|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
అమరావతి
గుంటూరు నుండి 27 కి. మీ వున్న అమరావతికి ప్రతి అరగంటకు బస్సులు తిరుగుతూవుంటాయి.
ఇక్కడ ఒకనాడు బౌద్ధులు
విశ్వవిద్యాలయాలు స్థాపించి, మహొన్నతమైన చరిత్ర సృష్టించారు. విశ్వవిఖ్యాతిని
వెలయించారు. ఆనాటి వైభవాలు చిహ్నాలు చరిత్రలో ఈ నాటికి సాక్ష్యం పలుకుతున్నాయి.
పంచారామాలయిన అమరారామము, కొమరారామము, భీమారామము, ద్రాక్షారామము, క్షీరారామములలో
మొదటిది. పావన కృష్ణా నదీ తీరమున నెలకొనియున్న ఈ క్షేత్రము క్రీస్తు పూర్వ
కాలమునుండి సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రముగా పేరుగాంచి యున్నది. ఇక్కడి ప్రాచీన బౌద్ధ
స్థూపములు, శిల్పములు లెక్కకు మిక్కుటంగా వుండి పూర్వపు ఔన్నత్యమును చాటుతూ శిల్ప
కళా విశేషములను ప్రస్ఫుటిస్తుంది. ఇది శాతవాహనుల కాలం నాటి వరకూ ఒక గొప్ప రాజధాని
నగరంగా అభివృద్ధి చెందిన చిహ్నాలు కనబడుతున్నాయి.
క్షేత్ర వైభవం
ఇక్కడ ముఖ్యంగా చూడదగినది అమరేశ్వరాలయము. వెలసిన దేవుడు అమరేశ్వరస్వామి. దేవేరి రాజ్యలక్ష్మి అమ్మవారు. పంచ ప్రాకారాలు మధ్య ఆలయం ఎత్తుగ నిర్మించబడింది. ఇక్కడ లింగము సుమారు 15 అడుగులు ఎత్తున వుంటుంది. 3 అడుగుల కై వారంతో తెల్లగా వుంటుంది. ఈ లింగమును గూర్చి ఒక వింత ప్రచారంలో ఉంది. ఈ శివలింగము దినదినము పెరుగుతూందనిన్నీ, ఆలయం ఎంత పెంచినప్పటికీ చాలక పోవటంతో ఆలయ నిర్మాతలు లింగము పెరగకుండా నివారించాలనే ఉద్దేశ్యంతో లింగము నెత్తి పై ఒక మేకుని కొట్టారని - అంతటితో పెరుగుదల ఆగిందని సమాచారం. దీన్ని ఋజువు పరస్తున్నట్లుగా - లింగం చాలా ఎత్తుగా ఉండి నెత్తి పైన మేకు - మేకు కొట్టినపుడు స్రవించిన రుధిర ధారల చారలు - గుర్తులున్నాయి. స్వామికి అభిషేకము చేయాలన్నా పైకెక్కి వెళ్ళి చేయాల్సివుంది.
ఈ అమరావతికి ఒక పురాణ కథ కూడా వుంది. దేవేంద్రుడు అహల్యా జారుడై తత్పాప పరిహారార్ధం ఇక్కడ శివలింగమును ప్రతిష్ఠించాడని దేవతల ప్రభువైన సురేంద్రుని చేత ప్రతిష్టించబడినది గాబట్టి ' అమరావతి ' నామము సార్ధకంగా ప్రసిద్ధమయినది అని అంటారు.
ఇక్కడ దగ్గరిలోనే దీపాల తిన్నె అనే ప్రదేశం వుంది. బౌద్ధ విగ్రహాలు, స్థూపాలు గలిగిన చోటు. ఇది ఆర్కిలాజికల్ డిపార్టుమెంటు వారు ఆనాటి ఔన్నత్యపు చిహ్నాలను తమ అధీనంలో వుంచుకుని ప్రాచీన కళా సంపదను కాపాడుతూ ఉన్నారు. చరిత్ర అధ్యయన పరులకు ఇవి ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటాయి.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in