telugudanam.co.in

      telugudanam.co.in

   

కలంకారీ అద్దకాలు

ఆంధ్ర ప్రదేశ్‌లోని ముఖ్యమైన పరిశ్రమలలో అద్దక పరిశ్రమ చాలా పురాతనమైనది. రాష్ట్రమంతటా వివిధ సాంకేతిక విధానాలను ఉపయోగించి స్థానిక సంప్రదాయానుగుణంగా ఇండిగో ప్రాసెస్ లేక రేసిస్టు స్టైల్, మార్డెంట్ లేక డైడ్ స్టైల్, మొదట చెప్పిన టై అండ్ డై స్టైల్ అని మూడు రకాలుగా ఉంది. గుడారాలకు ఉపయోగించే గుడ్డలపై లైనింగులు, గుమ్మాలకు, కిటికీలకు తెరలు, కిషన్ కవరింగులు మొదలైన వాటిపై అద్దకానికి మార్డెంట్ లేక డైడ్ స్టైల్ ఉపయోగిస్తారు. ఇండిగో రేసిస్ట్ స్టైల్‌నే కలంకారీ అద్దకం అంటారు. కలంకారీ అద్దకాలలో అందమైన అద్దకపు చీరలు, పడక దుప్పట్లు, కర్టెన్లు, బల్లగుడ్డలు అనేక అందమైన డిజైన్లలో లభిస్తున్నాయి. ఒక సన్నని వెదురు బద్దతో కలం చేసి దాని చివర పాయింట్‌గానీ, బ్రష్‌గానీ తయారు చేస్తారు. ఈ కలానికి ప్రత్యేకంగా తీయబడిన గాడిగుండా సిరా ప్రవహిస్తుంది. ఇదే వారి ప్రత్యేక సాధనం. రంగులకు ఉపయోగించే సిరా సహజంగా లభించే మూలికల నుండి తయారుచేస్తారు. నీలిమందు నుంచి నీలిరంగు, వివిధ రకాల మూలికలు, ఆకులు, బెరడు ఉపయోగించి ఎరుపు, పసుపు రంగులను తయారుచేస్తారు. ప్రయేకమైన సాధనికలంతో మూలికా సంబంధమైన వర్ణ ద్రవ్యాలను ఉపయోగించి చేతితో పెయింట్ చేయబడిన బ్రహ్మాండమైన "కాలికోలు" కలంకారీలు.

కలంకారీ అనేది ఒక ప్రాచీన కళ. అనేక శతాబ్దాలపాటు సంప్రదాయకంగా కళాకారులు గట్టి బట్ట మీద పురాణాలలోను, ఇతిహాసాలలోను గల గాథలకు అనురూపంగా చిత్రాలు వేసి ఆ బట్టను దేవాలయాలలో తెరలుగాను, గోడలకు అలంకారాలుగానూ ఉపయోగించేవారు. దేవాలయాలలో శిల్పాలు, దేవతా విగ్రహాలు, వివిధ కుడ్య చిత్రాలు మొదలైన వాటినుంచి కలంకారీ కళాకారులు స్ఫూర్తిని కలిగించుకున్నారు. దేవతా విగ్రహాల శిల్పకళా నైపుణ్యాన్ని, విగ్రహాల ఆభరణాలను, బొమ్మలను చూచి అనేక విషయాలను గ్రహించారు. ఫ్రెస్కో పెయింటింగ్‌లాగే కలంకారీ అద్దకాలు రామాయణ, మహాభారత చిత్రాలతో అతిరమణీయంగా ఉంటాయి. దివ్యమైన కలంకారీ కళ కళాకారుల హస్తకళా నైపుణ్యం కాదు, చిత్రకళా చాతుర్యం కాదు, ఒక విధమైన అప్పొర్వ భగవద్భక్తి ప్రకతిస్తూ వుంటాయి. అంధ్ర దేశంలో ప్రత్యేకంగా కలంకారీ చిత్ర కళకు రెండే రెండు కేంద్రాలు ప్రసిద్ధి పొందాయి. మొదటిది శ్రీకాళహస్తి, రెండవది అద్దకాలకు ముఖ్య కేంద్రమైన మచిలీపట్టణం.

శ్రీకాళహస్తి కలంకారీ అద్దకానికి అంకితమైన గొప్ప యాత్రా స్థలము. మిక్కిలి ఓర్పుతో కలంకారీ అద్దకపు పరిశ్రమలో కళాకారులు ప్రదర్శొఇంచే అభిలాషలో, ఉత్సాహంలో వారి అర్పణభావం ప్రకటితమవుతుంది. మొట్టమొదట బట్టను కలంకారీ కళాకారుడు చిత్రించదలచిన కాన్వాసుగా తయారుచేసుకుంటాడు. దళసరిపాటి గాడా చేనేత బట్టను శుభ్రంగా ప్రవహిస్తున్న నీటిలో బట్టకు పెట్టిన గంజి, పిండి పోయేదాకా నాలుగైదుసార్లు శుభ్రం చేస్తారు. దీనిని శుభ్రం చేయడానికి సబ్బుగానీ, ఇతర డిటర్జెంట్లుగానీ ఉపయోగించరు. ఈవిధంగా శుభ్రం చేసిన బట్టను గేదె పాలు, కరక్కాయల రసంకలిపిన మిశ్రమంలో ముంచి ఎండలో ఆరబెడతారు. ఈవిధంగా ఆరబెట్టిన బట్ట ఇప్పుడు కలంకారీ అద్దకానికి సిద్ధమైంది. చింతబొగ్గుతో తయారైన బొగ్గు కణికెలతో ఈ బట్ట మీద భావానుగుణ్యంగా హస్తకళానైపుణ్యంతో చిత్రాలను చిత్రిస్తారు. ఈ చిత్రాలను అన్నభేది ద్రావణంతో సుడిచి చిత్రాలను చెరగని నల్లరంగుగా తయరుచేస్తారు. సుదీర్ఘమైన ఈ కలంకారీ విధానంలో ఇది మొదటిమెట్టు. ఈవిధంగా ఉతికి ఉడకబెట్టి చిత్రాలు గీసి పెయింటింగ్ వేసి ఎండబెట్టి కలంకారీ అద్దకపు బట్టను పూర్తిచేస్తారు.

కలంకారీ చిత్రకారుల హస్తకళా కౌశలాన్ని చూడడం కనులకు విందు. కలాన్ని వ్రేళ్ళతో పట్టుకుంటాడు. కావలసిన రంగులో ముంచిన చిన్న గుడ్డనుగానీ, దూదినిగానీ, కలంలో పెట్టి వ్రేలితో నొక్కుతూ కావలసినంత రంగు ద్రవాన్ని కలం గుండా ప్రవహింపజేస్తూ పై రేఖా చిత్రాల మీద వర్ణం వేస్తాడు. నిపుణుల చేతిలో సంపూర్ణంగా చిత్రించిన చిత్రాలు చైతన్యవంతంగా తయారవుతాయి. రంగులు కన్నులకు కొట్టవు. నాజూకైన వర్ణాలు అరిమృదువుగా, కంటికి ఇంపుగా, సమరస భావంతో చల్లగా ఉంటాయి. దిజైన్లలో, రంగులో మచిలీపట్టణం అద్దకాలను మించినవి లేవు. పురాతన కాలం నుంచీ ఇవి ఎంతో ప్రసిద్ధిని పొందాయి. 1658-1664 సంవత్సరాల మధ్య ఒక ఫ్రెంచి యాత్రికుడు ఫ్రాంకాయిన్స్ బెర్నీర్ మొగలాయి చక్రవర్తులు టెంటులకు ఉపయోగించే బట్టను గురించి వ్రాస్తూ పైల ఎర్ర రంగు గలిగి లోతట్టు మచిలీపట్టణం పెన్‌తో చిత్రింపబడిన అందమైన అద్దకపు బట్టలను జోదిస్తారు అని వర్ణించాడు. ఆంధ్ర దేశంలో కలంకారీ కళ అంత ఖ్యాతిని గడించి ప్రపంచ కలంకారీ చరిత్రలో ఓ విశిష్ట స్థానాన్ని పొందింది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: