telugudanam.co.in

      telugudanam.co.in

   

జయదేవుడు

12వ శతాబ్దానికి చెందిన గొప్ప కవి జయదేవుడు. పశ్చిమ బెంగాలుకు చెందిన బిర్‌భూం జిల్లాలోని అడ్‌జై నదీ తీరంపైన వెలసిన ఒక చిన్న గ్రామమ్మైన కౌండుభి (అప్పట్లో దీన్ని కెండుబిల్వ అని పిలిచేవారు)లో జయదేవుడు జన్మించాడు. "గీత గోవిందం" అనే తన ఉతృష్టమైన సంస్కృత కావ్యాన్ని జయదేవుడు ఈ కెండులి గ్రామంలోనే వ్రాసాడు. అప్పట్లో గౌడ్‌గా పిలువబడే బెంగాలును కళల సాహిత్యాభిమానులైన సేన రాజులు పాలించేవారు. గౌడ్ రాజ్యాన్ని పాలించిన ఆఖరి గొప్ప హిందూ రాజు లక్ష్మణసేన (క్రీ.శ.1178-1205) కొలువులొ వెలసిన మాణిక్యాలలో ఒక మణిగా జయదేవుడు ఉండేవాడు.

ఈయన తల్లిదండ్రులు భోజదేవ, రమాదేవీలు. వీరు కన్నౌజ్‌కు చెందిన బ్రాహ్మణులు. ఉద్యోగాన్ని వెదుక్కుంటూ జయదేవుడి తండ్రి భోజదేవుడు తన భార్యతో సహా కెండులిని చేరాడు. అక్కడే వారికి జయదేవుడు జన్మించాడు. ఐతే జయదేవుడు పసితనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకొని అనాధ అయ్యాడు. కానీ ధైర్యాన్ని వదులుకోకుండా సంస్కృతం నేర్చుకుని నిపుణత్వం గల కవిగ తయారయాడు. కృష్ణ భక్తుడైన జయదేవుడు ఇహ లోక జీవితంపై ఆసక్తిని చూపలేదు. కృష్ణలీలను గానం చేస్తూ చాలా సంవత్సరాలు అనేక స్థలాలను తిరుగుతూ బెంగాలుకు దక్షిణం వైపున ఉన్న ఒరిస్సాలోని జగన్నాధపురిని చేరాడు. పూరి జగన్నాధుడిని సేవించాడు. చేతిలో పిల్లనగ్రోవిని ధరించిన శ్రీకృష్ణుణ్ణి జయదేవుడు దర్శించాడు. ఆ తరువాత ఇతడు విష్ణువు ఇతర అవతారాలైన దశావతారాలను దర్శించాడు. పూరిలోని సుదేవశర్మ అనే పురోహితుడు జయదేవుడి జీవితానికి ఒక మలుపును ఇచ్చాడు. దాంతో అతడి జీవితమే మారిపోయింది. భగవత్ సన్నిధిలో నృత్యం చేసే తన అందాల రాశి కూతురు పద్మావతితో జయదేవుడి పెండ్లిని సుదేవ శర్మ జరిపించాడు. మొదట్లో నేను వ్రతం చెడని సన్యాసిని, పెండ్లి వద్దని జయదేవుడు మొరాయించాడు. "జగన్నాధుడే నాకు కలలో కనీంచి నా కూతురు పెండ్లి నీతో చెయ్యమని ఆదేశించాడు" అని సుదేవశర్మ చెప్పడంతో జయదేవుడు తమ మనసును మార్చుకున్నాడు.

తన కవితకు కావలసిన స్ఫూర్తిని జయదేవుడు తన అందాల రాశి భార్య పద్మావతిలో చూసాడు. కెండులి గ్రామానికి భార్యతో తిరిగివచ్చి భార్యాభర్తలు తమ కాలాన్ని అక్కడ గడిపారు. ఇక్కడే గీతగోవిందం" రచనకు పూనుకున్నాడు. గోపాల కృష్ణుడికి బృందావనంలోని రాధ పట్ల ఉన్న ప్రేమను ఈ కావ్యం వ్యక్తపరుస్తుంది. ఇందులో మొత్తం 24 అష్టపదులున్నాయి. ప్రతి అష్టపదినీ ఒక ప్రత్యేక రాగంతో, ప్రత్యేక తాళాన్ని అనుసరించి శాస్త్రీయ బాణీలో జయదేవుడు రచించాడు. అతడు భక్తిపారవశ్యంతో రాస్తున్నప్పుడు పద్మావతి నృత్యాభినయం చేస్తూ అతనికి స్ఫూర్తినిచ్చేదట. ఐతే ఆఖరి దశలో అతని ఘంటం ముందుకు సాగలేకపోయింది. అష్టపదిలోని ఆఖరి రెండు చరణాలను అతను విశ్వ ప్రయత్నం చేసినా రాయలేకపోయాడు. నిరుత్సాహంతో ఆయన నదీ స్నానానికి వెళ్ళాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడే స్వయంగా వచ్చి ఆ రెండు చరణాలను పూరిచేశాడన్న కథ ప్రచారంలో ఉంది. ఆ చరణాలను పూర్తి చేసిన తరువాత పద్మావతి తన భర్త కోసం చేసిన అన్నం తిని కృష్ణుడు బయటకి వెళ్ళాడట. స్నానం చేసి తిరిగివచ్చిన జయదేవుడు జరిగిన విషయం తెలుసుకుని ఉప్పొంగిపోయాడు. ఈరోజు గీతగోవిందం దేశవ్యాప్తంగా ప్రచారంలో ఉంది. ఒరిస్సా, బెంగాలు, దక్షిణ భారతపు భక్తిసంగీతంలో గీతగోవిందం చోటుచేసుకుంది. కేరళలోని అనేక దేవాలయాల్లో అష్టపదుల గానం ఈరోజుకూ జరుగుతూనే ఉంది. ప్రపంచ సాహిత్య కళాఖండంగా గీతగోవిందం పరిగణించబడుతోంది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: