమెరా ఆబ్‌స్క్యూరా సహాయంతో విభిన్న రీతులలో చిత్రలేఖకులు ప్రతిబింబాన్ని కల్పించుకోసాగారు. కాంతి సూక్ష్మగ్రాహక ద్రవ్యాలు కూడా ఫొటోగ్రఫీని కనుగొనడానికి ముఖ్యాధారమయ్యాయి. 18వ శతాబ్దిలో జొహన్ హీన్రిచ్ స్కల్జ్ అనే జర్మన్ శరీర నిర్మాణ శాస్త్రజ్ఞుడు సిల్వర్ నైట్రేట్, సిల్వర్ క్లోరైడ్, సిల్వర్ సాల్ట్స్ వెలుతురు తగిలితే నల్లబడతాయని కనుగొన్నాడు. తరువాతి చాయాచిత్రగ్రహణ పరిశోధనకు ఈ విజ్!నానం ప్రయోజకమైంది. ఫొటోగ్రఫీలో అగ్రగామి అనదగిన థామస్ వెడ్గ్‌వుడ్ అనే ఆంగ్లేయుడికి (1771-1805) సొంతంగా ఒక పింగాణీ కర్మాగారముండేది. పువ్వుల, మొక్కల ఇతర వస్తువుల ప్రతిబింబాన్ని తను తయారు చేసే భోజన పళ్ళేలలో 'కెమెర్ ఆబ్‌స్క్యూరా' గాజు పలకపై సిల్వర్ నైట్రేట్ కాగితాన్ని ఉపయోగించుకొని బదిలీచేసేవాడు. కాంతి సూక్ష్మగ్రాహకమైన సిల్వర్ నైట్రేట్ వల్ల ప్రతిబింబాలు కల్పించబడేవిగాని అవి చాలా కాలం వుండేవి కావు.

1829లో ఫోర్‌నీప్స్ అనే ఫ్రెంచ్ పౌరుడు రంగస్థల దృశ్య చిత్ర లేఖకుడు, భౌతిక శాస్త్రవేత్త అయిన లూయీ జాకీ మాండె డెగూర్‌తో కలిసి భాగస్వామి అయ్యాడు. డెగూర్‌కు ఒక రంగస్థలం సొంతంగా ఉండేది. నీప్స్ భవన అయిన శిలాజిత్తు తైలమూ,నూనెతో మెరుగుపట్టిన ఒక లోహపు పలను వాడడాన్ని ప్రాతిపదికగా తీసుకుని నీప్స్ మరణాంతరం కూడా కృషి చేశాడు. పదేళ్ళకు పైగా ఇతను ప్రకాశానికి సులభంగా ప్రతిక్రియను చూపడానికి విభిన్న ద్రవ్యాలతో ప్రయత్నించాడు. చివరకు ఇతను సన్నటి వెండిపూత పూయబడిన రాగి రేకుకు అయొడిన్ పొగ పట్టించి, దానిని ప్రతిబింబానికి ప్రకాశీకరించాడు. ప్రతిబింబాన్ని రూపొందించడానికి మెర్క్యురీ వేపర్ ఉపయోగపడింది. ఆ తరువాత అది రసాయనికంగా శుభ్రం చేయబడింది. ఈ చాయాచిత్రాలు అతిస్పష్టంగా కనబడడమేగాక ప్రకాశీకరణానికి ఎక్కువ కాలం కూడా తీసుకోలేదు. స్త్రీలు, పురుషులు ఈ చాయాచిత్రాలను తీసుకోవడానికి ఇది అదునైంది. 1839 జనవరి 7న డెగర్ తన ఆవిష్కరణను వెల్లడిచేశాడు. నెగటివ్, పాజిటివ్ ప్రక్రియలను కనుగొనడంలో టాల్బోట్ చాయాచిత్రాన్ని ఒక అడుగు ముందుకు తీసుకువెళ్ళాడు. ఈ ప్రక్రియ ద్వారా ప్రతిబింబప్రతులు ఎన్నైనా మళ్లీ మళ్ళీ తీయడానికి వీలైంది. టాల్బోట్ కాలోటైప్ ప్రక్రియ వల్ల చిత్తరువూకు చాయా చిత్రగ్రహణం సాధ్యమైంది. ఇతని "ది పెన్సిల్ ఆఫ్ నేచర్" చాయాచిత్ర రూపంలో వెలువడిన తొలి సచిత్ర గ్రంధం. ఈలోగా ఫ్రెంచ్ ప్రభుత్వం తోడ్పాటుతో 'డెగెరోటైప్' అనె పేరుతో డెగెర్ తన చాయాచిత్ర ప్రక్రియను నెలకొల్పాడు. అతను తన ప్రక్రియను ఒక చిన్న పుస్తకంలో ప్రచురించాడు. డెగెరోటైప్ చిత్ర ప్రక్రియ ఫ్రాన్స్ దేశం ప్రపంచానికి ఇచ్చిన కానుకగా పరిగణించబడింది. డెగరోటైప్ చిత్రపట స్టూడియోలు ప్రపంచమంతటా త్వరలోనే నెలకొల్పబడ్డాయి. 1870 ప్రాంతంలో మ్యుబ్రిడ్జ్ అనే బ్రిటిష్ చాయాచిత్ర గ్రాహకుడు అతి వేగ చాయా చిత్రాలకు మార్గదర్శకుడై కెమెరా పరంపరలతో మనుషుల, జంతువుల చలనాన్ని విశ్లేషించాడు. ఇది తరువాత చలన చిత్ర చాయాగ్రహణానికి ఆధారమైంది. ఫొటోగ్రఫీ

1879లో Dry plate process ప్రవేశపెట్టబడడంతో చిన్న కెమెరాలు ఉత్పన్నమయ్యాయి. అంతేకాక బాహిర ప్రదేశాలలో చాచిత్ర గ్రహణానికి ఇది అనుకూలించింది కూడా. త్వరలోనే చాయాచిత్రయుత పత్రికా రచనకి ఇది నాంది పలికింది. జార్జ్ ఈస్ట్‌మన్ అనే అమెరికా దేశపు ఆవిష్కర్త కనుగొన్న ఫిల్మ్ చుట్ట (రోల్ ఫిల్మ్) అనేక మార్పులకు దారితీసింది. ఇతను తన కెమెరాను 1884లో అమ్మసాగాడు. చాయాచిత్ర గ్రహణంలో ఇది ఒక చిన్న విప్లవాన్ని తెచ్చింది. ఔత్సాహికులు, కుటుంబీకులు అధికంగా కెమేరాలను కొన్నారు. దీనితో ప్రపంచంలో క్షణ చిత్రం (స్నాప్‌షాట్) అవతరించింది. ఫ్రాన్స్‌లో 1904లో సృజించిన ఆటోక్రోం ప్రక్రియ అంటే తొలి వర్ణ ప్రక్రియ బాగా జనాదరణ పొందింది. అయితే ఈ ప్రక్రియకు ఎక్కువకాలం పట్టడమే కాక ఖర్చులు కూడా ఎక్కువే. 1935లో కోడక్ సంస్థ కోడోక్రోం పారదర్శకత ఫిల్ములను ప్రవేశపెట్టడంతో వర్ణ చాయాచిత్రాలు ప్రజావ్యాప్తినీ పొందాయి. చిన్న ఆకృతిగల ఫిలంను వాడుకునే 35 మి.మీ. కెమెరా 1925లో జర్నమీలో వాడుకలో ప్రవేశపెట్టబడింది. 1930 ప్రాంతంలో చాయాచిత్ర మెరుపు దీపం (ఫ్లాష్ బల్బ్) కనుగొనబడింది. తరువాత అధునాతన కెమెరా కటకాలు రూపొందడానికి దోహదమైంది. 1947లో ఎడ్విన్ లాండ్ అనే అమెరికా దేశస్థుడు కనుగొన్న పోలరాఇడ్ కెమెరా తక్షణ చాయాచిత్రాలు వెలువడడానికి కారణమయింది. ఏ రోజుకారోజు ఫొటోగ్రఫీలో వినూత్న మార్పులు సంతరిస్తూ ఉన్నాయి. ప్రజల అభిరుచుల్లో కలుగుతున్న మార్పులు ఇందుకు ఒక కారణమైతే కెమెరా వినియోగం నేడు సర్వ సాధారణమవ్వడం మరో కారణం. ఈ కెమెరా మరెన్ని రూపాలు సంతరించుకోనుందో, మరెటువంటి వినూత్న స్థాయికి చేరుకోనుందో!

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: