|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
సంగీత వాయిద్యాలు
ఆర్యులు మన దేశానికి రావడం మాత్రం మన దేశ చరిత్రలో చాలా ముఖ్యమైన ఘట్టం. క్రీస్తుకు పూర్వం రెండు వేల అయిదు వందల సంవత్సరాల క్రితం వచ్చిందని చెప్పుకునే ఆర్యుల వేద సాంప్రదాయం మన దేశాన్ని, అతః పూర్వ సాంప్రదాయాల్ని ఎంతగానే మార్చివేసిందని చెప్పాలి. అంతకు క్రితముండిన ఈ దేశపు ప్రజల జీవన విధానాలు, సాహిత్యం, మతం, కళలు అన్నీ గూడా వేద ప్రభావితాలై ఎంతో ఔన్నత్యాన్ని, నాగరికతని పుంజుకున్నాయి. వేద సంహితలన్నీ మానవ జీవన విధానాల వర్ణనలే. ఉదాహరణకు మన సంగీతం ఋగ్వేద, సామవేద జనితమని చెపుతారు. నిజం కూడ అలాగే కనుపిస్తుంది. సామవేద పఠనాన్ని సామగానమన్నారు. సుస్వర బద్ధమైన ఈ సామగానం ఎంతో రంజకమైన, అతి పురాతన గానం అనవచ్చు. అయితే మధ్య ప్రాంతంలోని కొన్ని దేశాల్లోని గానం కూడ ఈ విధంగానే వినబడుతుంది. ఈ ఆర్యులు సామగాన పద్ధతి వారి ప్రత్యేక సృష్టి లేక విధానం అని చెప్పడానికి మనకి ఆధారాలేమీ లేవు. వీరీ పద్ధతిని ఇతర సాంప్రదాయాల నుంచి గ్రహించినదేమో! ఏమైనా ఆ సాంప్రదాయం ఆర్యుల ద్వారా మనదేశంలో ప్రవేశించి, మన జీవన విధానంతో పెనవేసుకునిపోయి మనదైపోయింది. ఇలా ఇతర సాంప్రదాయాల నుంచి విషయాల్ని గ్రహించే, ఒక దేశ సంస్కృతి ముందుకు పయనిస్తుంటుంది. వేద సంహితల్లో ఆ రోజుల్లో ఆ ప్రజలు, పూజా పునస్కారాల్లో, ఉత్సవ సందర్భాల్లో, సంగీత నృత్యాల్లో ఉపయోగించిన సంగీత వాయిద్యాలు అనేకంగా పేర్కొనబడ్డాయి: 1. 'అఘటి ' అంటే తాళాలు; 2.'భూమి దుందుభి ', 'దుందుభి ', 'వనస్పతి ' మొదలైన డప్పులు; 3. 'తూనవ ', 'నాడి ' మొదలైన వేణువుల రకాలు; 4. 'వన ' 'కంద ', 'గోధ ' మొదలైన వీణ రకాల వాయిద్యాలు. ఈ వాయిద్యాల్ని వారు ఎలా నిర్మించారో, వాటిలో రెండు, మూడు తప్పిస్తే, వాటిని ఎలా ఉపయోగించారో తెలుసుకోవడానికి మనకి వర్ణనలేమీ లేవు. ప్రస్తుతం మనం వాడే వాయిద్యాలకి వీటిని ఏమీ పోలికలు లేవని తెలుస్తూంది. పైన చెప్పిన పేర్లన్నీ నామ మాత్రాలుగానే మిగిలిపోయాయి. అయితే ఈ నామాల్లోని పోలికలు మాత్రం ఆర్యుల నాగరికతలో ఇతర ఆసియా సాంప్రదాయాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు వీణ అనే సంస్కృత పదానికి, పురాతన ఈజిప్షియన్ భాషలోని పదం, 'బీస్టు '. సుమేరియన్ భాషలోని పదం 'గిస్బన్ '. జపానీయుల భాషలో అది 'బివా' అయితే, చైనీయుల కది 'పిపా' అయింది. ఈ రకమైన పోలికల్ని ఊరికే ఆషామాషీగా తోసిపారవేయవలసిన విషయం కాదు.
డోళ్ళు
చర్మంతో
కప్పిన వాయిద్యాలన్నీ 'అవనద్ధ వాయిద్యము'లని మన సంగీత గ్రంధాల్లో చెప్పబడింది.
అవనద్ధ అంటే కప్పినవి అని అర్థం. ఒక కర్ర వస్తువునో, గిన్నెనో, చట్రాన్నో తోలుతో
కప్పి, దాన్ని వాయిద్యంగా ఉపయోగిస్తే అది అవనద్ధ వాయిద్యమవుతుంది. డోళ్ళకిది
సామాన్య పదమైనా, 'పుష్కర ' అను ఇంకొక మాట కూడ సాంప్రదాయంగా వస్తూంది, భరతుని
నాట్య శాస్త్రంలో 'పుష్కర' నామం ఎలా ఏర్పడిందో ఒక కథగా చెప్పేడు. స్వాతి అనే ఒక
మహర్షి స్నానార్ధం ఒక కొలను దగ్గరకిపోగా, ఇంద్రుడా సమయాన్నే పెద్ద వర్షం
కురిపించాడట. వర్షం కురుస్తోండగా, ఆ వర్షపు చినుకులు తామరాకుల మీద పడి, -తామర, అంటే
పుష్కర అని కూడా అర్ధం వుంది, - ఆ శబ్దా లాయనకెంతో శ్రోత్రపేయగా, లయ బద్ధంగా
వినిపించాయట. ఇంటికి వెళ్ళిన తర్వాత, ఆ అనిర్వాచ్యానందాన్ని ఆయన మరచ పోలేక,
'విశ్వకర్మ'ను పిలిచి, తను విన్న శబ్దాల వలె ధ్వనించే వాయిద్యాన్ని తయారుచేసి
పెట్టమని కోరగా, విశ్వకర్మ 'వనవ ', 'దర్దుర ' అనే వాయిద్యాలను తయారుచేసి ఇచ్చాడట.
డోళ్ళ తయారీలో రెండు రకాల పరిశ్రమలు అమల్లో వుంటూ వచ్చాయి. ఒకటి కర్ర, రెండు మట్టి పరిశ్రమలు. ఒక చెట్టు కొట్టేసి, దాని కాండాన్ని తొలిచి, లావైన గొట్టం లేక సిలిండర్‌ను తయారు చేసి, దాన్ని ఒక వైపునో లేక రెండు వైపులనో చర్మంతో కప్పి డోలు తయారు చేయడం చాలా కాలం నుంచీ మనకు తెలిసిన పద్ధతే బహుశః ప్రారంభ దశలో వీటిని బాగా పెద్ద ఆకారంలో తయారుచేసి, ఒక వైపునే చర్మంతో కప్పి, నేలమీద నిలబెట్టి వాయించడం అలవాటై వుండవచ్చు. ఆధునికంగా 'లేత్ ' మొదలైన యంత్రాలు వచ్చిన తర్వాత, వీటిని చిన్నవిగా ఇంకా నైపుణ్యంతో తయారుచేయడం నేర్చుకున్నారు. ప్రారంభ దశలో మట్టితో తయారైన డోళ్ళన్నీ ఒకే ఆకారంలో వుండేవని తెలుస్తోంది. రానురాను కుమ్మరి వాళ్ళ నైపుణ్యంతో, 'దర్దుర ' అనే కుండ ఆకారంలో వున్న డోలు, 'తషా' అనే మూకుడు ఆకారంలో వున్న వాయిద్యం, 'తుంబకర్నీ' అనే కూజా ఆకారంలో వున్న వాయిద్యం, మొదలైనవి తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మట్టితో చేసిన వాయిద్యాన్ని, బద్దలైపోకుండా కాపాడ్డం చాలా కష్టం. మృదంగం ఆ కారణం చేత తిరిగి కర్రతో తయారు ఆవడం మొదలైంది. ఆ మార్పులోనే కర్రతోనే కాకుండా లోహంతో కూడ తయారు చేయడం ఆరంభంచి ఉండాలి. 'ఖోల్ 'అనే ఉత్తర భారత దేశపు వాయిద్యం ప్రస్తుత కాలంలో కూడ మట్టితోనే తయారు చేస్తున్నప్పటికీ, మృదంగం, పఖావాజ్ మొదలైన పూర్వం మట్టితో చేసేవారు. ఆధునికంగా కర్ర, లోహాలతో తయారుచేస్తున్నారు.
ఆధర్వణ వేదంతో 'దుందుభి' అనే వాయిద్యాన్ని, స్తుతి చేస్తూ, ఇలా చెప్పబడింది. 'ఓ దుందుఖీ ! వనస్పతితో (వనస్పతి = కర్ర) చేసిన నీవొక మహానాయకుని వంటి దానిని. నువ్వు సింహంలా గర్జించి, మా శత్రువులను హడలగొట్టి, మాకు విజయాన్ని ప్రసాదిస్తావు, అని చెప్పబడింది. ఈ దుందుభి యుద్ధ సమయాల్లోనే గాక, శాంతి సమయాల్లోనుగాక, మత పరమైన పుజా సమయాల్లోను కూడ, ఉపయోగంలో వుండేదని తెలుస్తూంది. వాజిపేయమనే యజ్ఞంలో, రధాల పందేలు జరిగేవని, ఆ పందేల ప్రదర్శన చాలా వైభవంగా చేసేవారని తెలుస్తూంది. ఆ పందెం జరిగే స్థలంలో 17, 18 దుందుభులను అమర్చి, పోటీదారుల సుత్తేజపరుస్తూండే వారని చెప్పబడింది. ఇంకా ఈ దుందుభి వాయించేవారికి, వేణువు వాయించేవారికి, తాళము వేసేవారికి, తదితర వాయిద్యకారులకు కూడ, మకర సంక్రాంతి సమయంలో చేసే మహావ్రత పూజల్లో, తర్పణలిచ్చి పూజించాలని చెప్పబడింది. యజ్ఞ సమయాల్లో దేవతా తృప్తికోసం తర్పణలివ్వడం సామాన్యమైన పూజా విధానం. డోళ్ళను ఈ విధంగా భక్తి భావంతో ఆరాధించడం, కాలక్రమంగా జరుగుతూనే వుంది.
దేశంలో అంతటా బాగా
విరివిగా కనిపించే వాయిద్యాల్లో 'డప్పు ' ముఖ్యమైనది. వాటి ఆకారం, నిర్మాణం, -
ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్కలాగ ఉంటాయి.
సర్వసాధారణంగా వాటిని కర్ర బద్దతో కాని, లోహపు రేకుతో కాని గుండ్రంగా వంచి, చట్రం
తయారుచేసి, చర్మం బిగిస్తారు. తెలుగులో 'తమ్మెట, తమ్మెట ' అంటారు. ఇది ఈజిప్టు
దేశాన్నుంచి మన దేశానికి, శ్రీలంకకు దిగుమతి చేయబడ్డ వాయిద్యమని అభిప్రాయ
పడుతున్నారు. శాస్త్రీయ సంగీత కచ్చేరీల్లో సహిత, మృదంగ, ఘటం, మోర్సింగ్ మొదలైన లయ
వాయిద్యాలతో కలిసి కంజీరాని కూడ ఆదరిస్తున్నారు. సంగీత కచ్చేరీల్లో ముఖ్యమైన
గాయకుడు, గాయని లేక వాయిద్యకారుడు, ఒక కీర్తనో, పల్లవో పాడి, స్వర కల్పన చేసి
ముగించిన తర్వాత, 2, 3 లయ వాయిద్యాలు అనుసరించేవి ఉన్నప్పుడు, ఈ లయ వాయిద్యాల
సామర్ధ్య ప్రదర్శన కోసం, వారికి కొంత వ్యవధి ఇవ్వడం సంప్రదాయం. అపుడు మృదంగం, ఘటం,
కంజీర మొదలైన తాళ వాయిద్యాలన్నీ చేరి, తాళమునకనుగుణంగా, తాళ, లయ విన్యాసాలతో, మొదట
ఒక్కొక్కరు ప్రత్యేకంగా శ్రోతలకెంతో రంజకముగా వాయించి, ఆఖరికి అందరు కలిసి మృదంగ
శబ్దాలతో కూడిన నిర్దిష్టమైన విన్యాసాలతో ఎంతో రక్తిగా ముగింపు చేస్తారు. దీన్ని
'తని ఆవర్తం ' లేక 'తని ' అంటారు.
డోళ్ళ జాతిలో 'భేరి' వాయిద్యాన్ని ముఖ్యంగా చెప్పాలి. ఇవి చాలా పెద్దవిగా తయారై, ఎక్కువ ధ్వనిచ్చేవిగా వుండి, ఉత్సవాల్లోను, వేడుక సమయాల్లోను, యుద్ధ సమయాల్లోను బాగా ఉపయోగపడేవని తెలుస్తూంది. రామయణ కథలో హనుమంతుని బంధించినపుడు, రావణుడు ఈ భేరీని, శంఖాన్ని వాయించమని ఆజ్ఞాపిస్తాడు. రామ, లక్ష్మణులు యుద్ధంలో మూర్చనుంచి తేరుకున్నపుడు వానరులంతా ఈ భేరి, మృదంగ, శంఖాల్ని వాయిస్తూ సంతోషించారని చెప్పబడింది. మహాభారతంలో కూడ యుద్ధ భటులసుత్తేజ\పరచడానికి, ఇతరమైన వాయిద్యాలతో సహా ఈఈ భేరీని ఉపయోగించినట్లు చెప్పబడింది. రామాయణం, మహాభారతాల్లో - (1) మృదంగం; (2) పటహ; (3) నంది వాద్య మొదలైన డోళ్ళను పేర్కొన్నారు. ఇవి యుద్ధాల్లోనే కాకుండా, ఉత్సవాల్లోను, సంబరాల్లోను కూడ ఉపయోగపడేవి. రామయణంలో వాల్మీకి, వర్ష ఋతువునిలా వర్ణించాడు. 'భ్రమరాల 'ఝం' కారం, తంత్రి నాదం వలె, కోతుల 'కిలకిలా నాదాలు లయ విన్యాసాలుగా, చెట్ల పైకొమ్మలన్నీ గాలిలో 'పాడుతూ', నల్లని మేఘాలు 'మృదంగ ' శబ్దాల్ని మోగిస్తూన్నట్లుగా వర్ణించాడు. జాతక కథల్లో, మృదంగాన్ని, 'వమురజ ' వాయిద్యాన్ని పేర్కొన్నారు. జైన సాహిత్యంలో కూడ డోళ్ళను పేర్కొనడం జరిగింది. మహాభారతానికనుబంధమైన హరి వంశంలో, 'చాలిక్య ' అనే సాముదాయిక గీతంలో, నారదుడు వీణ వాయిస్తున్నట్లు, కృష్ణుడు వేణువు వూదుతున్నట్లు, అర్జునుడు మృదంగం వాయిస్తూ తాళాన్నందిస్తున్నట్లు చెప్పబడింది. కాళిదాసుని రఘువంశ కావ్యంలో, స్త్రీల స్నాన వినోద ఘట్టాన్ని వర్ణిస్తూ, 'వాళ్ళు స్నానం చేస్తూ, పాటలు పాడి, నీళ్ళని మోది, మృదంగ శబ్దాల వంటి ధ్వనుల్ని చేస్తుంటే, వొడ్డున నుంచుని పురి విప్పి అడుతున్న నెమళ్ళకు, వారికి కూడ ఆ శబ్దాలెంతో శ్రోత్రపేయంగా వినబడుతున్నా'యని అంటాడు. శ్రీ మద్భాగవత పురాణంలో ధ్రువుడు కైలాసానికి బయలు దేరిన ఘట్టం - 'ఉత్తానపాదుని పుత్రుడైన ధ్రువుడు తనకు మోక్ష సమయ మాసన్న మైనదని తెలుసుకొని, మృత్యువు తలకాయ మీద తన కాలిని మోపి, ఆ దివ్య రధాన్ని అధిరోహించాడు. దేవతలు పైనుంచి మృదంగ, పనవ, దుందుఖి మొదలైన వాయిద్యాల్ని వాయించారు. గంధర్వులాతని స్తుతిస్తూ పుష్ప వర్ష కురిపించారని ' వర్ణింపబడింది. భరతుని నాట్య శాస్త్రింలోను, ఆ తర్వాత కాలంలోను గ్రంధాల్లోనూ కూడ, మృదంగానికి, మృదంగ రకాలైన ఇతర వాయిద్యాలకి, విశిష్టమైన స్థానాన్నిచ్చి, ప్రత్యేకంగా వర్ణించబడుతూ కనిపిస్తాయి. భరతుడు 'పుష్కరా సామన్య తాళ వాయిద్యాలన్నింటికి ఉపయోగించి, మృదంగం, వాటిలో ఒకటని చెపుతాడు.
'ఢోలక్',
' ఢోల్ ' వాయిద్యాల్ని ఇదివరలో చెపుతున్నాం గాని, వాటిని వర్ణించలేదు. ఎందుకంటే,
వీటిలో ఎన్నో విస్తారమైన రకాలున్నాయి. వాటిలో సాధారణ లక్షణం, రెండు ముఖాలున్న
వాయిద్యాలని మాత్రం చెప్పగలం. పెద్ద రకాల్ని ' ఢోల్ ' లేక 'ఢక్' అని, చిన్ని వాటిని
'డోలక్' అని అంటారు. వాటి ఆకారంలో చాల వ్యత్యాసం ఉంది. బెంగాల్‌లోని 'ఢక్' చాలా
పెద్ద వాయిద్యం. ఢోలక్ చిన్నదిగనుక చిచ్చగాళ్ళు వాయిస్తూంటారు. పెళ్ళిళ్ళలో
స్త్రీలు గూడ దీన్ని వాయిస్తూంటారు. ఆకారంలో కూడా, అవి కేవలం గుండ్రంగా వుండేవి,
మధ్య లావుపాటివి, చర్మాన్ని బిగించడంలో వ్యత్యాసాలు, ఎన్నో రకాలుగా కనిపిస్తాయి.
ఢోళ్ళు, ఢోలక్‌లుకూడ, మెడలో వేళ్ళాడవేసుకుని, నడుం దగ్గరగా ఉంచి, కర్రతో గాని,
చేత్తో గాని, వాయించే వాయిద్యాలని చెప్పాలి. అవనద్ధ వాయిద్యాల్లో మూడో రకం,
మధ్యభాగం సన్నంగా వుండి, ముఖాల వద్ద లావుగా వుండే రకాల వాయిద్యాలు. ఇది బాగా
పురాణప్రసిద్ధమైన రకం. ఒకప్పుడు ఈ రకం వాయిద్యాలు బాగా ప్రజాదరణలో వుండేవని,
శాస్త్రీయ సంగీతానికి కూడ వీటిని ఉపయోగించేవారని తెలుస్తూంది. అది ఈ నాడు జానపద,
గిరిజన వాయిద్యంగా మిగిలిపోయింది. మొహంజదారో త్రవ్వకాలలో ఈ వాయిద్యం, శిల్పాలల్లో,
శిల్పాల బొమ్మల్లో, విగ్రహాల్లో, రంగు చిత్రాల్లో ఇది కనిపిస్తోంది.
రామాయణ,మహాభారతాల్లో దీన్ని 'వనవ ' అనే పేరుతోను, సూత్ర గ్రంథాల్లో గూడ ఈ
వాయిద్యాన్ని పేర్కొనడం జరిగింది. జాతక కథల్లో 'డిండిమ ' అనే పేరుతో పేర్కొన్నారు.
తమిళ గ్రంథాల్లో, 'ఏటుక్కై' అని, 'తిమిలై' అని చెప్పారు. ఈనాటికి కూడ ఈ రకాల్లోని
కొన్నివాయిద్యాలు కనిపిస్తాయి. 'అవుజ్' అనే కరం వాయిద్యాన్నే, కొందరి అభిప్రాయంలో,
సంస్కృతంలోని 'ఆతోద్య ' నామానికి దగ్గిరగా వుందని, ఈ పదం సంస్కృతం నుంచి
వచ్చిందేననీ అంటారు. సంగీత రత్నాకర కాలం నుంచి ఇది బాగా తెలిసొస్తోంది. 'అయినీ
అక్బరీ' గ్రంథంలో కూడ ఇది వర్ణించి పేర్కొనబడింది. ఇలాంటి మధ్యభాగం సన్నంగా వుండి,
మునపటి కాలంలోను, ఈ కాలంలోను కూడ కనిపించే వాయిద్య రకాల్లో (1) 'హుడుక్క; (2)
'డేక్కా లేక 'ఢంకా; (4) 'త్రివలీ; (5) 'బుడ్బుక్క ' లేక కుడుకుడుప్పై'; (6) 'తుది '
అని అనేక రకాలు దేశ వ్యాప్తంగా వున్నాయి. ఇవన్నీ కూడ వాటి ఆకారంలోను, నిర్మాణంలోను,
వాయించే విధానాల్లోను చాలా తేడాలతో, వీటిలో కొన్నిటికి ఒకే వాయిద్యానికి పలుచోట్ల
వేర్వేరు పేర్లతో వ్యవహరింపబడు తున్నాయి.
సితార్ వాయిద్యాన్ని గురించి తగాయిదాలున్నట్లే, తబలా వాయిద్యాన్ని గురించి కూడ, దాని చరిత్ర, పేర్లనుబట్టి అనేక రకాలైన చర్చలు, వ్యాఖ్యానాలు, సాగుతూనే ఉన్నాయి. 'తబలా' అనే పేరు మాత్రం పెర్షియన్ పదం. కాని, ఇది అన్ని రకాల డోళ్ళకు ఒక సాధారణ నామం కూడ. అంత మాత్రం చేత అది పెర్షియన్ వాయిద్యమంటే ఎలాగ? మన దేశానికి వచ్చిన విదేశీయులంతా, ఇక్కడి వాయిద్యాన్నే ఈపేరుతో వ్యవహరించి ఎందుకుండకూడదు? ఇది 'నకారా' వాయిద్యాన్ని గురించిన గాయిదాలాగే ఉంది. మన దేశంలో అనాదిగా వస్తూన్న 'దుందుభి ', 'నిస్సాన్ ' మొదలైన గిన్నెల ఆకారంలోని వాయిద్యాల వలెనే, ఈ నకారా వాయిద్యాం కూడ కనిపిస్తుంది. తబలా మనదేశపు వాయిద్యమే అనడానికి చాలా నిదర్శనాలున్నాయి. కోణాకారం గల గిన్నెల వంటి వాయిద్యాలు, క్రీస్తుపూర్వం, తర్వాత కూడ, ఎన్నో శిల్పాల్లో కనిపిస్తున్నాయే! 3 వ శతాబ్దలోని ఒక శిల్పంలో, ఒక స్త్రీ తన ఒళ్ళో 'టముకు ' వాయిద్యం వంటి వాయిద్యాన్ని పెట్టుకుని చేతులతో వాయిస్తున్నట్లు కనబడుతుందే! మన 'డగ్గ ' వాయించినట్లు ఒళ్ళో నుంచుని వాయించడం, మన పద్ధతి కాదు? అలాగే చేతులతో వాయించడం మన పద్ధతే. అలాగే తబలా వాయిద్య తయారీ కూడ, దాని ముఖాన్ని చర్మం పొరలతో తయారుచేసి కప్పడం మన పద్ధతే గద! ఎన్నో అవనద్ధ వాయిద్యాల తయారీలో ఇది మనకలవాటైన పద్ధతే, అదిగాక, చర్మం మీద కొద్దిపాటి బరువుతో వుండే 'కరణి ' లేక 'శోరు ' అంటించి వాయించడం మన దేశంలోను, బర్మా దేశంలోను కూడ అలవాటైన విషయం, రెండు రకాలైన డోళ్ళను కలిపి వాయించడం మన పద్ధతి, ఈ నిదర్శనాలన్నీ తబలా మన దేశలో అనాదిగా కనిపించే వాయిద్యాల కొవలోదే అనడానికి చాలు. ఏటొచ్చీ మధ్య యుగం తర్వాత, విదేశీయుల అధికారం చెలామణి అయిన రోజుల్లో మన వాయిద్యాలకే వారి నామధేయాలంటగట్టి, వాటిని కొత్తగా తమ స్వంతమని చెప్పుకుంటూ వచ్చినట్లు తెలుస్తూంది. పదునాలుగవ శతాబ్ధంలోని అస్సాం సాహిత్యంలో గ్రంధంలో గాని, దాని సమకాలీనమైన సంగీత పారిజాత గ్రంధంలోగాని దీని పేరు - అంటే తబలా అనే పేరు - ఎక్కడ వెతికినా కనపడదు. ఈనాటి మన 'తబలా' రెండు డోళ్ళు కలిపి వాయించేది. రెండింటిలో ఒకటి అసలు 'తబలా' అనే వాయిద్యం, ఇంకొక డోలుకి 'డగ్గ ', 'దుగ్గి ', 'బాయన్ ' అనే పేర్లున్నాయి. తబలా తప్పకుండా కర్రతోనే చేస్తారు. తబలా కింది భాగం పెద్దదిగాను వుండి, రెండు సెంటీమీటర్ల వెడల్పుతో వుండి ముఖాన్ని చుట్టి అంటుకు నుండే ఇంకొక తోలు వలయానికి అతకబడి ఉంటుంది.
ఈ తోలు వలయానికి హిందీ భాషలో 'చంటి ', ;కిసరా', అనే పేర్లునాయి. ఈ తోలు వలయాన్ని 'గజ్రా' అనే తోలు జడకి కుట్టి చేస్తారు. ఇపుడు దీన్నంతా కలిపి 'పూడీ అంటారు. ఈ పూడితో తబలా ముఖాన్నంతా కప్పుతారు. పైనా చెప్పిన 'బజ్రా' అనే తోలు జడ మీద నుంచి, కింద నుంచి పోతున్న తోలు పట్టాతో కింద నుండే ఒక గుండ్రని తోలు ముక్కకి బిగిస్తారు. తోలు పట్టాకింద చిన్న కర్ర ముక్క లుంచుతార, ఈ కర్ర ముక్కల్ని కిందకి జరిపి నందువల్ల తబలా ముఖం బిగిసి శృతి హెచ్చడం లేక పైకి జరిపితే తబలా ముఖం అంచుగా దున్న 'గజ్రా' మీద గట్టి రాయితో గాని, సుత్తితో గాని కొట్టి సరిచేసుకొవచ్చు. హిందీ భాషలో 'స్యాహి ' అనే కరణి లేక శోర్ ' దీని ముఖం మీద కూడ ఉంటుంది. రెండవ డోలైన 'డగ్గ ', ఆకారంలో తబలాకు కేవలం వ్యతిరేకంగా, అంటే కింద సన్నంగాను, ముఖం దగ్గిర బాగా పెద్దదిగాను ఉంటుంది.తబలా ముఖాన్ని 'పూడి ' తయారుచేసి బిగించినట్లే దీనికి కూడ బిగిస్తారు. దీనిలోని 'స్యాహి ' మధ్యలో వుండక, ఒక వక్కకి ఉంటుంది. డగ్గను ఈ రోజుల్లో లోహంతో చేస్తున్నట్లు తెలుస్తోంది కాని పూర్వం దీన్ని కూడ కర్రతోనో, మట్టితోనో చేసేవారు. దీన్ని శృతి చేయడానికి ఏర్పాటేమీ లేదు. తబలాను కుడి చేత్తోను, డగ్గను ఎడం చేత్తోను వాయిస్తారు. తబలా వాయించడంలో కుడి చేతి వేళ్ళ చిగుళ్ళు, వేళ్ళ మధ్య భాగం, అరిచేయి నుపయోగించి వాయిస్తారు. డగ్గను ఎడం చేతి వేళ్ళ మధ్య భాగం తోను, అర చేత్తోను, అర చేతి కింద వున్న ముంజేత్తోను వాయించడం సాంప్రదాయంగా వస్తూంది. తబలా పై వాయించే శబ్ధాలన్నింటికి అక్షర సంకేతా ల్న్నాయి. మృదంగ వాయిద్యంలో కూడ ఇలాటి శబ్ధాలకు 'శొల్ కట్టు ' అంటారు. అలాంటి నియామకమైన శబ్ధ సంకేతాలతోనే, తబలావాయిద్యంలో, వేరు వేరు 'ఘరానా' లేర్పడ్డాయని చేప్పాలి. ఈ ఘరానాల్లో, 'డిల్లీ ఘరానా' అని, 'అజ్రాదా ఘరానా' అని, 'లక్నో - వారాణాసి ఘరానా' అని, ఫరూకాబాద్ ఘరానా' మొదలైన రకాలున్నాయి. రెండు కంటె ఎక్కువ ముఖాలున్న డోళ్ళ రకాలు, ఎక్కడో బొమ్మల్లో తప్ప.
తాళం యొక్క కాల ప్రమాణాన్ని ఖండాలుగా విభజించి, ఆ విభజించిన ఖండాలను సరియైన అక్షర శబ్ధాలతో సరిజూసి నోటితో చెప్పడం, ఈ అక్షర శబ్ధాల కలయిక వల్ల నుంచి తాళ కాలగతిని సరిజూసుకుంటూ వాయించడం, చాలా కాలం నుంచి మన సాంప్రదాయం. ఇటువంటి కాల ఖండాల్ని అక్షర శతాబ్ధలతో ఉచ్చరించడాన్ని, మృదంగ వాయించేవారు 'శొల్ కొట్టు ' అంటారు. తబాల వాయించేవారు 'బోల్ ' అంటారు. పఖావాజ్ వాయించేవారు. 'తాపి ' అంటారు. అక్షర శబ్ధాలు వాయిద్యం మీద వాయించి పలికేప్పుడు, చేతిలో ఏవేళ్ళను, వేళ్ళ భాగాలను, ఎంత ఉపయోగించాలి. అరచేతి దెబ్బ ఎక్కడ వాయించాలి. ముంజేతి నెలా ఉపయోగించాలి. ఇదంతా ఇక శాస్త్రీయ పద్ధతిలో జరుగుతున్న విధానం. సంగీత గ్రంధాల్లో దీన్నీపటాక్షర ' అని, 'పట ' అని, 'అక్షరా అని చెప్పేరు. సంతాలు అనే గిరిజనులు సహితం, వారు వాయించే డోళ్ళశబ్ధాలకు 'రద్ ' అనే పేరుతో వ్యవహరించేవారని తెలుస్తూంది. 'పట ' అనే పేరుగల ఈ అక్షర శబ్ధాలకే హిందూస్థాని సంగీతంలో 'పరన్ ' అని, 'వైదా' అని, 'రేలా' అని పేర్లునాయి. దక్షిణాత్యు లీశబ్ధాలకే 'శొల్ కొట్టు'లంటారు. ఈ శబ్ధాల్ని మనస్సులో గుర్తు చేసుకుంటూ, తాళగతికి అనుకూలంగా వాయించడమే, వాయిద్యకారుల నేర్పరితనాన్ని మనకు తెలియజేస్తూంటుంది.
సుషిర వాయిద్యాలు
గాలి
వాయిద్యాలు లేక ఊది వాయించే వాయిద్యాలు లేక సుషిర వాయిద్యాలను గూర్చి
తెలుసుకోవడానికి అంటే వాటి ప్రధమ దశను, పరిణామ చరిత్రను ఊహించడానికి మనకు దొరికే
ఆధారాలు మిగతా వాయిద్యాలకంటె తక్కువని చెప్పాలి. త్రవ్వకాలలో మట్టి డోళ్ళు తాళాలు,
తీగె వాయిద్యాలకంటే అవశిష్టాలు మొదలైనవి దొరుకుతాయి, కాని గాలి వాయిద్యాల్లో ఎక్కడో
ఒక కొమ్ము, ఊదే మట్టి బూరా తప్ప, చాలా తక్కువ దొరుకుతాయి. ఈ కారణం వల్ల వాటి
నిర్మాణాన్ని, ప్రధమ స్వరూపాల్ని, సంఘంలో అవి ఎంత ప్రాముఖ్యంగా వుండేవి మొదలైన
విషయాలు శోధించడం కష్టమవుతుంది. గాలి వాయిద్యాల్ని ఆదిమానవులెలా కనుగొన్నారు? వాటి
ప్రాధమిక స్వరూపాలేవిధంగా వుండేవి అంటే ఏదో మనం కొంతవరకు ఊహించుకోవడం తప్ప, దానికి
నిదర్శనాలు, సాక్ష్యాలు మనకు విస్తారంగా కనుపించవు. అడవుల్లో ఉండే వెదురు పొదల్లో,
ఒక వెదురుకు కన్నముంటే, దానిలోకి గాలి దూరి, 'ఊల ' వలె వినిపించి, మానవునికి అది
ప్రధమ 'వేణు'ని స్వరూపంగా తోచిందేమో! కాని, దీనిలో మానవ యత్నమేమి లేదు, అంటే ఆ
వెదురు 'వేణు' ని వాళ్ళు తయారు చేయలేదుగద! అందుచే మన మనస్సుతో కొంత ఆలోచించాలి.
ఆలోచిస్తే నోటితో 'ఈల ' లేక 'ఊల ' వెయ్యడం ఒకటిగా తోస్తుంది. ప్రకృతిలోని
పక్ష్యాదులు గమనించి, కుర్రవాళ్ళు, పెద్దవాళ్ళు కూడ 'ఈల ' నోటితో వేయడం నేర్చుకుని
ఉండవచ్చు.
కర్రతో చేసిన గాలి వాయిద్యాలు మనకు త్రవ్వకాలలో దొరికే అవకాశం లేదు. ఏమంటే కర్ర మట్టిలో వుండలేక చీకిపోయి కాలగర్బంలో నశిస్తుంది త్రవ్వకాలలో మనకు ఇంతవరకు అక్కడక్కడ కనిపించినవి, మట్టిబూరాలు, ఎముక బూరాలు, మొదలైనవి. మధ్య యుగంలో కొన్ని కన్నాలు గల వేణువులు, శంఖాలు, లోహాలతో తయారైన బూరాలు దొరికాయి. ఇంకా ఇటీవలి కాలంలో వెదురుతో చేసిన వేణువులు, బాకాలు మొదలైనవి కనపడ్డాయి. ఇంకా ఓబో, శహనాయి, నాగస్వరం మొదలైన వైతే బొత్తిగా దగ్గిర కాలం లోనివేనని తెలుస్తుంది. సింధు నాగరికతను సూచించే త్రవ్వకాలల్లో మనకు పక్షి ఆకారంల్లో ముగిసే మట్టి బూరాలు దొరికాయి, అందుకోసం వాటిని 'పక్షి బూరాలు ' అన్నారు. ఈ రోజుల్ల్లో సహితం హిమాలయ ప్రాంతాల్లో ఎముకతో చేసిన 'ఊలలు ' దొరుకుతూంటాయి. ఆంధ్ర, ఒరిస్సా ప్రాంతాల్లో నివసించే సవరలనే గిరిజనులు 'ఫ్లూట్ 'ను కనుగొన్నారని ఒకానొక పండితుని అభిప్రాయం డోళ్ళ మాదిరిగానే, గాలి వాయిద్యాలు, ముఖ్యంగా వేణువు, బాకాలు సాంఘిక, మతపరమైన అనేక కార్యకలాపాల్లోను, ఆచారాల్లోనూ ఉపయోగించే వాయిద్యాలు. ఈ రెండు వాయిద్యాలు కూడ, ఆటవిక జాతుల్లోను, తరువాత వచ్చిన 'నాగరికుల్లోను ' కూడ వాళ్ళ లైంగిక జీవితపు అలవాట్లతో పెనవేసుకున్న వాయిద్యాలు. ఏమంటే బాకా 'పురుషుని చిహ్నం ' తత్వ శాస్త్రజ్ఞుల కొందరి అభిప్రాయంలో, ఇవి పురుష చిహ్నాలు గనుకనే యుద్ధ ప్రేరణ కోసం వాడేవారని, వేణువుకు కూడ ఇలాంటి సాంకేతిక దృష్టి చాలాకాలంగా వస్తూంది.
మన శ్రీకృష్ణుని వేణునాదం గోపికలందర్ని ఆకర్షించి, అహ్వానించడం కోసమేనని పురాణ గాధల వల్ల మనకి తెలిసిన విషయమే. బృందావనంలోని గోపిక లందరూ వేణువును చూసి అసూయపడిపోతూ ఇలా అంటారు. 'ఈ వేణువు ఎంత పుణ్యం చేసుకుందో, ఆ శ్రీకృష్ణపరమాత్ముని పెదవుల దగ్గిర ఉంటూ, మనకి చెందవలసిన ఆయన అధరామృతాన్ని ముందుగా తానే గోలుతూ, మనకి ఆఖరుకి ఆ ఉచష్టం మాత్రం మిగులిస్తూంది' అని. ఇంక పెళ్ళి పెద్దలైన నొదులూ, వెదురు పొదరిళ్ళు తమ కుమార్తె వేణువు, శ్రీకృష్ణుని పెదవుల దగ్గిర నాట్యం చేస్తూన్న 'వివాహం ' చూసి, సంభ్రపడిపొతూ 'ఆనందాశ్రువులు ' రాలుస్తున్నాయట. అయితే శ్రీకృష్ణుని అమర వేణుగానం మానవులకు జీవాత్మ పరమాత్మల అలౌకిక దివ్య సందేశం కూడాను. అలాగ శ్రీకృష్ణ గోపికా ప్రణయాన్ని, రాధాకృష్ణుల అమర ప్రణయాన్ని జీవాత్మ పరమాత్మల దివ్య సమ్యోగంగా, గుర్తించి, మన మహాభక్త కోటులందరూ గానంచేస్తూ తరించారు. ఈ ప్రణయ గాధలో మన వేణువు పాత్రను మాత్రం మనం మరిచిపోలేం. మానవ కళేబర వీణను, తన 'దివ్యగానానికి ' వినియోగించుకుంటాశని మన తత్వవేత్తల విశ్వాసం. ఆఖరు విషయం, కొన్ని రకాల మానసిక రుగ్మతల్లో, వేణునాద, నకారాధ్వనులు, ఉరుములు మొదలైన ధ్వనులు మనస్సులో వినబడతాయని నిదర్శనాత్మకమైన సత్యంగా నిరూపింపడింది.
ఈనాటికి మన జానపదులు, గిరిజనుల వారి సంగీతాల్లో కొమ్ముల్ని ఉపయోగిస్తూనే వున్నారు. సంస్కృతంలో కొమ్ముని 'శృంగ ' అంటారు. గనుక గ్రంధాల్లో 'శృంగ ' అనే పదమే మనకి కనిపిస్తుంది. ద్రవిడ భాషలో అది 'కొంబు ' అయింది. ప్రాధమిక దశలో అవి జంతువుల కొమ్ములే అయివుండాలి గాని తర్వాత కాలంలో లోహాలతో తయారైన బాకాల్ని కూడ కొమ్ములనేశారు. దీనితో మనకి కొంత సందేహానికి తావేర్పడుతుంది. గిరిజనుల్లో కూడ 'శృంగ ' అనే పదం బాగా వ్యాపించింది. ఖిల్లుజాతి గిరిజనులు దాన్ని 'సింగే ' అంటే, మధ్యప్రదేశ్‌లోని 'మరియు ' జాతివారు 'కోహల్ ' అంటారు. ఈశాన్యలో ఉండే 'అంగామీ ' జాతివారు గేదెకొమ్ముల్ని 'రెలికి ' అంటారు. 'లోటానాగులు ' కూడ ఈ కొమ్ముల్ని ఉపయోగిస్తారు.
ఇది సుమారు అర్ధమీటరు పొడుగుండి, ఊదేచోట ఒక చిన్న వెదురుగొట్టం కూడ (బౌత్‌పీస్) అతకబడి ఉంటుంది. 'సంతాల్ ' జాతివారు 'సక్నా ' అనే పేరుతో గేదె కొమ్మునుపయోగిస్తారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో కొన్ని చోట్ల 'విసాన్ ' అనే పేరుతో గేదె కొమ్ముల్ని, కొన్ని చోట్ల 'సింగి ' అనే పేరుతో లేడి కొమ్ముల్ని కూడ ఉపయోగిస్తారు. లేడి కొమ్ము శివప్రీతి కూడాను. ఇంతవరకు చెప్పిన కొమ్ముల రకాలన్నీ వాటి కొసలనుంచి ఊది వాయించేవి, గాని ఒరిస్సాలోని సంతాల్ జాతి గిరిజనులు 'సింగ ' లనే పేరుతో ఉన్న కొమ్ముకు పక్కని కన్నముండి, ఆ కన్నంలోంచి ఊది వాయిస్తారు. ఈ కొమ్మును పక్కనుంచి వాయించేది అనాలి. జానపద సాహిత్యంలో ఈ కొమ్ము బూరాలు, పక్కనుంచి వాయించే రకాలు కూడా కనిపిస్తాయి. శ్రీకృష్ణుడు గోపాలకుడు గద! అయన్ని భాగవతంలో 'శృంగప్రియ ' అని వర్ణించేరు. ఆయన శృంగాన్ని పూరించి, గోపాలురను మేలుకొలిపినట్లు ఒక చోట వర్ణించేరు. సంగీత మకరంద గ్రంధకాల నుంచీ, శృంగాన్ని సుషిర వాయిద్యాల్లో ఒక దానినిగా వర్ణిస్తున్నారు.
శంఖం
అనాదిగా ప్రపంచమంతటా ఉపయోగిస్తూన్న వాయిద్యం. దీన్ని పూజా సమయాల్లోను, సంగీతానికి,
ప్రమాదాల్లో సాంకేతిక సందేశాల్నివ్వడానికి వినియోగిస్తారు. దీన్ని అస్పీరియన్,
మెక్సికన్, పెరూవియన్, చైనీస్ సంస్కృతుల్లోను, మన సంస్కృతిలోను కూడ అనేక విధాలుగా
ఉపయోగిస్తున్నారు.మన దేశంలో కన్యాకుమారి నుంచి హిమాలయ పర్వతాల వరకు, పశ్చిమాన్ని
గుజరాత్ నుంచి తూర్పున మేఘాలయ వరకు శంఖాన్ని తెలియని వారు, ఉపయోగించని వారు లేరు.
సుషర వాయిద్యాల్లోని ఇది సంగీతానికంత ప్రయోజనకారి కాకపోయినా, దీన్ని సామాన్య
ప్రకటనలకు యుద్ధ ప్రకటనలకు ఉపయోగించేవారు. ఈ రోజుల్లో సైతం పూజల్లోను, జానపద
సంగీతంలోను, నాట్యాల్లోను ఉపయోగిస్తున్నారు. పంచ మహా శబ్ధాల్లో ఇది ఒకటి గనుక, పంచ
వాయిద్యాల్లో ఇది ఒకటి. చరిత్రపరంగా చూస్తే, హరప్ప నాగరికత కాలం నుంచి వస్తూన్న
వాయిద్యమే కాని, అక్కడ కనిపించే శంఖం, సంగీత వాయిద్యమో, కాదో సందేహాస్పదమే.
వేదకాలంలో కూడ ఇది బాగా ప్రసిద్ధమైన వాయిద్యమని చెప్పాలి. ఏమంటే దీన్ని 'బకుర ' అని
వేదంలో చెపుతూ వచ్చారు. సూత్ర సాహిత్యంలో కూడ 'గోముఖ ' అనే వాయిద్యాన్ని చెప్పారు.
బహుశః అది శంఖమో, శంఖం వంటి వాయిద్యమో అయి ఉండవచ్చు. విస్తారంగా బయళ్ళలో వాయించే
వాయిద్యమైనందున, మహా కావ్యాల్లో, ఇతర సాహిత్యంలోను, రాజ్యాలకోసం జరిగిన
యుద్ధాల్లోను, విజయ ప్రకటనలకు, సంతోషకరమైన ఉత్పవ సందర్భాల్లోను, శంఖనాదం శుభసూచకం
కనుక ఈ వాయిద్యం ఆవశ్యకంగా వినియోగపడేది. ఉదాహరణకు, రాముణ్ణి కలుసుకొవడానికి భరతుడు
నందిగ్రామం చేరుకోగానే, దుందుభి, శంఖనాదాలతో వారి రాకనక్కడివారిని తెలిపినట్లు
చెప్పబడింది భాగవతంలో శ్రీకృష్ణుని ద్వారకా ప్రవేశం ఈ రీతిగా వర్ణింపబడింది.
'ద్వారక నగరాన్ని సమీపించగానే శ్రీకృష్ణుడు తన రాకను ద్వారక వాసులను తెలియజేయడానికి
శంఖం పూరించేడట, తెల్లటి శంఖం, ఎర్ర కలువరంగులో ఉన్న ఆయన అరచేతిలోనికి చేరగానే ఎర్ర
కలువల మధ్య ఉన్న హంసవలె కనబడినదట. శంఖాన్ని వాయించడానికి తయారు చేయడం బహు సులువైన
పని, పైన మూసుకుని ఉన్న చివరి భాగాన్ని కొంచెం కొట్టి ఒక కన్నం ఏర్పరచాలి.లోపల
గుండ్రగా చుట్టిన మార్గం శంఖముఖం వరకు ఉంటుంది. పెదవుల్ని చేసిన కన్నానికి ఆనించి,
పెదవులతో ధ్వని చేస్తూ, బలంగా గాలి ఊదాలి. ఈ కన్నం కొన్ని శంఖాల్లో తిన్నగా కొసని
ఉండక కొంచెం పక్కకి కూడ ఉండవచ్చు. కొన్ని శంఖాలకు చిన్న ఇత్తడి బిళ్ళతో చేసిన
'మౌత్‌పీన్ 'లు పెట్టి వాయించడం కూడ అలవాటుంది. ఇదివరలో ఉదహరించిన 'బర్‌హత్ '
చిత్రంలోని కోతుల ఉత్సవంలో, ఒక కోతి శంఖాన్ని ఊదుతూన్నట్లు చూపబడింది. ఆ శంఖానికి
ఒక పొడగైన గొట్టంవలె వుండే 'మౌత్‌పీన్ ' అతికినట్లు చూపబడుతుంది.
దేశమంతటా బాగా వ్యాపించి ప్రసిద్ధిమైనవి మనం కచేరీల్లో చూసే, నోటి కడ్డంగా పెట్టుకుని వాయించే ఫ్లూట్ లేక వేణువు వాయిద్యాలు. పైన చెప్పిన కొస నుంచి వాయించేవి, 'ముక్కూ కొసలతో ;వాయించేవి, జానపదుల్లోను, గిరిజనుల్లో తప్ప, శాస్త్రీయ సంగీతానికువయుక్తాలు కావు. నోటి కడ్డంగా పెట్టుకుని వాయించేవి జానపదుల్లోను, శాస్త్రీయ సంగీతంలోను గూడ దేశంతటా గారవింపబడే వాయిద్యాలు, ఏమంటే వాయించే వాళ్ళు వీటి కన్నాన్ని చేతి వేళ్ళతో పూర్తిగా కప్పడం, సగంగానూ కప్పడం మొదలైన పనులు వేళ్ళతో, ఊదే కన్నంలోకి పెదవులతో అతి లాఘవంగా, లేకపోతే అతి బలంగా నోటి గాలిని ఊది వాయిస్తారు గనుక శాస్త్రీయ సంగీతానికి కావలసిన గనుక సౌందర్యాలు, గురుత్వ లాఘవాలు ఏర్పడి, వినే శ్రోతలకి ఎంతో మనోహరంగా వినబడుతుందీ అడ్డంగా వాయించే వేణువు. ఇదే వీటిలో వుండే విశిష్ట లక్షణం. నోటి అడ్డంగా పెట్టుకుని వాయించే ఈ రకం వేణువు, ఒక కొసని మూసి, ఇంకో కొసని తెరచి వున్న, సుమారు 35 సెంటీమీటర్ల పొడమైన వెదురు గొట్టం. మూసి వున్న కొన నుంచి కొద్ది సెంటీమీటర్ల దూరంలో ఒక కన్నం ఉంటుంది. ఈ కన్నం నుంచి కొద్ది దూరంలో ఒకటి తర్వాత ఒకటిగా కొన్ని కన్నాలుటాయి. ఇక్కడ ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి. మన దేశంలో తయారయ్యే వేణువులన్నీ, కన్నాన్ని కప్పడానికి 'మీటలు ' లేకుండా తయారయ్యే రకాలు. మీటలతో కన్నాల్ని కప్పి వాయించే రకాలు మన దేశంలో లేవు. ఉదాహరణగా వేణువు, నాదస్వరం, శహనాయ్ మొదలైన వాటిని చెప్పాలి. ఈ మీటలు లేనందు వల్లనే. పైన చెప్పినట్లు, వాయించేవాళ్ళు వేళ్ళ నుపయోగించి, కన్నాన్ని నైపుణ్యంతో స్వాధీనంలో ఉంచుకొని వాయిస్తూ, శాస్త్రీయ సంగీతానికి ఉపయోగించ గలుగుతున్నారు. వేణువుల తయారీకి వెదురు గొట్టాలే అనువుగా ఉంటున్నాయి. వీటిలో నాదం మొత్తంగాను, శ్రావ్యంగాను ఉంటుంది. ఇవి లోహాలతో తయారైతే ఈ శ్రావ్యత, మెత్తని నాదం అంత బాగా ఉండదు. వేణువుల్లో పొట్టి వాటిని త్వరితంగా వాయించే సంగీత శైలికి, హెచ్చు శృతులకు ఉపయోగిస్తారు. పొడుగుపాటి వేణువుల్ని ముందుగా వుండే సంగీతానికి, తగ్గు శృతులకు వాడతారు. వేణువు అంటే వెదురు గొట్టం అని అర్థం గనుక ఇక్కడ నామమే వస్తు సూచకం. ఉత్తరాదిని దీనికి 'వంశి ', 'బస్సీ', 'బాన్సురి ' అనే పర్యాయ పదాలు వాడుకలో వున్నాయి, తమిళ భాషల్లో 'కుళల్ ', 'పిల్లాన్‌కుళల్ ' అనే పేర్లు; కన్నడ భాషల్లో 'కొళవి ' అని, తెలుగులో 'వేణువు ', 'పిల్లనగ్రోవి ' అని అంటారు. వేదాల్లో దీన్ని 'వేణు ', 'తూనవ ', 'నాడి ' అని చెప్పారు.
ఇంతవరకు చెప్పిన వేణువుల్లోను, బాకాల్లోను కూడ శబ్దోత్పత్తికిగాని, స్వరస్థాయిని స్వాదీనంలో వుంచడానికిగాని, ఏ విధమైన సాధనాలు లేవు. బాకాల్లోను, కొమ్ముల్లోను, శంఖంలోను కూడ మన పెదవులే శబ్దకారకాలు, వేణువుల్లో మన ఊదేగాలి, కన్నం యొక్క అంచుకు తాకి నందువల్ల శబ్ధం కలుగుతూంది. మనమిపుడు శబ్ధాన్ని కలుగజేయడానికి సాధనాలు ఉపయోగించే గాలి వాయిద్యాల్ని కొంత పరిచయం చేకుందాం. శబ్దోత్పత్తికి, చలించే వలచని వస్తువును, సన్నని గొట్టానికో గాలితో నింపే ఒక భాగానికో అతికి ఉండాలి. ఈ చలించే పలచని వస్తువునే బద్ద లేక రేకు అని ఇదివరలో చెప్పుకున్నాం. ఇది ఒక రకమైన గట్టి గడ్డితోనో లేక వెదురు బద్దతోనో చేయవచ్చు. వీటిని హిందీ భాషలో 'పత్తి ' అని, తమిళంలో 'సీవలి ' అని తెలుగులో 'ఆకు ' అని అంటారు. అయితే ఈ బద్ద గొట్టానికి అమర్చినదైనా కావచ్చు లేదా గొట్టంలోని ఒక భాగమై ఉండొచ్చు.
పాములవాని
నాగస్వరంలోని బద్ద, కొట్టుకుని ధ్వనించే బద్దగల వాయిద్యాలలోనిది. ఇది బాగా దేశమంతటా
సుప్రసిద్ధమైనది. విదేశీయులు దీన్ని ఎంతో సంతోషిస్తూ, ఆప్యాయంగా వింటారు. హిందీ
భాషలో ఈ వాయిద్యాన్ని 'పుంగి ', 'బీన్ ' అని అంటారు. దక్షిణ దేశంలో 'మహుడి ',
నాగస్వరం అంటారు. దీనిలో పై భాగం ఒక ఎండిన ఆనపకాయ బుర్రతో తయారై, గాలిని ఈ
బుర్రలోకి ఊదుతారు. ఈ గాలి బుర్ర కింద అమర్చిన రెండు బద్దగొట్టాల ద్వారా వేగంతో
బయటికి వస్తుంది. ఈ రెండు గొట్టాలు కొంతభాగం బుర్ర బయటికి వస్తుంది. ఈ రెండు
గొట్టాలు కొంత భాగం బుర్ర లోపలికి, కొంతభాగం బుర్ర బయటికి అమర్చబడి ఉంటాయి. బుర్రలో
ఉన్న గొట్టాల భాగం మన కంటికి కనిపించదు, బుర్ర లోపల ఉన్న గొట్టాల పై పొరను, కొంచెం
చీల్చి బద్దవలె తయారు చేస్తారు. గాలిని బలంగా బుర్రలోకి ఊదితే, గొట్టాల మీద ఉన్న
పొర అంచుల మీద కొట్టుకుని ధ్వనిచేస్తూ, గాలిని బయటికి వదులుతూంటుంది. బయటికి
కనిపించే ఒక గొట్టపు భాగంలో కన్నాలుండవు. ఇంకొక దానికి 5,6 కన్నాలుంటాయి. కన్నాలు
లేని గొట్టంలో వట్టి శృతి మత్రం వినిపిస్తుంది. కన్నాలున్న గొట్టాన్ని వేళ్ళతో
మూసి, తెరిచి వాయిస్తే, పైన చెప్పినట్టు, దానిలోని చలించే గాలి యొక్క పొడుగు,
పొట్టి కొలతలు మారి మనకు వేరు వేరు స్వరాలుగా వినిపిస్తుంది. మొత్తానికిది శృతితో
కూడిన పాటలాగ వినిపిస్తూ, ఎంతో వినసొంపుగా శ్రోతల్ని ఆకర్షిస్తూంటుంది. ఈ పాట
వినడానికి పాముకి మాత్రం చెవులు లేవుగాని, పడగెత్తి ఆడుతూ కనిపిస్తుంది.
'నాదస్వరం ' కూడా 14వ శతాబ్దం నుంచీ బాగా తెలిసిన పేరు. శహనాయ్ మన సాహిత్య గ్రంధాల్లో 13వ శతాబ్దం నుంచీ పేర్కొనబడింది, కాని మద్య ఏషియాలోను, పశ్చిమ ఏషియాలోను, బాగా వ్యాపించిన 'జుర్నా ' వాయిద్యాన్నికిది 'బంధు ' పని తోస్తుంది. ఇజంకో రెండు వింతైన పేర్లున్నాయి, 'మేళం ', 'ఒళగ ' అన్నవి, మేళం అంటే గుంపు అని, 'ఒళగ లేక ఒలగ అంటే కోర్టు లేక దర్బారు అని అర్ధం నాదస్వరం అనేకానేక సందర్భాల్లో ముఖ్యంగా ప్రసిద్ధమయిన వాయిద్యం గనుక ఈ వాయిద్యానికే 'మేళ ' మన్నారు. నాదస్వర వాయిద్యానికి 4, 5 గురు వాయిద్యకారులుండటం సామాన్యం కూడాను. అలాగే 'ఒలగ ' లేక 'ఒలగ ' పదం కూడ తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో ఒకే విధంగా అర్ధమవుతుంది. ఈ పెద్దరకం నాదస్వర వాయిద్యాన్నే 'బారీ నాదస్వరం ' అని కూడ అంటారు. తమిళనాడు గ్రామీణ జీవితంలో 'నయ్యాండి ' మేళం బాగా ప్రసిద్ధం అలాగే కర్ణాటకలోని 'కరగమేళం ' కూడ ప్రసిద్ధమే. ఈ వాయిద్యమే శాస్తీయ సంగీత కచ్చేరిల్లో కూడ ఈనాడు బాగా గౌరవింప బడుతోంది.
హార్మొనియం వాయిద్య
నిర్మాణమంతా నోటి హార్మొనియం పద్దతి ననుసరించిందంటారు. క్రీస్తుపూర్వం వెయ్యి
సంవత్సరాల క్రితమే చైనీయులు 'షెంగ్ ' వాయిద్యం బాగా ప్రసిద్ధమైనది. దాని తాలూకు
బొమ్మలు క్రీస్తు తర్వాత 600 సంవత్సరాల నాటివి మనకు కనిపిస్తున్నాయి. మన ఏషియనుల
'మౌత్ ఆర్గన్ 'ప్రయాణం చేసింది. అక్కడ నుంచి ఈ ఒక బద్దతో చలించే వాయిద్యాల రకాలు
పశ్చిమ యూరోప్‌కు 19వ శతాబ్దంలో పరిచయమయ్యాయి. యూరోప్‌లోని వాయిద్య నిర్మాతలు అనేక
రకాల 'మౌత్ ఆర్గన్ ' రీడ్ ఆర్గన్, ఎకార్డియ మొదలైన వాయిద్యాల్ని ఫ్రీరీడ్
నుపయోగించి తయారుచెయ్యడం మొదలుపెట్టారు. అక్కడనుంచి ఈ రీడ్ ఆర్గన్ అనేక రకాలైన
వర్తక వ్యాపారులతోను, రాజ్య నిర్మాతలతోను, మతోపదేశకులతోను, తిరిగి మన దేశంలో
ప్రవేశించింది. ఇలా మన దేశపు ఖంగ్ వాయిద్యం ప్రయాణంలో వలయాకారంగా ఒక చుట్టు చుట్టి
తిరిగి మన దేశం వచ్చి, 'హార్మొనియం వేషం ' ధరించింది.
హార్మొనియం నాలుగు భాగాలున్నాయి 1) తిత్తి 2) గాలి కొలిచే అర 3) మెట్లు 4) రీడ్‌లు. వీటిలో తిత్తిని, ఒక చర్మాన్ని 2,3 మడతలు మడిచి, అట్టలతో అతికి, ఆఖరి మడతను కర్ర చెక్కను అతికి బిగిస్తారు. ఈ బిగించిన మడతను చేత్తో లాగుతూ, బయటి గాలిని లోపలి అరలోకి పంపవచ్చు. కాలితో వాయించే హార్మొనియంకు కాళ్ళను అంచడానికి రెండు చిన్న పీటలుండి ఈ రెండు పీటలకు చర్మం మడతలతో చేసిన తిత్తి మీదకు అమరుస్తారు. కాళ్ళతో నొక్కి తిత్తుల నాడిస్తే, బయటి గాలి రెండు గొట్టాల ద్వారా గాలి అరలోకి ప్రవేశిస్తుంది. తిత్తుల్లో బయటి గాలి లోపల ప్రవేశించడానికి కన్నాలుంటాయి. ఈ కన్నాలికి ఒక చిన్న తోలు ముక్క లోపలికి అంటించి ఉంటుంది. ఆ తోలు ముక్క బయటి గాలిని లోపలికి అంటించి ఉంటుంది. ఆ తోలు ముక్క బయటి గాలిని లోపలికి వదులుతుంది తప్ప లోపలి గాలిని బయటికి పోనీయదు. ఇలాగే గాలి అర లేక పెట్టెలోకి గాలి కన్నాల్లోంచి ప్రవేశిస్తుంది. ఈ కన్నాల దగ్గిర గూడ తోలు ముక్కలుండి, పెట్టెలో ప్రవేశించిన గాలిని బయటికి పోనీయవు. ఈ పెట్టె రీడ్పు చేసే ధ్వనిని విస్తారం చేయడానికి కూడ పనికి వస్తుంది. అందువల్ల హార్మొనియంలోని ముఖ్య భాగం ఇదేనని చెప్పాలి. తిత్తులను నొక్కి వాయిస్తూ గాలిని లోపలికి పంపిస్తే లోపలి గాలిలో ఒత్తిడి ఎక్కువవుతుంటుంది. పైకి కనిపించే మెట్టులో ఒక్కొక్క మెట్టుకు, పెట్టెలోపల ఒక్కొక్క రీడ్ అమర్చబడి ఉంటుంది మనకు కావలసిన స్వరాలను పలికించడానికి మెట్లను నొక్కితే, పెట్టె లోపల ఉన్న ఆ మెట్ల తాలూకు రీడ్లు చలించి ధ్వనిస్తాయి. ఈ రీడ్లు చలించేటపుడు పెట్టె లోపలి గాలి మెట్ల ద్వారా బయటికి పోతూంటుంది. వరుసగా ఉండే ఈ మెట్లను 'కీబోర్డు ' వాయిద్యాల వలె 'కీబోర్డు ' వాయిద్యమంటారు.
ఈ హార్మొనియం వాయిద్యాన్ని గూర్చి అనేక అభిప్రాయాలున్నప్పటికీ, ఇది దేశమంతటా బహు జనాధరణ పొందిన వాయిద్యమని చెప్పాలి. మన పండితాభిప్రాయం దీనికి సరిగా వ్యతిరేకంగా ఉండి, మన రాగసంగీత పద్ధతి కిది ఏ మాత్రం తగని వాయిద్యమని అంటారు. దీన్ని గూర్చి అనేక చర్చలు, వాదోపవాదాలు జరిగాయి. కాని మనం నిజాన్ని గుర్తించి తెలుసుకోవాలి. ముఖ్య విషయం ఈ వాయిద్యాన్ని, మన వీణ, సితార్, సారంగి, వయోలిన్ వాయిద్యాల వలెగాక, అతి సులభంగా వాయించి నేర్చుకోవచ్చు. పై వాయిద్యాలవలె దీన్ని ఎక్కువ శ్రమతో శృతి చేయనక్కరలేదు. సులువుగా ఈ వాయిద్యాన్ని ఎక్కడికైనా తీసుకుని పోవచ్చు. మన సంగీతంలోని స్వరాలు, స్వరస్థానాలు, షడ్జపంచమ భావంవల్ల నేర్పడి, వాటి స్వస్థాన సౌందర్యాన్ని, వాద శుద్ధిని విడవకుండా శ్రోతలకు మహదానందాన్నందిస్తూంటాయి. దాని వల్లనే మన సంగీతం గనుక యుక్తమైన రాగ పద్దతిలో వృద్ధిజెంది వ్యాపించడానికి వీలైంది. మన రాగాలాపన పద్ధతి, స్వరకల్పన మొదలైన మన ప్రత్యేక సంగీత రీతులు సంగీత ప్రపంచంలోనే ఒక గౌరవ స్థానాన్ని మనకి సమకూర్చేయి. ఇదేమి స్పోత్కర్షగాదు. విదేశీయులు మన సంగీతం విని ఆనందించి వ్యాఖ్యానించిన విషయమే ఇక్కడ తిరిగి చెప్పడమైంది. విదేశీయుల స్వర స్థాయి నామోదించి, చేసిన హార్మొనియం వాయిద్యం మన సంగీతానికెంతవరకు ఉపయుక్తమో సందేహించవలసిన విషయం. హార్మోనియంలోని స్వరాలతో మన రాగాలను వాయించడం, అలాపించడం వట్టి ఎండమావి వంటిదని పండితాభిప్రాయం. హార్మొనియంలో ఒక మెట్టుకు ఒక స్వర మేర్పడి నందువల్ల స్వరంతర చాయలు, గనుక విశేషాలు వినిపించడాని అవకాశం లేదు. అలా అందచందాలు లేకుండా వినబడే హార్మొనియం సంగీతం, ఆకులు, చిగుళ్ళు, పువ్వులు, కాయలు, పళ్ళు మొదలైన వన్నీ లేని మోడులా తయారవుతుంది ఆ సంగీత వృక్షం. ఈ కారణం వల్లనే దీనికి పండితామోదం కొరవయింది.
తంతి వాయిద్యాలు
తంతి వాయిద్యాలు లేక తత వాయిద్యాలు విస్తార సంఖ్యలో ఎన్ని రకాలుగా పెరిగి పోయాయంటే, వాటిని విభజించి తరగతుల వారీగా వర్ణించడం, వాటి చరిత్రను గురించి శోధించడం బహు కష్టసాధ్యమైన పనిగా తయారైంది. ఈ రోజుల్లో ఈ వాయిధ్యాన్ని గురించి చెప్పడానికి తెలుగులో సరియైన పదాలు కూడ లేవు కనుక కలగావులగపు భాషలో వాటిని చెప్పాలి. వీటిలో హార్పులు, లైర్పు, సాల్టరీలు, డల్సిమర్సు, జిథర్సు, లూట్స్, మొదలైన రకాలు, వీటిలో ఎన్నో రకాలు, వాటిని వాయించే పద్ధతులు, అన్నీ అసంఖ్యాలే. అందువల్ల వీటి అభివృద్ది, వ్యాప్తి అనేక రకాలైన పరిస్థితుల్లో, అనేక రకాలైన సాధనాలు, పనిముట్లతో జరిగింది. వీటి చరిత్రను గురించి అనేకమైన అభిప్రాయాలున్నాయి. కాని అవేమి సమన్వయ దృష్టితో కూడినవి కావు. అవి సర్వత్రా ఆమేదించిన అభిప్రాయాలూ కావు. కొంతమంది వీటిని వేటకు పనికి వచ్చే విల్లమ్ముల నుంచి బయలు దేరాయన్నరు. మరికొంతమంది భూమివీణ వాయిద్యమే వీటి ప్రాధమిక దశన్నారు; ఇంకాకొంతమంది వెదురు కర్రలతో చేసిన 'జిథర్ ' వీణల నుంచి వృద్దయ్యేయన్నారు. ఇలా శోధనలు, చర్చలు సాగుతూనే ఉన్నాయి.
వేటాడే విల్లు, అమ్ములు చాల పురాతనమైన పనిముట్లు, చాలా రకాల వీణలు వీటి ప్రాతిపదికతోనే పరిమాణం చెందాయని చాలా మంది అభిప్రాయం. 'భూమివీణ' (Ground harp) వీటిలో నొకటిగా బాగా ప్రాథమికమని చెప్పాలి. తంతి వాయిద్యాన్ని మూడు పెద్ద విభజనలు చేసి చెప్పవచ్చు. మొదటివి, పాటల్ని కాని, రాగాల్ని గాని వాయించడానికి వీలులేని రకాలు. అవి కేవలం శృతికోసం, తాళ గతి సూచించడం కోసం పనికి వస్తాయి. వీటిని శృతి, తాళవాయిద్యాలని ((Drones and rhythmic adjucts) చెప్పవచ్చు. రెండవ రకం లోనివి, ఒక స్వరానికి ఒక తంతి ఉండేట్లు ఏర్పాటైన రకాలు. వీటిలో హార్సులు, లైర్స్, డల్సిమర్సు మొదలైన వుండి, పాటలు వాయించడానికి వీలైనవి. వీటిని ఇంగ్లీషులో పోలికార్డు(Polychords) లంటారు. ఇంక మూడో రకం చాలా పెద్ద కుటుంబం. ఇంగ్లీషులో వీటిని మెనోకార్డు (monocards) లంటారు. అయితే వీటిలో ఒకే తంతి ఉంటుందని భ్రమ పడకూడరు. వీటిలో నాలుగైదు తంతు లుండవచ్చు. కాని ఒక్కొక్క తంతితోను మనక్యు కావలసినవి పాటో, రాగమో వాయించవచ్చు. ఇలా వయోలిన్ వాయిద్యంలో ఒక్క తంతి మీద భైరవి పెద్దవర్ణమంతా వాయించగల సమర్థులున్నారు. అంటే మనకి ఈ వాయిద్యాలలోని సౌకర్యం తెలిసొస్తుంది. ఈ రకం వాయిద్యాల్లో మళ్ళీ మెట్టున్నవి, లేనివి, విల్లుతో వాయించేవి, కుణవం (Plectrum) తో వాయించేవి. పొడుగు, పొట్టి దండి లున్నవి ఎన్నో రకాలున్నాయి.
ఒరిస్సాలోని సంతాల్ జాతి గిరిజనుల్లో 'బువాంగ్ ' అనే వాయిద్యాన్ని నాట్యాల్లో ఉపయోగిస్తారు. దీనిలో చిన్న పెద్ద రకం వాయిద్యాలున్నాయి, కాని సామాన్యంగా ఒక మీటరు పొడుగైన వెదురు కర్రకు రెండు కొసల్నీ, రెండు వంచిన చిన్న కర్రముక్కల్నీ వెదురు కర్రలో బిగిస్తారు. ఈ రెండు కర్రముక్కలనీ కలుపుతూ మధ్యలో ఒక నారతాడుంటుంది. కోడిగుడ్డు ఆకారంగా ఉండే ఒక వెదురు బుట్టను అల్లి, దాన్ని మామూలు కాగితాలతో కప్పి చూడ్డానికింపుగా ఉండేట్లు రంగు కాగితాల పీలికలు కూడ వేళ్ళాడదీస్తారు. ఈ బుట్టని వెదురు కర్రకు మధ్యని వేళ్ళాడదీస్తారు. ఈ బుట్ట, తాడు లాగితే వచ్చే ధ్వనిని విస్త్ర్తపరచడానికి కూడ ఉపయోగిస్తుంది. నాట్యం చేసే వాళ్ళు ఈ వెదురు కర్రను ఒక చేత్తో పట్టుకుని, రెండో చేత్తో నారు తాటిని లాగి ధ్వని చేస్తూ నాట్యం చేస్తారు. 'బూం బూం ' అని ఒక వింత శబ్ధం వినబడుతూంటుంది. గిరిజనులు, అటవికులు వాయించే ఈ వాయిధ్యం బొత్తిగా సామాన్యంగా, అనాగరికంగా కర్రతో చేసిన బుర్రలు కట్టి వాయించే అలవాటు ఇక్కడ నుంచే ప్రారంభమయిందా అనిపిస్తుంది.
శృతి
కువయుకాలైన వాయిద్యాలనీ 'ఏక్‌తార ' కుటుంబానికి చెందినవే గాని వాటిలో తంబూరని
పోలినవి, అట్టే నేర్పరితనం లేకుండా తయారైన రకాలెన్నో ఉన్నాయి. ఏక్‌తార అనేది,
దీన్ని భాషల్లో 'ఏక్‌నాద ' అని కూడ అంటారు. ఒకే తంతి గల వాయిద్యం. దీనిలో ఒక
ఎండిపోయిన ఆనపకాయ బుర్ర ఉండి, ఆ బుర్రలోకి ఒక వెదురు గొట్టం లాంటి దండిని దూర్చి
తయారు చేస్తారు. దండిని బుర్రలోకి దూర్చి బిగించడం ఒక ముఖ్యమైన విషయ్మ్. ఈ అలవాటే
తర్వాత కాలంలో 'లూట్ ' రకాల వీణలకి, అంటే సితార, వీణ, సరోద్ మొదలైన వాయిద్యాల
నిర్మాణానికి దారితీసిందనిపిస్తుంది. లూట్ రకాల వీణల్లో దండి బుర్రతో కలిసిపోయి,
బుర్ర ఒక పక్క పొడుగ్గా ఉండి దండిగా మారిందా అనిపిస్తోంది.
శృతి వాయిద్య
నిర్మాణంలో తర్వాత దశని గుర్తించాలంటే, 'తంబూరి ' వాయిద్యాన్ని గురించి
తెలుసుకోవాలి. ఇది కూడ దక్షిణాదిని జనపదులు, బిచ్చగాళ్ళు వాడే వాయిద్యమే. ఇది
సుమారు ఒక మీటరు పొడుగ్గా ఉండి, సులభంగా ఎక్కడికైనా తీసుకుపోవచ్చు. దీనిలో బుర్ర,
కర్రతో చేసిన గుండ్రటి కుండవలె ఉంటుంది. పై మెడ ఉండి, మెడ దండితో కలిసిపోయి
ఉంటుంది. దండి కొసని ఒక పాము పడగ ఆకారంలో బొమ్మ మాదిరిగానే ఉం టుంది. బొమ్మ కిందికి
దండిలోకి నాలుగు పూటీలు ఉంటాయి. బుర్ర కింద నుంచి, బుర్ర మీద ఉన్న పీటపైనుంచి, దండి
కొసని ఉన్న పూటీల వరకు వ్యాపించి నాలుగు ఇనపతీగలు పూటీల్లో బిగింపబడి ఉంటాయి.
ఇనపతీగలను వేలితో మీటుతూ శృతితో కూడిన పాట పాడడానికిది బాగా పనికి వస్తుంది.
బిచ్చగాళ్ళు, జానపదులు ఉపయోగించే తంబూరి నుంచే, మన మీ రోజుల్లో చూసే 'తంబుర ' అనే
శృతి వాయిద్యం ఉద్భవించిందని, సుమారు 16వ శతాబ్దం నుంచీ మనకి తెలుసు. అటు క్రితం
పురాణాల్లో తుంబురు, నారదులు తంబురను ఉపయోగించేరని చెప్పేరు, గాని వారు చరిత్రకందని
దేవతా స్వరూపులు. ఇలా చెప్పడం వల్ల, ధ్వని పూర్వంగా మనకీ వాయిద్యం అనాదిగా పరిచయమైన
వాయిద్యమని, ఆ చెప్పిన పెద్దల అభిప్రాయమై ఉండవచ్చు. తంబుర అనే పదాన్ని బట్టి, ఇది
తుంబిఫల లేక తుంబి అనే ఒక రకమైన ఆనపకాయతో చేయబడినదని కూడ తెలుస్తూంది. పూర్వ సంగీత
గ్రంథాల్లో కూడ ప్రామాణికంగా ఈ వాయిద్య స్వరూపం ఇలా ఉంది, దీని పూర్వ చరిత్ర ఇది
అని ఎక్కడా చెప్పినట్లు లేదు. అలగే చరిత్రలో ప్రమాణాలు కూడ చాల కష్టమైన పని. తంబుర
వాయిద్యంలోని నాదగుణము, ఆ నాదంలోని ఘనత అందులో వినిపించే అనుస్వరాలు అనితర
సాధ్యమైనవి. సంగీత ప్రపంచంలో తంబురకి అనన్యమైన కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టేయి.
మన సంగీత వైశిష్ట్యానికి తంబుర వాయిద్యాన్నొక నిదర్శనంగా చూపవచ్చు.
'వీణ
' అనే మాట లేక పదం మనకి వేదంలోనే మొదటి పరిచయం. అశ్వమేథ యాగంలో వేద పఠనానికి
అనుసరణగా వీణనుపయోగించినట్లు చెప్పబడింది. వేదంలో వీణని గొర్చి ఇలా పొగిడారు. ఈ వీణ
అందానికి సిరిసంపదలకు మారుపేరని చెప్పారు. ఉష కాలంలో వీణ వాయించడం ఆ కాలంలో బాగా
అలవాటుగా ఉండేదని తెలియడానికి ఋగ్వేదంలో ఒక ఇతిహాసముంది. ఒకసారి రాక్షసులు కణ్వ
మహర్షిని ఒక చీకటి గదిలో కళ్ళుకట్టి బంధించి, ఉషోదయం ఎప్పుడైందో కళ్ళు తెరవకుండా
చెపితే నిన్ను విడిచి పెడతామన్నారట. కొన్ని యాఘాలు గడిచిన తర్వాత ఆయనకు వీణానాదం
వినిపించిందట. వెంటనే ఆయన ఉషోదయమైందని గుర్తుపట్టి రాక్షసులకు చెప్పగానే వారాయన్ని
విడిచి వేశారట. మన పురాణాల్లోను, ఇతర సాహిత్యంలోను కూడ వీణని గురించి కావలసినన్ని
వర్ణనలు కనిపిస్తాయి. హనుమంతుడు సీతాదేవిని వెదుకుతూ రావణాంతఃపురంలో
ప్రవేశించి, ఒక చోట వీణా వాదకులు నిద్రిస్తూండడం చూసేడట. అందులో ఒక స్త్రీ వీణని తన
వక్షస్థలం మీద వుంచుకుని, నిద్రిస్తొందట. వాల్మీకి ఆ దృశ్యాన్ని కలువపూల గుచ్చమొకటి
పడవ మీద ఉన్నట్లున్నదని వర్ణిజంచేడు. ఇంక, యువరాజు ఉదయనుడు వాసవదత్తను వీణా వాదనతో
సమ్మోహితురాల్ని చేయడమే కాకుండా, అడివిలోని మత్తగజాన్ని కూడ తన వశం చేసుకున్నట్లు
చెప్పబడింది. పరమశివుని చేతి 'డమరు ' వాయిద్యంలా, శ్రీకృష్ణుని వేణువులా, వీణకి కూడ
ఒక పవిత్ర రూప చిత్రణ, దివ్య గుణాదేశం చేయబడింది. శివుని దక్షిణామూర్తి స్వరూపంలో
ఆయన వీణాధర దక్షిణామూర్తి అయ్యేడు. ఆనపకాయ బుర్రతో కూడిన ఒక మెట్లులేని వీణ ఆయన
చేతిలో, సనకాదిమునులకు జ్ఞానానికి, నాదానికి అవిడొక దివ్యరూపం. వీణ, పుస్తకాలు లేని
సరస్వతీ విగ్రహ మెక్కడా లేదు. ఇంకొక విషయం ఓంకార ప్రణవ నాద మొక్క లోతుపాతులు,
ఆవిడకు కూడ అర్ధంకాక నాద సముద్రంలో మునిగిపోకుండా తన వీణ యొక్క ఆనపకాయబుర్రను
రక్షణగా చేసుకుని తేలి ఉంటోందట. ఈ దివ్యోన్నత భావాన్ని వ్యాఖ్యానించడం చాలా అవసరమైన
పని.
వేదంలో చెప్పిన వీణను 'వన ' లేక 'మహావీణ ' అని వర్ణించేరు. ఈ వీణ 'దండ 'లో పది కన్నాలుండి, ఒక్కొక్క కన్నం నుంచి పది తంతులు చొప్పున నూరు తంతులున్న వాయిద్యంగా చెప్పేరు. ఈ తంతులు 'ముంజ ' అనే ఒక రకం గడ్డితో పేనిన తంతులట. వీటిలో 33 తంతుల్ని యజ్ఞకార్యక్రమాల కధిపతిమైన 'అధ్వర్యుడు ' కట్టాలట. ఇంకొక 33 తంతులను ఋగ్వేదపఠనం చేసే 'హెత ' కట్టాలట. సామవేదం చదివే 'ఉద్గాత ' మరి 33 తంతులను కట్టలి. ఆఖరి తంతిని యజమాని లేక యాగకర్త కట్టాలట. ఉద్గాత 'ఆసంది ' అనే పీఠం మీద కూర్చుంటే, మిగిలిన వారు గడ్డి చాపల మీద కూర్చుని యజ్ఞ మంత్రాలు చదువుతారట. తర్వాత సాహిత్యంలో దీన్ని 'శత తంత్రి వీణ ' అని పేర్కొన్నారు. ఈ వీణ కాశ్మీర్‌లో కనిపించే 'సంతూర్ 'వాయిద్యంలా ఉంటుందని కొంతమంది అభిప్రాయం. ఋగ్వేదంలో 'భగవద్దత్తవీణ ' (శరీరానికి), మానవ కృతవీణకి చక్కని పోలికలు చెప్ప బడ్డాయి. శరీరం లేక భగవద్దత్త వీణకి తలకాయ, పొట్ట, నాలిక, నరాలు, చర్మం ఉన్నట్లే, మానవాకృత వీణలో తలకాయ ఆనవకాయబుర్ర గాను, లోపలి గుల్ల భాగాన్ని పొట్టగాను, వాయించడం నాలికగాను, తంతులను నరాలుగాను, సంగీతాన్ని మాటగాను, శరీరాన్ని,చర్మంతో కప్పినట్లు వీణకూడ చర్మంతో కప్పబడిందని చెప్పారు.
'సంతూర్
' వాయిద్యం కాశ్మీరులో మట్టుకు బాగా ప్రసిద్ధైనది. మన దేశంలో అది మరెక్కడా
కనిపించదు. పాశ్చాత్య దేశాల్లో దాన్ని 'డల్సిమర్ ' అని, 'సింబలొన్ ' అని అంటారు.
కొంతమంది పండితులు దీన్ని వేదంలో చెప్పిన 'వన ' వీణ అంటారు. వన వీణ అన్న దానికి 100
తంతు లుండేవని, గడ్డితో పేనిన తంతులని, కర్ర ముక్కలతో కొట్టి వేయించేవారని ఇదివరలో
చెప్పబడింది. తర్వాత కాలంలో దీన్ని 'శతతంత్రి వీణ ' అన్నారని, తర్వాత ఆ పేరు
'సంత్తొర్ 'గా మారిందని అంటారు. ప్రస్తుతం సంతూర్‌కు చాల తీగలున్నాయి. దాన్ని
కర్రతో కొట్టి వాయిస్తారు. దీని తయారీ మూడు భుజాలు గల కర్రతో చేసిన పెట్టెతో,
చేసిందని చెప్పాలి. దీని మీద ఒక వరసలో రెండు చొప్పున మొత్తం 30 'పీట 'లున్నాయి.
ఒక్కొక్క వరుసలో రెండు పీటల మీద నాలుగు తంతులు ఒకే స్వరానికి శృతి చేసి ఉంటాయి. ఇలా
మొత్తం 60 తంతులు, 15 స్వరాలకు శృతి చేసి ఉంటాయి. వాయించేవాడు పెట్టెను ఎదురుగా
ఉంచుకొని, చిన్న వంపున్న రెండు కర్రలతో కొట్టి దీన్ని వాయిస్తాడు. కాశ్మీరీలో
'పెర్షియన్ మోడ్పు ' పాటల వంటి 'మకంస్ ' అనే ఒక రకం పాటల్ని దీని మీద వాయిస్తారు.
ప్రస్తుతం దీని మీద రాగాల వంటివి కూడ వాయిస్తున్నారని, ఫిలిం పరిశ్రమలో దీన్ని బాగా
ఉపయోగిస్తున్నరని తెలుస్తూంది.
హిందుస్థానీ
సంగీతంలో వుపయోగించే విచిత్ర వీణ ఒక మెట్లు లేని జిథర్ వాయిద్యం. దీని ఫింగర్
బోర్డు అంటే స్వరస్థానాలు వాయించే చెక్క, 125 సెంటీమీటర్ల పొడుగుండి, కింద రెండు
అనపకాయ బుర్రలు రెండు కొసల్ని అతకబడి ఉంటాయి. ఒక వెడల్పయిన పీట దండికి ఒక కొసని
ఉంటుంది. ఇంకొక చెక్కలో (ledge) నాలుగు పూటీలు (Pegs) ఉండి, వాయించడానికి ముఖ్యమైన
నాలుగు తంతుల్ని పీట మీద వుంచి దండి కొసనున్న పూటీల్లో బిగిస్తారు. ఇవిగాక 'చికరీ '
అనే (Chikari)అనే రెండు తంతుల ఆధార శృతిని సూచించడం కోసం బిగిస్తారు. పైన చెప్పిన
ముఖ్యతంతులు నాలుగింటిని గూడ కాణపం (Plectea) అంటేఅ తీగతో తయారుచేసి వేలుకు
తగిలించుకొనే నఖం వంటి దాన్ని పెట్టుకొని మీటుతూ వాయిస్తారు. పాట గాని వాయించడం
కోసం ఇక్కడ ఎడం చేతిలో ' కమ్రిక ' బదుకుగా ఒక గాజు బంతి వుపయోగించి, తీగలమీద
కదుపుతూ వాయిస్తారు. ముఖ్య తంతుల కింద ' తరాబ్ ' అనే 12 సన్న తీగల్ని, అమర్చి
బిగిస్తారు. వాయిస్తుంటే ఈ తరాబ్ తీగలు అనుకంవనతో కంపించి, నాద గుణం బాగా శ్రావ్యత
పుంజుకుంటుంది. దీని నిర్మాణాన్ని బట్టి, వాయించే విధానాన్ని బట్టి ఇది ' ఏక్
తంత్రి ' వాయిద్య కుటుంబంలోనిదేనని బాగా స్పష్టంగా తెలుస్తుంది. విచిత్ర వీణ అనే
దీని పేరు సుమారు ఒక శతాబ్దం నుంచి అమల్లో ఉందని తెలుస్తూంది. అయిన అక్బరీ గ్రంథంలో
' సార్ వీణ ' అనే వాయిద్యాన్ని ముఖ్యమైన వాయిద్యాల్లో ఒకటిగా చెప్పారు. బహుశా ఈ
విచిత్ర వీణ, సార్ వీణ ఒకటే అయి ఉండవచ్చు.
ఈ
రోజుల్లో హిందుస్థానీ సంగీత కచ్చేరీలో బాగా ప్రసిద్ధమై, ప్రపంచ మంతటా కూడ పరిచయమై
పోయిన ' సరోద్ ' అని పేరున్నది. ఈ 'సరీద్ ' అనే పేరు, 'శారద వీణ ' అనే పేరు నుంచి
వచ్చిందని కొందరి అభిప్రాయం, కాని దీనికి సరియైన నిదర్శనాలు ఏ సంగీత గ్రంథంలోను
కనిపించవు. అయితే 1931వ సంవత్సరంలో సమర్ఖండ్ ప్రాంతానికి చెందిన ' ఇబిన్ ఆల్వాస్ '
అనే ఆయన ' షరూడ్ ' అనే పేరుతో చాల స్థాయిలతో వాయించే సౌకర్యంగల తంతి వాయిద్యాన్ని
నిర్మించాడని తెలుస్తుంది. పురాతన ఇండోపెర్షియన్ సాహిత్యంలో సరోద్ అనే పేరు
చెప్పబడినది. మధ్య యుగ ప్రారంభంలో ' హసన్ నిజామి ' అనే ఆయన ఢిల్లీ సుల్తానుల
రాజదర్బార్‌ని వర్ణిస్తూ ఒక గాయకుణ్ణి గురించి ఇలా చెప్పేడు. ఆ గాయకుడు ' రుద్ '
వాయిద్య తంతితో తన గొంతును కలిపి 'సరోద్ ' సంగీతంలో దీనావస్థలో వున్న ప్రేమికునివలె
కోయిల గొంతుతో వాపోయాడు అన్నాడు. ఇంకోసారి ఇలా చెప్పాడు. ఎంతో అందంగా దేవతస్త్రీ
వలె వున్న ఒక గాయని నెమలి కన్నులతో అలంకరించుకొని చక్కని చెక్కిళ్ళ ముఖంతో తన కోయిల
కంఠంతో అత్యద్భుతమైన పాటల్ని దివ్యగానం చేసింది. తన ' ముసికర్ ' వాయిద్యం వాయిస్తూ
పశుపక్ష్యాదుల్ని కూడా ఆకర్షించేట్లు, ఆకాశంలోని పక్షులు కూడ కిందికి వచ్చి
వినేట్లు వాయించింది అన్నాడు. అయితే ఇక్కడ ' రుద్ ' అన్నది ఒక వాయిద్యమని
తెలుస్తూంది. కాని ' సరోద్ ' అన్నది ఒక పాటా లేక మన లూట్ వాయిద్యమా ఏమీ తెలియడం
లేదు. ఈ రోజుల్లో కూడ మథ్యేషియాలో ' ఉద్ ' అనే పొట్టి మెడగల లూట్ వాయిద్యం
కనిపిస్తుంది. ఇదంతాచూస్తే, మన దేశపు సరోద్ వాయిద్యం మధ్యేషియాలోని 'ఉద్ ' వాయిద్యం
నుంచి వచ్చిన దానిలాగే కనిపిస్తుంది. పైగా దాని నిర్మాణంలోను, పేరులోనుకూడ - సరోద్
పదం, ఉద్, సరోద్ పదాల పోలికగానే - ఆ వాయిద్య పోలికలే కనిపిస్తాయి. రబాబ్ వాయిద్యంలో
లాగే దీనిలోకూడా, సన్నని నడుమున్న మొండెం ఉంది కాని మొండెం అంత లోతు లేకుండా కొంచెం
' మెరక ' గా వుంటుంది. ఇంకో చిన్న తేడా, దండి కర్ర చెక్కతో కప్పడానికి బదులు ఇనప
రేకుతో కప్పబడి ఉంటుంది. దీని మీద నాలుగు ముఖ్య తంతులు, శృతికోసం రెండు తంతులు,
ధ్వని విస్తారం కోసం 'తరాబ్ ' అనే 12 తంతులు అన్నీ ఇనప తంతులే ఉంటాయి. రబాబ్ లాగే
దీన్ని కూడ ' జవ ' అనే చిన్న కర్రముక్కతో వాయిస్తారు.
సరస్వతీ వీణ, వీణ రకాలన్నింటికీ ' రాణీ అని చెప్పాలి. (హిందూస్థాని సంగీత విద్వాంసులు కూడ తమ జిథర్ రకం వీణను ' వీణ ' అనే చెపుతారు. మనం మాత్రం దక్షిణాది వీణను 'అరస్వతీవీణ ' అని, ఉత్తరాది జిథర్ రకాన్ని ' రుద్రవీణరుద్రవీణా అనీ చెప్పుకోవచ్చు.) సరస్వతీవీణ కింత ప్రాముఖ్యం, దాని సౌష్టవం, అందం, నాద గుణాల వల్లనేకాక దానిలో వైవిధ్యతోబాటు పరిపూర్ణ అక్షణం వల్ల వచ్చిందని చెప్పాలి. మంచిసంగీతానికి కావలసిన లక్షణాలన్నీ, ఏర్పాట్లన్నీ ఇందులో ఉన్నాయి. రాగం వాయించడానికి చాలా స్థాయిలున్నాయి. శృతి, తాళాలకు తాళ తంతులున్నాయి. అందువల్ల దీనిలో మరే వాయిద్యంలోను లేని, పమన్వితమైన్ లక్ష్ణం ఉంది. ఈ సరస్వతీ వీణ నిర్మాణం. 17వ శతాబ్ధంలో తంజావూరు రాజు రఘునాథ నాయకుని కాలంలో జరిగిందని తెలుస్తూంది. అందువల్ల దీన్ని ' తంజావూరు వీణ ' అని కూడ అంటారు. ఈ వీణకర్రతో చేయబడి, కుడం అనే దీని కుండ పలచనికర్రచెక్కతో కప్పబడి, ఒక వైపుకు సన్నని మెడతో వుండి, ఈ మెడ నుంచి ఒక దండి అతకబడి ఉంటుంది. దండి చివర యాళి ముఖంతో వుంటుంది. ఇది మాత్రం ఇదివరలో చెప్పిన యాళ్ కాదు. కుండకు మధ భాగంలో పైని 'పీట ' ఉంటుంది. ఈ పీట కొంచెం తీగలున్న వైపుకు వంగి ఉంటుంది. పీట మీదస్ ఒక ఇత్తడి రేకు అతకబడి ' ఏకతంత్రి ' వాయిద్యంలో లాగ ఉంటుంది. పీటకి పక్కబి ఒక వంగిన కర్రముక్క తాళ తంతులు మూడు బిగించడం కోసం ఉండి, తాళతంతులు దీనిమీద బిగిస్తారు. ముఖ్య తంతులు నాలుగు పీటమీదనుచ తాళతంతులు మూడు పక్కనున్న కర్రముక్క మీదికి బిగింపబడి ఉంటాయి. తాళ తంతులకు ' సారణి ' అని పేరుంది. ముఖ్య తంతులను కుడిచేతి చూపుడు, మధ్య వేళ్ళతో కిందికి మీటుతూ వాయిస్తే, తాళ తంతుల్ని చిటికెన వేలితో కింది నుంచి పైకి మీటుతూ వాయిస్తారు. ఎడంచేత్తో దండి మీద వున్న ఇత్తడి మెట్లు మీద స్వరాల కోసం కిందికి, పైకి కావలసిన విధంగా వాయిస్తుంటారు. దండికి చివరి భాగంలో నాలుగు ముఖ్య తంతులను బిగించి, దండిలో పక్కనున్న 3 పూటీలో తాళ తంతులను బిగిస్తారు. దండి చివరి భాగంలో వున్న యాళి ముఖం కిందికి ఒక ఆనపకాయ బుర్రగాని, కర్రతో చేసిన బుర్రకాని అతకబడి ఉంటుంది. వీణని వాయించడం సాధారణంగా 'పడుకోబెట్టి ' వాయించడమే అలవాటు అంటే వాయించేవారు పీఠం వేసుకొని కూర్చొని, వీణ కుండని కింద ఉంచి, దండి చివరి ఆనపకాయ బుర్రను ఎడమ కాలిమీద ఆనించి వాయించడం సులువుగా వుంటుంది. అయితే పూర్వం కొంతమంది వైణికులు వీణన్ని నిలబెట్టి అంటే కుండని ఒళ్ళో పెట్టుకొని వీణని నిలబెట్టి వాయించడం కూడ సాంప్రదాయంగా వుండేది. ఈ రకంగా మన రాష్ట్రంలోను, మైసూరులోనూ వాయించడం తెలుస్తూంది. కాని ఈ అలవాటు ప్రస్తుత కాలంలో విస్తారంగా లేదు. వీణని వాయించే విధానాలు ఎంతో నైపుణ్యంతో ఉత్తమమైన రీతిలో వృద్ది చెందాయి గనుక ఆ వాయిద్యంలో వేర్వేరు 'శైలి ' లేక ' బాణి ' అమల్లో వుంటుందని తెలుస్తూంది. ఈ విధమైన శైలి లేక బాణీల్లో తంజావూరు బాణి ముఖ్యమైంది. తంజావూరు బాణి అంటే విశేషం గమకయుక్తంగా, గౌరవమైన వేగంతో, తొందరపాటు లేకుండా, అతిమనోహరంగా వుండే విధానమని చెప్పవచ్చు. మనరాష్ట్రంలోను, మైసూరు లోని బాణిలు కొంచెం వ్యత్యాసంగా వుండేవని చెప్పవచ్చు. వీటిలో మీటు విధానాల ప్రత్యేకత. రెండు, మూడు తంతులను కలిపి ఒకేసారి వాయించడం, ఎక్కువ నిలువులతో కూడి వాయించడం, తాన వరుసలలో రక్తితో కూడిన వైవిధ్యం ఎంతో ఆకర్షణీయంగా వుండేవని చెప్పాలి.
కర్ణాటక
సంగీతంలో వీణకెంత గౌరవమున్నదో, హిందూస్థానీ సంగీతంలో ప్రస్తుతం సితారకంత గౌరవం,
ప్రాధాన్యం వచ్చాయి. విదేశీయులు కూడ సితార్ వాయిద్యాన్నెంతగానో గౌరవిస్తూ, ఆదరించడం
మనకెంతో సంతోషకరమైన విషయం. విదేశీయులకు మన సితారంటే గౌరవము, ఇష్టమేకాక, వారిలో అనేక
మంది మన సితారాల వద్ద సితార నభ్యసించి, నైపుణ్యం సపాదిస్తున్నారు. సితార్ యొక్క '
పెద్దలు ' మన దేశపు పశ్చిమోత్తర సరిహద్దులకవతలివైపు నుంచి మన దేశానికి వచ్చినా
ఇప్పుడా సితార మన దేశంలో అతి ముఖ్యమైన సంగీత వాయిద్యము. సాంస్కృతిక చిహ్నం కూడా.
సితార లూట్ రకం వాయిద్యం. దాని వలె వున్న బొమ్మలుకొన్నింటిని మధ్యేషియాలో
పశ్చిమంగా వున్న కొన్ని గుహల్లో చూసినట్లు ఇదివరలో చెప్పుకున్నాం. 13వ శతాబ్దపు
ప్రసిద్ద కవి, గాయకుడైన ఆమీర్‌ఖుస్రో దీన్ని కనుగొన్నాడని నిన్నమొన్నటి వరకు
అభిప్రాయముండేది కాని దీనికి సరియైన నిదర్శనమేమి కనిపించడం లేదు. సరిగ్గా నమ్మదగ్గ
గ్రంధాల్లో 18వ శతాబ్దానికి పూర్వముండే ఏ విషయాన్ని స్పష్టంగా చెప్పినట్లు లేదు.
18వ శతాబ్దపు ఒకానొక గ్రంధకర్త మాత్రం సితార్ వాయిద్యమంటే 'నిబద్ధతంబూర ' అని
చెప్పాడు. సితార్‌కి తంబూరకి ఉండే సంబంధం ఈ మాటతోటే తెలుస్తుంది. ఇంకొక అభిప్రాయంలో
ఇదివరలో చెప్పిన త్రితంత్రి వాయిద్యం నుంచి సితార్ పుట్టిందని అంటారు. అలాగే '
సెహతార్ ' అనే పదం నుంచి వచ్చిందని కొందరి అభిప్రాయం. పెర్షియన్ భాషలో ' సెహ్ '
అంటే మూడు, తార్ అంటే తంతి. మూడు తంతులున్నందున అలా సెహ్‌తార్‌గా వుండి, క్రమంగా
అది సితార్‌గా మారిందని వారి యోచన. సంస్కృతమ్మాట ' త్రితంత్రి ' కూడా ఈ విధంగానే
ఉంది. మాటల పోలిక బాగానే ఉంది కాని, త్రితంత్రి, సితార్ల నిర్మాణం చాల
వ్యత్యాసమైంది. త్రితంత్రి జిథర్ రకం వాయిద్యం. సితార్ లూట్ రకం. అందువల్ల ఈ విషయం
నమ్మదగ్గదిగా లేదు. కాని కాశ్మీర్‌లో ' సెతార్ ' అనే లూట్ రకం వాయిద్యమొకటి, సితార్
కంటే చిన్న ఆకారంతో వున్నది. దాని దండి ఒక ఆనపకాయ బుర్రనుంచి ముందుకు వచ్చింది.
దాని మీద ఒక వెడల్పు పీటకాని, సన్నటి పీటకాని ఉంటుంది. 7 తంతులున్నాయి. దండిమీద
కదపడానికి వీలైన గట్ తో చేసిన మెట్లు ఉన్నాయి. అందుచేత లూట్ వాయిద్యం కదిలే
మెట్లున్నది. పేరులో పోలికున్నది అయిన ఈ సితార మన సితార్‌కు ముందుండిన వాయిద్యమై
వుండ వచ్చనిపిస్తుంది. సుమారు ఒక శతాబ్దానికి పూర్వం సితార్ వాయిద్యాని కింత
ప్రాముఖ్యం కాని, గౌరవంకాని ఉండేదికాదు. అది దరిమిలా వచ్చిన విశేషం. ఆ రోజుల్లో
సితారుకేమీ ఆదరణ లేదు. అప్పటి సంగీత లోకంలో ' రుద్రవీణ ' , 'మహారాణిగా '
పరిపాలిస్తూ ఉండేది. సంగీత విద్వాంసులారోజుల్లో రుద్రవీణను తమ పారంపర్యమైన వంశ
గౌరవచిహ్నంగా చూసుకునే వారు. ఎవరైనా సంగీతం నేర్చుకోవడానికి వారిని ఆశ్రయిస్తే,
మొదట ' వట్టిసితార్ ' వాయిద్యాన్ని నేర్పి పంపించేవారట. సితారు ప్రాధమికంగా
నేర్చుకొనే అప్రాధాన్యమైన వాయిద్యమారోజుల్లో. అయితే 18వ శతాబ్దపు ఉత్తర భాగంలో
చాలామంది సుప్రసిద్ద విద్వాంసులు సితార్ వాయిద్యంతో సంగీత కచ్చేరీలు నిర్వహిస్తూ
సితార్ కు గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించి పెట్టేరని తెలుస్తుంది.
ఇతరాలైన జిథర్, లూట్ వాయిద్యాల్లోలాగే, సితార్ కు ఒక గుండ్రటి ఆనపకాయ బుర్ర వుంటుంది.ఆనపకాయ బుర్ర చదునుగా ఉంటే ఆ సితార్‌ను 'కంచువా ' అంటారు. సితార్ బుర్రని 'తుంబ ' అని కూడ అంటారు. ఈ తుంబకు ఒక పక్కని మెడ ఉండి, ఆ మెడ దండికి అతకబడి ఉంటుంది. తుంబ పైభాగాన్ని పలచని కర్రచెక్కతో కప్పుతారు. ఇది కొన్నింటిలో చదునుగాను, మరి కొన్నింటిలో కొంచెం వంపుతో ఉండవచ్చు. దండిమీద కొద్దిపాటి వంపు గల మెట్లు వుంటాయి. ఈ మెట్లు కదిలేవిగా, కావలసిన స్వరమేళానికి అనుకూలంగా మార్చడానికి వీలుగా వుంటాయి. వీటిని 'చల్‌తట్ ' అంటారు. ఈ 'చల్‌తట్ ' మెట్లు ఇప్పుడు సాధారణంగా ఉపయోగిస్తున్నారు. కాని పాత సితార్లలో దండి చివర ఇంకొక బుర్రకూడ ఉంటుంది. తుంబ మీద విశాలంగా వుండే పీట, ఆ పీట మీద నుంచి 5 ఇనప తీగలు బిగిస్తారు. ఈ పీట మీదే ' చికరి ' అనే పేరుతో రెండు తీగలు శృతికోసం బిగిస్తారు. ఇవికాక పెద్ద పీటకు కిందగా ఒక చిన్న పీటమీద ధ్వని విస్తారం కోసం, 'తరాబ్ ' అనే పేరుతో 11 నుండి 17 తీగల వరకు బిగింపబడి ఉంటాయి. ఈ ఏర్పాటు చవక రక సితార్లలో కనిపించదు. పీటలు చావకర్రతో కాని, కొమ్ముతోగాని, దంతంతో కాని చేసినవై ఉంటాయి. సితార్ వాయించడానికి ; కొణవం ' తీగతో చేసినది చూపుడు వేలుకు తొడుగుకుని, వేలును ముందుకు, అవతలికి కదుపుతూ మీటి వాయిస్తారు. ఇక్కడ 'చికరి ' తీగల్ని కేవలం శృతికోసం వాయిస్తారు కాని, వీణలో లాగ, తాళానికి కూడ వాయించడం సితార్ సాంప్రదాయంలో లేదు.
ఇంక
విల్లు వాయిద్యాల్లో అతి ముఖ్యమైన ' సారంగి ' వాయిద్యాన్ని గురించి తెలుసుకోవాలి.
సంగీత కచ్చేరీల్లో ఉపయోగించె సారంగి వాయిద్యం గుల్లగా ఉండే ఒకే కర్రతో చేయబడింది.
కింది భాగం సన్నని 'నడుం ' లాగ కనిపిస్తుంది. దీని మొత్తం పొడుగు సుమారు 60
సెంటీమీటర్లుంటుంది. కింది భాగం సన్నగా ఉండి చర్మంతో కప్పబడి ఉంటుంది. కర్రచెక్కతో
కప్పిన పైభాగం చదునుగా వుండి విశాలమైన దండిగా ఉపయోగిస్తుంది. చర్మంతో కప్పిన నడుం
వంటి కింది భాగం ధ్వని పెట్టెగా పని చేస్తుంది. దీనిలో ముఖ్య తంతులు 4 సాధారణంగా
గట్ తంతులుంటాయి. హిందూస్థానీ సంగీత వాయిద్యాలన్నింటికీ ఉన్నట్లే దీనిలో గూడ 'తరాబ్
' తంతులున్నాయి. ఈ వాయిద్యాన్ని వాయించే విధానం ముఖ్యమైన విషయం. స్వరాలు పలికించడం
కోసం వేళ్ళ కొసలతో తంతి మీద వాయించడం కాక, వేలి గోరుతో తంతిని తాకుతూ వాయిస్తారు. ఈ
విధానం మరే వాయిద్యంలోను కనిపించదని చెప్పాలి. ఈ వాయిద్యం జానపదుల్లోను శాస్త్రీయ
సంగీతంలోను కూడ ఉపయోగిస్తున్న వాయిద్యం. జానపదులు వాయించే సారంగి కూడ ఇదే రకంగా
ఉంటుంది. అయితే 'మందర్‌బహర్ ' అని జానపదులుపయోగించే వాయిద్యం సారంగి ఆకారంలోనే
పెద్ద సైజులో వుంటుంది. ఈ మందర్ బహర్ ధ్వని చాలా లోతుగా, పెద్ద ధ్వనితో వుంటుంది.
సారంగిని గురించి ఒక మాట చెప్పాలనిపిస్తుంది. ఇది జానపదుల్లోను, శాస్త్రీయ సంగీతంలో గూడ ఆదరించబడే మంచి లూట్ రకం వాయిద్యం. అయితే దీని ఆదరణ హిందుస్థానీ సంగీతంతోటే పరిమితమైపోయింది. గాని కర్ణాటక శాస్త్రీయ గానంలో దీనికేమీ ఆదరణ లేకుండా ఉంది. జానపదసాంప్రదాయంలో పుట్టి, నిర్మాణంలో కొద్ది మార్పులతో ఎంతో విశిష్టతని సంపాదించి, శాస్త్రియ సంగీతంలోగూడా వుపయోగపడే వాయిద్యాల్లో ఇలాంటి వాయిద్యం మరొకటి లేదని చెప్పాలి. ఇది పూర్తిగా మన దేశీయ వాయిద్యం అని కూడ చెప్పాలి.
వేర్వేరు జాతుల, వేర్వేరు సంస్కృతుల సమాహారమైన భారతీయ సంస్కృతి తనలో విభిన్న సంస్కృతులని మిళితం చేసుకుని ఓ ప్రత్యేక సంస్కృతిగా విరాజిల్లుతోంది. ఒక్కో సంస్కృతికి ఒక్కో విధమైన జీవన విధానంలాగా ఒక్కో విధమైన సంగీతం ఉండడం మన సంస్కృతిలోని ప్రత్యక లక్షణం. ఆయా సంగీతాల వాయిద్యాల పుట్టుక నేపధ్యం కొంత అస్పష్టంగా ఉన్నప్పిటికీ ఇన్ని విధాల సంగీత వాయిద్యాలు మరే దేశంలోనూ వాడుకలో లేవన్నది సుస్పష్టం. అందుకే భారతీయ సంగీతానికి విదేశాల్లో సైతం అంత ఆరుదణ. ఈ పరంపర ఇలా కొనసాగుతూనే ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
బి.సి.దేవ
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 01-10-2008 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in