|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం | మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
దాశరధి శతకము
శ్రీ రఘురామ! చారుతుల-సీతాదళధామ శమక్షమాది శృం
గార గుణాభిరామ! త్రిజ-గన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబంధరాక్షస వి-రామ! జగజ్జన కల్మషార్నవో
త్తారకనామ! భద్రగిరి-దాశరధీ కరుణాపయోనిధీ
భావం: రఘువంశమున బుట్టినవాడవు, సొంపైన తులసీదండలు గలవాడవు, శాంతి, ఓరిమి మొదలు గుణములచే నొప్పువాడవు, ముల్లోకముల బొగడదగిన పరాక్రమలక్ష్మికి ఆభరణమైనవాడా! వారింపనలవికాని కబంధుడను రాక్షసుని సంహరించినవాడా, జనుల పాపములను సముద్రమును దాటించు నామము గలవాడా! దయకు సముద్రమువంటివాడా! భద్రాచలమందుండు శ్రీరామా!
రామవిశాల విక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ
స్తోమ పరాంగనావిముఖ సువ్రత కామ వినీల నీరద
శ్యామ కకుత్ధ్సవంశ కలశాంభుధిసోమ సురారిదోర్భలో
ద్ధామ విరామ భద్రగిరి - దాశరధీ కరుణాపయోనిధీ!
భావం: జనులను సంతోషింపజేయువాడవు, పరశురాముని జయించినవాడవు, పరస్రీలయందాసక్తి లేనివాడవు, నల్లని మేఘమువంటి శరీర కాంతిగలవాడవు, కాకుత్ స్థ వంశమును సముద్రమునకు చంద్రునివంటి వాడవు, రాక్షసుల సంహరించిన వాడవునైన భద్రాచల రామా!
అగణిత సత్యభాష, శరణాగతపోష, దయాలసజ్ఘరీ
విగత సమస్తదోష, పృథివీసురతోష, త్రిలోక పూతకృ
ద్గగ నధునీమరంద పదకంజ విశేష మణిప్రభా ధగ
ద్ధగిత విభూష భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: సత్యము మాట్లాడువాఁడవు, శరణన్న వారిని రక్ష్మించువాడవు, దయచేతఁ బాపములఁ బోగొట్టువాడవు, బ్రాహ్మణుల సంతోషింపజేయువాడవు, గంగానది పుట్టిన పాదపద్మములు గలవాడవు, మణులచే నిగ నిగ మెఱయు సొమ్ములు గలవాడవు, భద్రాచల రామా!
రంగదరాతిభంగ, ఖగ రాజతురంగ, విపత్పరంపరో
త్తుంగ తమఃపతంగ, పరి తోషితరంగ, దయాంతరంగ స
త్సంగ ధరాత్మజా హృదయ సారసభృంగ నిశాచరాబ్జమా
తంగ, శుభాంగ, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిథీ.
భావం: శత్రువుల సంహరించినవాడవు, గరుత్మంతుడు వాహనముగ గలవాడవు, ఆపదల బోగొట్టువాడవు, రంగనాధునిచే సేవింపబడిన వాడవు, దయతో నొప్పు మనస్సుగలవాడవు, సత్సంగుడవు, సీతాహృదయమును పద్మమునకు తుమ్మెదవంటివాడవు, రాక్షసులకు బీభత్స కరుడవు, శుభాంగుడవునైన భద్రాచల రామా!
శ్రీద సనందనాది మునిసేవిత పాద దిగంతకీర్తిసం
పాద సమస్తభూత పరిపాల వినోద విషాద వల్లి కా
చ్ఛేద ధరాధినాథకుల సింధుసుధామయపాద నృత్తగీ
తాది వినోద భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: సంపదల నిచ్చువాడవు, మునులచే బూజింపబడినవాడవు, కీర్తిమంతుడవు, అన్ని భూతములను పాలించువాడవు, దుఖఃముల బోగొట్టువాడవు, క్షత్రియ కులమును సముద్రమునకు జంద్రుడవు, నృత్యము, గానము వేడుకగా గలవాడవు, భద్ర - నిధీ!
ఆర్యుల కెల్ల మ్రొక్కివిన తాంగుడనై రఘునాధ భట్టరా
రార్యుల కంజలెత్తి కవి సత్తములన్ వినుతించి కార్య సౌ
కర్య మెలర్పనొక్క శతకంబొన గూర్చి రచింతునేడుతా
త్పర్యమునన్ గ్రహింపుమిది దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: పెద్దల కందఱికి మ్రొక్కి, వంచిన శరీరము గలవాడనై గురువైన రఘునాధభట్టునకు నమస్కరించి, కవిశ్రేష్ఠులను పొగడి, కార్య లాభమునకై యొక శతకంబును వ్రాసెదను. దీని నిష్టముతో గైకొనుము దాశ - నిధీ!
మసకొని రేంగుబండ్లుకును మౌక్తికముల్ వెలవోసినట్లుదు
ర్వ్యసనముజెంది కావ్యము దురాత్ములకిచ్చితిమోస మయ్యె నా
రసనకుఁ బూతవృత్తిసుక రంబుగ జేకురునట్లు వాక్సుధా
రసములుచిల్క బద్యుముఖ రంగమునందునటింప వయ్యసం
తసము జెంది భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: రేగుపండ్లను ముత్తెములుపోసి కొనినట్లు దురాశతో మోసపోయి నా కావ్యములను దుర్మార్గుల కిచ్చితిని; నా నాల్కకు పవిత్రత సులభముగ గల్గునట్లును, పలుకుదేనియలు చిల్కునట్లు నా పద్యము ముఖమును నాట్యరంగమునందు సంతోషముతో నీవు నటింపుము. భద్ర - నిధీ!
శ్రీరమణీయహార యతసీ కుసుమాభశరీర, భక్త మం
దార, వికారదూర, పరతత్త్వవిహార త్రిలోక చేతనో
దార, దురంత పాతక వితాన విదూర, ఖరాది దైత్యకాం
తార కుఠార భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: హారములు గలవాడవు, అవిసెపూవువంటి శరీరకాంతి గలవాడవు, భక్తులకు కల్పవృక్షమవు, వికారములు లేనివాడవు, దేవతాతత్త్వమందు విహరించువాడవు, మూడులోకముల గల ప్రాణులను బోషించువాడవు, పాపముల బోగొట్టువాడవు, ఖరాది రాక్షసారణ్యమునకు గొడ్డలివంటి వాడవు, భద్ర - నిధీ!
దురితలతాలవిత్ర, ఖర దూషణకాననవీతిహొత్ర, భూ
భరణకళావిచిత్ర, భవ బంధవిమోచనసూత్ర, చారువి
స్ఫురదరవిందనేత్ర, ఘన పుణ్యచరిత్ర, వినీలభూరికం
ధరసమగాత్ర, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: పాపమను తీగలకు కొడవలివంటివాడవు, ఖరదూషణాదుల నెడి యడవికి యగ్నివంటివాడవు, భూమిని రక్షించుటయందు విచిత్రుడవు, పుట్టుకయను ముడిని విడదీయుటయే విధిగాగలవాడవు, ప్రకాశించు పద్మములవంటి నేత్రములు గలవాడవు, పుణ్యచరిత్రుడవు, మేఘకాంతి వంటి శరీరకాంతి గలవాడవు.
కనకవిశాలచేల భవకానన శాతకుఠారధార స
జ్జనపరిపాలశీల దివిజస్తుత సద్గుణ కాండకాండ సం
జనిత పరాక్రమక్రమ విశారద శారద కందకుంద చం
దన ఘనసార సారయశ దాశరథీ కరుణాపయోనిధీ. 10
భావం: బంగారు మయమైన వస్త్రములు గలవాడవు, సంసారమను నడవికి గొడ్డలి మొనవంటివాడవు, సజ్జనుల పరిపాలించెడివాడవు, దేవతలచే బొగడబడినవాడవు, మంచి గుణములు గలవాడవు, బాణవిద్యలో బండితుండవు, శరత్కాలపు మేఘము, మొల్లలు, గంధము పచ్చ కర్పూరము వంటి నిగ్గైన కీర్తిగలవాడవు.
శ్రీ రఘువంశ తోయధికి శీతమయూఖుడవైన నీ పవి
త్రోరుపదాబ్జముల్ వికసితోత్పల చంపక వృత్తమాధురీ
పూరితవాక్ప్రసూనముల బూజలొనర్చెద జిత్తగింపుమీ
తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ
భావం: రఘువంశమునకు జంద్రునివంటివాడవు, అట్టి నీ చరణముల నుత్పలము, చంపకము మొదలగు పద్యవృత్తములను పూలచే బూజించును. నా పూజలను గైకొనుము.
గురుతరమైన కావ్యరస గుంభనకబ్బుర మందిముష్కరుల్
సరసులమాడ్కి సంతసిల జూలుదురోటుశశాంక చంద్రికాం
కురముల కిందు కాంతమణి కోటిస్రవించిన భంగివింధ్యభూ
ధరమున జాఱునే శిలలు దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: మూఢులు గ్రంధములలోని రసముయొక్క కూర్పునకు రసికుల వలె సంతోషింపజాలరు. ఎట్లన చంద్రుని వెన్నెలకు చంద్రకాంత శిలలు కఱగి జాఱునట్లు వింధ్యపర్వతమున నుండు ఱాళ్ళు జాఱవు.
తరణికులేశ నానుడుల దప్పులు గల్గిన నీదునామ స
ద్విరచితమైన కావ్యము పవిత్రముగాదె వియన్నదీజలం
బరగుచువంకయైన మలినాకృతి బాఱిన దన్మహత్వముం
దరమె గణింప నెవ్వరికి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: నా మాటలలో దప్పులున్నను నీ పేరుతో వ్రాయబడు కావ్యము పవిత్రమైనదే, ఎట్లన గంగానది నీరు వంకరగ బాఱినను, ముఱికిగ మాఱినను దాని గొప్పతన మెక్కడ పోవును?
దారుణపాత కాబ్ధికి సదా బడబాగ్ని భవాకులార్తివి
స్తారదవానలార్చికి సుధారసవృష్టి దురంత దుర్మతా
చారభయంక రాటవికి జండకఠోరకుఠారధార నీ
తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: నీ పేరు పాపమను సముద్రమునకు బడబాగ్ని వంటిది, సంసారమను కార్చిచ్చునకు నమృతపు వాన, దుర్మతాచారములకు గొడ్డలి మొన వంటిది.
హరునకు నవ్విభీషణునక ద్రిజకుం దిరుమంత్ర రాజమై
కరికి సహల్యకుం ద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై
పరగినయట్టి నీపతిత పావననామము జిహ్వపై నిరం
తరము నటింపజేయుమిక దాశరథీ కరుణాపయోనిధీ
భావం: నీ నామ మీశ్వరునకు, విభీషణునకు, పార్వతికిని శ్రేష్ఠమగు మంత్రమైనది. అట్టి పరమ పవిత్రమైన నీ నామము నా నాల్కయం దెప్పుడు నాడునట్లు చేయుము.
ముప్పున గాలకింకరులు ముంగిటవచ్చిన వేళ, రోగముల్
గొప్పరమైనచో గఫము కుత్తుక నిండినవేళ, బాంధవుల్
గప్పినవేళ, మీస్మరణ గల్గునొ గల్గదొ నాటి కిప్పుడే
తప్పకచేతు మీభజన దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: ముసలితనమున యమభటులు వాకిట ముందునకు వచ్చి యుండగా, రోగ మెక్కువై కఫము గొంతులో నిండినప్పుడు, బంధువులు చుట్టుకొన్నప్పుడు మిమ్ము తలతునో తలపలేనో, భజింతునో భజింపలేనో కాబట్టి యిప్పుడే యా పని నెరవేర్చెదను.
పరమదయానిధే పతితపావననామ హరే యటంచు సు
స్ధిరమతులై సదాభజన సేయు మహత్ముల పాదధూళి నా
శిరమునదాల్తుమీరటకు జేరకుడంచు యముండు కింకరో
త్కరముల కాన బెట్టునట దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: దయకు సముద్రమువంటివాడవు, పాపులనుద్ధరించు పేరుగలవాడవు. హరీ యని నిలుకడగల బుధ్ధితో గొలుచు మహాత్ముల కాళ్ళ దుమ్ము నా నెత్తిపై దాల్తును. అప్పుడు యముడు తన భటులను నా జోలికి పోవద్దని యాజ్ఞాపించును.
అజునకు తండ్రివయ్యు సనకాదులకుం బరతత్త్వమయ్యుస
ద్ద్విజమునికోటికెల్లబర దేతవయ్యు దినేశవంశ భూ
భుజులకు మేటివయ్యుబరి పూర్ణుడవై వెలిగొందుపక్షిరా
డ్ధ్వజమిము బ్రస్తుతించెదను దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: బ్రహ్మకు దండ్రివి, సనకాదులకున్ బరతత్త్వమవు, బ్రాహ్మణులకు, ఋషులకు ముఖ్య దేవుడవు, సూర్యవంశపు రాజులలో నధికుడవు, అట్టి నిన్ను పొగడెదను.
పండిత రక్షకుం డఖిల పాపవిమొచను డబ్జసంభవా
ఖండల పూజితుండు దశకంఠ విలుంఠన చండకాండకో
దండకళా ప్రవీణుడవు తావక కీర్తి వధూటి కిత్తుపూ
దండలు గాగ నా కవిత దాశరధీ కరుణాపయోనిధీ!
భావం: పండిత రక్షకుఁడు, పాపములఁ బోఁగొట్టువాఁడు, బ్రహ్మేంద్రాదులచే బూజింపఁబడినవాఁడు, రావణాసురిని సంహరించినవాడను నీ కీర్తి కన్యకు నా కవిత్వమును బూదండవలెనిత్తును.
శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవా
చార జవంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠ ము
న్నారయభద్ర శైలశిఖరాగ్రముగాగ వసించు చేతనో
ద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధీ. 20
భావం: లక్ష్మీదేవి సీత, సేవకులు వైష్ణవజనులు, విరజానది, గోదావరి, వైకుంఠము, భద్రాచలము కాగా ప్రాణుల నుధ్ధరించునట్టి విష్ణువుడ నీవు దా - నిధీ!
కంటి నదీతటంబుబొడగంటిని భద్రనగాధివాసమున్
గంటి నిలాతనూజనురు కార్ముక మార్గణశంఖచక్రముల్
గంటిని మిమ్ము లక్ష్మణుని గంటి కృతార్ధుడ నైతి నో జగ
త్కంటక దైత్యనిర్ధళన దాశరధీ కరుణాపయోనిధీ!
భావం: ఏటిదరిని భద్రాచలమునం దుండుట జూచితిని, సీతను జూచితిని, గొప్పవైన ధనువును, బాణములను, శంఖచక్రముల జూచితిని, మిమ్ము, లక్ష్మణుని జూచి కృతార్ధుడనైతి.
హలికునకున్ హలాగ్రమున నర్ధము సేకురుభంగి దప్పిచే
నలమట జెందువానికి సురాపగలో జల మబ్బినట్లు దు
ర్మలిన మనోవికారియగు మర్త్యుని నన్నొడగూర్చి నీపయిన్
దలవు ఘటింపజేసితివె దాశరధీ కరుణాపయోనిధీ!
భావం: రైతునకు నాగేటి చివర ధనమిచ్చినట్లును, దప్పితో బాధ పడువానికి గంగానదీజల మబ్బినట్లును, చెడు మనస్సు గల నాకు నీపై భక్తి కలుగునట్లు చేసితివి.
కొంజకతర్క వాదమను గుద్దలిచే బరతత్త్వభూస్ధలిన్
రంజిలద్రవ్వి కన్గొనని రామనిధానము నేడు భక్తిసి
ద్ధాంజనమందుహస్తగత మయ్యెబళీ యనగా మదీయహృ
త్కంజమునన్ వసింపుమిక దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: తర్కవాదముచేనైన గన్గొనరాని రాముడను నిధి, భక్తియను బైరాగుల కాటుకతో నందఱు సెబాసనగా జేజిక్కిన దయ్యెను. ఇంక నా మనస్సునందు స్థావరముగా నిలువుము.
రాముఁడు ఘోర పాతక విరాముడు సద్గుణకల్పవల్లికా
రాముడుషడ్వికారజయ రాముడు సాధుజనావనవ్రతో
ద్దాముఁడు రాముడే పరమ దైవము మాకని మీ యడుంగు గెం
దామరలే భుజించెదను దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: పాపములను పోగొట్టువాడు, మంచిగుణములను కల్పవృక్షపు తీగెలకు దోటవంటివాడు, వికారములను జయించినవాడు, మంచివారిని రక్షించువాడు నైన రాముడే ముఖ్య దేవుడుగా నీ యడుగు లను పద్మముల గొలుతును.
చక్కెరమానివేముదిన జాలినకైవడి మానవాధముల్
పెక్కురు ఒక్క దైవముల వేమఱుగొల్చెదరట్ల కాదయా
మ్రొక్కిననీకు మ్రొక్కవలె మోక్ష మొసంగిన నీవయీవలెం
దక్కినమాట లేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: హీనులనేకులు నిన్ను విడిచి ఇంకొకరిని గొలిచెదరు. అనగా తియ్యని చక్కెరను తినలేక వేప వస్తువగు చేదును తినుటకు నేర్చినట్లున్నది.మ్రొక్క దగినవాడవు నీవే , మోక్షదాయకుడవు నీవే !
'రా' కలుషంబులెల్ల బయలంబడద్రోచిన 'మా'క వాటమై
డీకొనిప్రోవుచునిక్క మనిధీయుతులెన్నఁదదీయ వర్ణముల్
గైకొని భక్తి చే నుడువఁగానరు గాక విపత్పరంపరల్
దాకొనునే జగజ్జనుల దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: 'రా' యను నక్షరము పాపముల బారద్రోలగా, 'మా' యను నక్షరము వాకిలియై పాపముల జొరనీయకుండును అని పెద్దలైనవారు పై 'రామ' యను నక్షరముల బుద్ధిమంతులు భక్తితో బలుకకుందురే గాని, పలికినట్లైన యాపదలు ప్రపంచ జనుల గ్రమ్ముకొనవు.
రామహరే కకుత్ధ్సకుల రామహరే రఘురామరామశ్రీ
రామహరేయటంచు మది రంజిల భేకగళంబులీల నీ
నామము సంస్మరించిన జనంబు భవంబెడబాసి తత్పరం
ధామ నివాసులౌదురట దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: రామ హరే యని నీ పేరును గప్ప గొంతుకవలె దలఁచిన జనులు జన్మరహితులై మోక్షము జెందుదురట.
చక్కెర లప్పకున్ మిగుల జవ్వని కెంజిగురాకు మోవికిం
జొక్కపుజుంటి తేనియకు జొక్కులుచుంగన లేరు గాక నే
డక్కట రామనామమధు రామృతమానుటకంటె సౌఖ్యామా
తక్కినమాధురీ మహిమ దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: అయ్యో! ఈ కాలమువారు చక్కెరరాశికిని, యువతి యొక్క పెదవికిని, తేనెటీగలు పెట్టిన తేనెకు నాసపడుచున్నారు. రాముని పేరులో గల తీపిని నెఱుంగలేరు. రాముని పేరులో గల తీయదనము కంటే వానిలో గల తీయదన మంత సుఖమా!
అండజవాహ నిన్ను హృదయంబుననమ్మిన వారి పాపముల్
కొండలవంటివైన వెసగూలి నశింపక యున్నె సంత తా
ఖండలవైభవోన్నతులు గల్గకమానునె మోక్ష లక్ష్మికై
దండయొసంగకున్నె తుద దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: నిన్ను నమ్మి కొలిచినవారి పాపములు కొండలంతటివైనను నశించిపోవును. ఇంద్రవైభవములు కల్గును. మోక్షలక్ష్మి చేయూతనొసంగును.
చిక్కనిపాలపై మిసిమి జెందిన మీగడ పంచదారతో
మెక్కినభంగి మీవిమల మేచకరూప సుధారసంబు నా
మక్కువ పళ్లేరంబున సమాహిత దాస్యము నేటిదో యిటన్
దక్కెనటంచు జుఱ్ఱెదను దాశరథీ కరుణాపయోనిధీ. 30
భావం: చిక్కని పాలిమీద నిగనిగలాడు మీగడతో జక్కెర గలిపికొని తిన్నట్లుగ నీ రూప మనియెడు నమృతము నా ప్రేమ పాత్రలో దగిన దాస్యమును దోసిలియందు లభించిందని చెప్పి జుఱ్ఱుకొందును.
సిరులిడసీత పీడలెగ జిమ్ముటకున్ హనుమంతుడార్తిసో
దరుడు సుమిత్రసూతి దురితంబులుమానుప రామ నామముం
గరుణదలిర్ప మానవులగావగ బన్నిన వజ్రపంజరో
త్కరముగదా భవన్మహిమ దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: సంపద లిచ్చుటకు సీత, పీడల పోగొట్టుటకు హనుమంతుడు, ధుఃఖముబాప లక్ష్మణుడు పాపము హరించుటకు రామనామములను గరుణతో మానవుల రక్షిచుటకై యేర్పరుపబడినవి.
హలికులిశాంకుశధ్వజ శరాసన శంఖరథాంగ కల్పకో
జ్వలజలజాత రేఖలను సాంశములై కనుపట్టుచున్న మీ
కలితపదాంబుజ ద్వయము గౌతమపత్ని కొసంగినట్లు నా
తలపున జేర్చికావగదె దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: శంకచక్రాదులతో బ్రకాశించు పద్మరేఖల వలె చిహ్నములు గలవైన మీ పాదముల నహల్య కొసగినట్లు నా భామునందు గూడ నిలుచునట్లు చేయును.
జలనిధిలోనదూఱి కుల శైలముమీటి ధరిత్రిగొమ్మునం
దలవడమాటిరక్కసుని యంగముగీటిబలీంద్రునిన్ రసా
తలమునమాటి పార్ధివక దంబముగూఱ్చిన మేటిరామ నా
తలపుననాటి రాగదవె దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామాద్యవతారముల నెత్తినట్టి రామా! నా భావమునందు నిలువగా రమ్ము.
భండన భీముడా ర్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణకో
దండకళాప్రచండ భుజ తాండవకీర్తికి రామమూర్తికిన్
రెండవ సాటిదైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా
దాండద దాండ దాండ నిన దంబులజాండము నిండమత్తవే
దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: యుద్ధమునందు భయంకరుడు, దుఃఖితులకు జుట్టము, ధనుర్విద్యయందును, భుజబలము నందును పేరు గన్న రాముని వంటి దేవుడింకొకడు లేడు. ఈ విషయము నేను లోకమునకు జాటెదను.
అవనిజ కన్నుదోయి తొగలందు వెలింగెడు సోమ, జానకీ
కువలయనేత్ర గబ్బిచనుకొండల నుండు ఘనంబ మైధిలీ
నవనవ యౌవనంబను వనంబుకున్ మదదంతి వీవెకా
దవిలి భజింతు నెల్లపుడు దాశరధీ కరుణాపయోనిధీ!
భావం: సీత కన్నులను కలువలకు జంద్రుడవు, సీత యొక్క యుబ్బిన స్తనములను కొండల నుండెడి మేఘమవు. సీత యొక్క కొంగ్రొత్త యౌవన మను వనమునకు మదించిన యేనుగువంటివాడవు నీవని యిష్టముతో గొలుతును.
ఖరకరవంశజా విను ముఖండిత భూతపిశాచఢాకినీ
జ్వర పరితాపసర్పభయ వారకమైన భవత్పదాబ్జ ని
స్పుర దురువజ్రపంజరముజొచ్చితి, నీయెడ దీన మానవో
ధ్ధర బిరుదంక మేమఱుకు దాశరధీ కరుణాపయోనిధీ!
భావం: భూత పిశాచాది భయముల బోగొట్టునవైన నీ పాదముల బ్రవేశించితిని. ఇపుడు దీనుల నుద్ధరించువాడవను నీ బిరుదు యొక్క చిహ్నము మఱవకుము.
జుఱ్ఱెదమీక థామృతము జుఱ్ఱెదమీపదకంజతో యమున్
జుఱ్ఱెద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంబ నే
జుఱ్ఱెద జుఱ్ఱుజుఱ్ఱుఁగ రుచుల్ గనువారిపదంబు గూర్పవే
తుఱ్ఱులతోడి పొత్తిడక దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: మీ కధామృతమును మీ పాదపద్మములను జుఱ్ఱుకొందును. రామనామములో గారుచున్న యమృతరసమును జుఱ్ఱెదను. అందలి రుచుల నెఱిగినవారి స్థానమిమ్ము. దుర్మార్గుల స్నేహ మొసగకుము.
ఘోరకృతాంత వీరభట కోటికి గుండెదిగుల్ దరిద్రతా
కారపిశాచ సంహరణ కార్యవినోది వికుంఠ మందిర
ద్వార కవాట భేది నిజదాస జనావళికెల్ల ప్రొద్దు నీ
తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: నీ నామము యమభటులకు గుండె దిగులు కలిగించునది, దరిద్ర పిశాచమును నాశనము చేయునది. నీ భక్తుల కెప్పటికిని వైకుంఠ ద్వారమున గల తలుపులను బ్రద్దలు గొట్టునటువంటిది.
విన్నపమాలకించు రఘువీర నహిప్రతిలోకమందు నా
కన్నదురాత్ముడుం బరమ కారుణికోత్తమ వేల్పులందు నీ
కన్న మహాత్ముడుం బతిత కల్మషదూరుడు లేడునాకువి
ద్వన్నుత నీవెనాకు గతి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: నాకన్న దురాత్ముడు ప్రపంచమున లేడు. నీకన్న మహాత్ముడు దేవతలలో లేడు. కావున నాకు నీవె దిక్కు. మరియొకరు కాదు.
పెంపునఁదల్లివై కలుష బృందసమాగమ మొందుకుండు ర
క్షింపనుదండ్రివై మెయు వసించుదు శేంద్రియ రోగముల్ నివా
రింపను వెజ్జవై కృప గుఱించి పరంబు దిరబుగాఁగ స
త్సంపదలీయ నీవెగతి దాశరథీ కరుణాపయోనిధీ. 40
భావం: పోషించుటలో దల్లివి, పాపముల బొందకుండ రక్షించుటలో దండ్రివి, రోగమును వారించుటలో వైద్యుడవై, దయతో శాశ్వతమోక్ష మొసగి రక్షింపుము.
కుక్షినజాండపం క్తులొన గూర్చి చరాచరజంతుకోటి సం
రక్షణసేయు తండ్రివి పరంపర నీ తనయుండనైన నా
పక్షము నీవుగావలదె పాపము లెన్ని యొనర్చినన్ జగ
ద్రక్షక కర్తవీవెకద దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: కడుపులో బ్రహ్మాండముల నుంచుకొని చేతనా చేతన జంతువుల బాలించు నీవే నాకు దిక్కు. పాపములెన్ని చేసినను రక్షించు వాడవు నీవే సుమా!
గద్దరియో గిహృత్కమల గంధర సానుభవంబుఁజెందు పె
న్నిద్దవు గండుఁ దేఁటి థరణీసుత కౌఁగిలిపంజరంబునన్
ముద్దులుగుల్కు రాచిలుక ముక్తినిధానమురామరాఁగదే
తద్దయు నేఁడు నాకడకు దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: మహాత్ముల హృదయ పద్మములనుండు మకరందమును గ్రోలుదుమ్మెదవంటివాడవు, ముక్తికి నిక్షేపమువంటివాడవు నైన, రామ! నేడు దయతో నా కడకు రమ్ము.
కలియుగ మర్త్యకోటినిను గన్గొన రానివిధంబో భక్తవ
త్సలతవహింపవో చటుల సాంద్రవిపద్దశ వార్ధి గ్రుంకుచో
బిలిచిన బల్క వింతమఱపీ నరులిట్లనరాదు గాక నీ
తలపున లేదె సీత చెఱ దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: ఈ కలియుగములోని మనుష్యులు నిన్ను గనలేకున్నారో లేక నీకు భక్తులపై దయలేదో యెఱుంగను. మిక్కిలి విశేషమైన యాపద లను సముద్రములో బడుచు బిలిచినను బలుకకున్నావు. మే మిట్లనగూడదు, సీత పడిన బాధ నప్పుడే మఱచితివా? (మమ్ములను మఱువకు మనుట.)
జనవర మీక థాలి వినసైఁపక కర్ణములందు ఘంటికా
నినద వినోదముల్ సులుపునీచునకున్ వరమిచ్చినావు ని
న్ననయమునమ్మి కొల్చిన మహాత్మునకేమి యొసంగు దోసనం
దననుత మాకొసంగుమయ దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: నీ కధలు చెవులతో విన నిష్టపడక గంటలమ్రోఁతల నానందపడు ఘంటాకర్ణాదులకు వరము లిచ్చితివి. నిన్నెప్పుడుఁ గొల్చువారి కే మోసంగితివి. మాకు మోక్ష మిమ్ము.
పాపము లొందువేళ రణపన్నగ భూత భయజ్వారాదులన్
దాపద నొందువేళ భరతాగ్రజ మిమ్ము భజించువారికిన్
బ్రాపుగ నీవుదమ్ము డిరుపక్కియలన్ జని తద్విత్తి సం
తాపము మాంపి కాతురట దాశరధీ కరుణాపయోనిధి!
భావం: పాపాలు, యుద్ధం, పాము, భూతం, భయం, జ్వరం, మొదలైన వాటిచే నాకు కీడు జరిగే వేళ, నిన్ను స్మరిస్తే, నీవూ, లక్ష్మణుడూ చెరోవైపు, రక్షణగా నిలిచి కాపాడతారు కదా !
అగణిత జన్మకర్మదురి తాంబుధిలో బహుదుఃఖవీచికల్
దెగిపడవీడలేక జగతీధర నీపదభక్తి నావచే
దగిలి తరింపగోరితి బదంపబడి నదు భయంభు మాన్పవే
తగదని చిత్తమం దిడక దాశరధీ కరుణాపయోనిధీ!
భావం: పూర్వజన్మున జేసిన పాపములను సముద్రములోబడి దుఃఖములను తరంగములు దాటుకొని యీదజాలకుంటీని. నీ యడగులపై గల భక్తియను నావచే దాటగోరుచున్నాను. ఇది తగదు అనుకొనక నా భయమును మాంపుము.
నేనొనరించు పాపముల నేకములైనను నాదుజిహ్వకుం
బానకమయ్యెమీపరమ పావననామముదొంటి చిల్కరా
మాననుగావుమన్న తుది మాటకు సద్గతి జెందెగావునన్
దాని ధరింపగోరెదను దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: పూర్వం ఒక చిలుక చివరి దశలో, 'రామా' అని నన్ను స్మరించడంచేత మోక్షం పొందింది. అలాగే నేనెంత పాపినైనా, సదా నీస్మరణ చేస్తున్నాను. కాబట్టి నాకు కూడ సద్గతిని ఇవ్వు.
పరధనముల్ హరించి పరభామలనంటి పరాన్న మబ్బినన్
మురిపమ కానిమీఁదనగు మోసమెఱుంగదు మానసంబు
స్తరమదికాలకింకర గదాహతి పాల్పడనీక మమ్ము నేదు
తఱిదరిజేర్చి కాచెదవొ దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: మనస్సు పరధన, పరస్త్రీ, పరాన్నమునకు సంతొషించునే గాని, ముందు రానున్న మోసమెరుగదు. ఇది దాటరానిది. యమభటుల గదల దెబ్బలకు మమ్ము గురిచేయకుండగ చెంత జేర్చుకొని రక్షింపుము.
చేసితి ఘోరకృత్యములు చేసితి భాగవతాపచారముల్
చేసితి నన్యదైవములఁ జేరి భజించిన వారిపొందు నేఁ
జేసిన నేరముల్ దలఁచి చిక్కులఁబెట్టకుమయ్యయయ్య నీ
దాసుఁడనయ్య భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: నేను ఎన్నో చెడ్డపనులు చేశాను. భక్తులకు అపచారం చేశాను. ఇతర దేవతారాధన చేసే వారిలొ స్నేహం చేశను. నే చేసిన తప్పులను చూచి నన్ను కష్టపెట్టవద్దు. ఎన్నో తప్పులు చేసి నేను నీ భక్తుడను కావడం చేత నన్ను కరుణించు.
పరుల ధనంబుఁజూచిపర భామలజూచి హరింపగోరు మ
ద్గురుతరమానసం బనెడు దొంగనుబట్టినిరూఢదాస్య వి
స్ఫురితవివేక పాశములఁ జుట్టి భవచ్చరణంబనే మరు
త్తరువునగట్టివేయగ దె దాశరథీ కరుణాపయోనిధీ. 50
భావం: ఇతరుల ధనమును, ఇతర స్త్రీలను దోంగిలించు నా మనస్సును దొంగను, నీ సేవయను తెలివితే తెలివితేటలను త్రాళ్ళచేగట్టి నీ పాద మను వృక్షమునకు గట్టివేయుము.
సలలిత రామనామ జపసార మెఱుంగను గాశికాపురీ
నిలయుడగానుమీచరణ నీరజరేణు మహాప్రభావముం
దెలియనహల్యగాను జగతీవర నీదగు సత్యవాక్యముం
దలపగ రావణాసురుని తమ్ముడగాను భవద్విలాసముల్
దలచినుతింప నాతరమె దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: అతి సున్నితమైన నీ నామజపమందలి లోతు, తెలుసుకునేందుకు కాశీలో ఉండే వాడను కాను. నీ పాద ధూళి ఘనత తెలుసుకునేందుకు అహల్యను కాను. సత్య సంధత తెలుసుకునేందుకు విభిషణుడను కాదు. నీ లీలలు పొగడడం నా శక్తికి మించిన పని.
పాతకులైన మీకృపకు బాత్రులు కారెతలంచిచూడ జ
ట్రాతికిగల్గె బావన మరాతికి రాజ్యసుఖంబుగల్గె దు
ర్జాతికి బుణ్యమబ్బెగపి జాతిమహత్త్వమునొందెగావునం
దాతవ యెట్టివారలకు దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: నీ దయకు అందరూ పాత్రులే. నీవు బండరాతికి చైతన్యం కలిగించావు. రాయిని అహల్యగా చేశావు. శత్రుకోటిలో వాడైన విభీషణుని రాజుగా చేశావు. గుహునకు పుణ్యం ఇచ్చావు. కోతులకు శాశ్వత కీర్తి ప్రసాదించావు. అందరి కోరికలు తీర్చిన దాతవు, నన్ను కాపాడు.
మామక పాతక వజ్రము మ్రాన్పనగణ్యము చిత్రగుప్తులే
యేమని వ్రాతురో? శమనుడేమి విధించునొ? కాలకింకర
స్తోమ మొనర్చిటేమొ? వినజొప్పడ దింతకమున్నెదీనచిం
తామణి యొట్లు గాచెదవొ దాశరధీ కరుణాపయోనిధీ!
భావం: నా పాపాలు లెక్కలేనివి. చిత్రగుప్తుడు ఎలా రాస్తాడో, యముడు ఏ శిక్ష విధిస్తాడో, యమ భటుడు ఏమి చేస్తారో, కొంచెమైనా తెలుసుకునే అవకాశం లేదు. నీవు దీనుల కోర్కెలు తీర్చేవాడవు. నన్ను కాపాడే భారం నీదే సుమా !
దాసిన చుట్టూమా శబరి? దాని దయామతి నేలినావు; నీ
దాసుని దాసుడా? గుహుడు తావకదాస్య మొసంగినావు నే
జేసిన పాపమో! వినుతి చేసినగావవు గావుమయ్య! నీ
దాసులలోన నేనొకఁడ దాశరధీ కరుణాపయోనిధీ!
భావం: నీ దగ్గర చుట్టం కాకున్నా శబరినీ, నీ భక్తుడు కాకున్నా గుహుని కాపాడావు. ఎంత ప్రార్థించినా నన్ను కాపాడం లేదు. నేను చేసిన పాపం ఏమిటో అర్థం కావడం లేదు. నీ దాసులలో ఒకడని నన్ను గుర్తించి కాపాడు.
దీక్షవహించి నాకొలది దీనుల నెందఱి గాచితో జగ
ద్రక్షక తొల్లియా ద్రుపద రాజతనూజ తలంచినంతనే
యక్షయమైన వల్వలిడి తక్కట నామొఱజిత్తగించి
ప్రత్యక్షము గావవేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: లోకరక్షకా ! రామా ! పూర్వం ద్రౌపది ప్రార్థించినంతనే చీరలిచ్చి ఆదుకొన్నావు. అదే పనిగా నావంటి దీనుల నెందరినో ఉద్ధరించావు. ఎందువలనో నా మొరవిని ప్రత్యక్షం కావడం లేదు.
నీలఘనాభమూర్తివగు నిన్ను గనుంగొనికోరి వేడినన్
జాలముసేసి డాగెదవు సంస్తుతి కెక్కిన రామనామ మే
మూలను దాచుకోగలవు ముక్తికి బ్రాపది పాపమూలకు
ద్దాలముగాదె మాయెడల దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: నీలమేఘశ్యామ సుందరమైన నిన్ను చూడాలని, ఎంత ప్రార్థించినా నీవు ఎందుచేతో దాక్కుంటున్నావు. నీ రూపం దాచుకోగలవుగాని, నీ రామమహిమ ఎలా దాచగలవు. అదే మాకు మోక్షప్రాప్తి కాగలదు.
వలదు పరాకు భక్తజనవత్సల నీ చరితంబు వమ్ముగా
వలదు పరాకు నీబిరుదు వజ్రమువంటిది గాన కూరకే
వలదు పరాకు నాదురిత వార్ధికి దెప్పవుగా మనంబులో
దలతుమెకా నిరంతరము దాశరథీ కరునాపయోనిధీ.
భావం: ఎప్పుడూ నిన్ను ప్రార్థించే మపట్ల, నీవు బహూ జాగరూకుడవుగా ఉండాలి. నీకన్న ఏ బిరుదు, ఏ విశేషం పొల్లు పోనీయరాదు. మా పాప సముద్రం దాటేందుకు నావలా మారిపొ. నీవు బహూ జాగరత్తగా ఉండు.
తప్పులెఱుంగ లేక దురితంబులు సేసితినంటి నీవుమా
యప్పవుగావు మంటి నికనన్యులకున్ నుదురంటనంటినీ
కొప్పిదమైన దాసజను లొప్పిన బంటుకు బటవంటి నా
తప్పుల కెల్ల నీవెగతి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: అజ్!నానంలో తప్పులు చేసితిననీ, నీవే నాకు దైవమనీ, నిన్ను తప్ప ఇతరులను కొలవననీ, నీ దాసులకు దాసులైన వారికి సేవలు చేస్తాననీ, మనవి చేస్తున్నాను. నేను చేసిన పాపాలనుండి కాపాడేందుకు నీవే దిక్కు.
ఇతడు దురాత్ముడంచుజను లెన్నఁగ నాఱడిఁగొంటినేనెపో
పతితుఁడ నంటినో పతిత పావనమూర్తివి నీవుగల్ల నే
నితిరుల వేఁడనంటి నిహ మిచ్చిననిమ్ముపరంబొసంగుమీ
యతులిత రామనామ మధు రాక్షర పాళినిరంతరం బహృ
ద్గతమని నమ్మికొల్చెదను దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: నేను పెద్ద పాపాత్మునిగా ప్రజలచే నిందలుపొంది ఉండడం చేత, పాపులను రక్షించే నిన్ను అన్యులను సేవించలేను, ఇహమిచ్చినా, పరమిచ్చినా నీ ఇష్టం. నేను మాత్రం నీ నామాన్నే నిత్యం మనసులో స్మరించుకుంటను.
అంచితమైననీదు కరుణామృతసారము నాదుపైని బ్రో
క్షించిన జాలుదాననిర సించెదనాదురితంబు లెల్లదూ
లించెద వైరివర్గ మెడలించెద గోర్కులనీదుబంటనై
దంచెద, గాలకింకరుల దాశరథీ కరుణాపయోనిధీ. 60
భావం: ఓ రామా నీ కరుణ రవ్వంత నాపై చిలుకు చాలు. నేను నీ దాసుడనై సదా నీ నామ్మస్మరణం చేస్తూ పాపాలను దూరంగా ఉంచుతాను. అరిషడ్వర్గాలను జయిస్తాను. కోరికలను పుట్టనీయును. యమదూతలను సైతం భయపెట్టి తరిమివేస్తాను.
జలనిధు లేడునొక్క మొగిఁ జక్కికిదెచ్చెశరంబు, ఱాతినిం
పలరఁగ జేసెనాతిగఁబ దాబ్జపరాగము, నీ చరిత్రముం
జలజభవాది నిర్జరులు సన్నుతి సేయఁగ లేరు గావునం
దలపనగణ్యమయ్య యిది దాశరథీ కరుణాపయోనిధీ.
భావం:
కోతికిశక్యమా యసురకోటుల గెల్వను గాల్చెబో నిజం
బాతనిమేన శీతకరుడౌట దవానలు డెట్టివింత? మా
సీతపతివ్రతా మహిమసేవకు భాగ్యముమీకటాక్షము
ధాతకు శక్యమా పొగడ దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: సీతామహాసాధ్వి పాతివ్రత్య మహిమను, నీ సేవ వలన కలిగే శక్తినీ, నీ దయాగుణాన్ని వర్ణించడం బ్రహ్మకు తరంగాదు. ఎందుచేతంటే వానరం రాక్షసులను గెలువగలదా ? ఒక వేళ గెలిచినా, నిప్పు పెత్తిన అది కాల్చక చల్లబడునా? నీ మహిమంతా - ఇలాటి అద్భుతాలేగదా !
భూపలలామ రామరఘుపుంగవరామ త్రిలోక రాజ్య సం
స్ధాపనరామ మోక్షఫల దాయక రామ మదీయ పాపముల్
పాపగదయ్యరామ నిను బ్రస్తుతి చేసెదనయ్యరామ సీ
తాపతిరామ భద్రగిరి దాసరథీ కరుణాపయోనిధీ.
భావం: రాజశ్రేష్ఠుడవైన రామా! ముల్లోకముల రాజ్యస్థపన మొనర్చిన రామా! మోక్షఫల మొసగు రామా! నిన్ను స్తోత్రము జేసెదను. నా పాపము బాపుము.
నీసహజంబు సాత్వికము నీవిడిపట్టు సుధాపయోధి, ప
ద్మాసనుడాత్మజుండు, గమలాలయనీ ప్రియురాలు నీకు సిం
హాసనమిద్ధరిత్రి; గొడుగాక సమక్షులు చంద్రబాస్కరుల్
నీసుమతల్పమాదిఫణి నీవె సమస్తము గొల్చినట్టి నీ
దాసుల భాగ్యమెట్టిదయ దాశరథీ కరుణాపయోనిధీ
భావం: స్వాతికము నీకు సహజము. పాలసముద్రము నీవు విడిసిన స్థలము. బ్రహ్మ నీ కోడుకు. లక్ష్మి నీ భార్య. భూమి నీ సింహాసనము, ఆకసము గొడుగు. సూర్యచంద్రులు నీ కన్నులు. శేషుడు నీకు పూలపాంపు. ప్రపంచమంతయు నీవే. ఆట్టి నిన్ను గొల్చువారి భాగ్యమెట్టిదో కదా?
చరణము సోకినట్టి శిలజవ్వనిరూపగు టొక్కవింత, సు
స్ధిరముగ నీటిపై గిరులు దేలిన దొక్కటి వింతగాని మీ
స్మరణ దనర్చుమానవులు సద్గతి జెందిన దెంతవింత? యీ
ధరను ధరాత్మజారమణ దాశరథీ కరుణాపయోనిధీ
భావం:.కాలు సోకినంత రాయి స్త్రీగ మారుట వింత, సముద్రములో వేసిన వస్తువులు తేలియుండుట వింత, అయినను మిమ్ముల తలచినంత మానవులు సద్గతి పొందిన దెంత వింతయో గదా?
దైవము తల్లిదండ్రితగు దాత గురుండు సఖుండు నిన్నె కా
భావన సేయుచున్నతఱి పాపములెల్ల మనోవికార దు
ర్భావితుజేయుచున్నవికృపామతివైనను కావుమీ జగ
త్పావనమూర్తి భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: తల్లి, తండ్రి, గురువు, స్నేహితుడు నీవేనని కొలుతును. అటు వంటప్పుదును నా పాపములు మనోవికారము గలిగించుచున్నవి. దయతో నన్ను కాపాడుము.
వాసవ రాజ్యభోగ సుఖ వార్ధిని దేలు ప్రభుత్వమబ్బినా
యాసకుమేర లేదు కనకాద్రిసమాన ధనంబుగూర్చినం
గాసును వెంటరాదు కని కానక చేసిన పుణ్యపాపముల్
వీసరబోవ నీవు పదివేలకు జాలు భవంబునొల్ల నీ
దాసునిగాగ నేలుకొను దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: స్వర్గాధిపత్యమువంటి ప్రభుత్వ మబ్బినప్పటికి నాశకు తుది యుండదు. బంగారు కోడంతటి ధన మబ్బినము, గాసైన వెంట రాదు. తెలిసి తెలియక జేసిన పుణ్యపాపములు వదలవు. కావున పుట్టుక గోరను రక్షింపుము.
సూరిజనుల్ దయాపరులు సూనృతవాదు లలుబ్ధమానవుల్
వేరపతిప్రతాంగనలు విప్రులు గోవులు వేదముల్ మహా
భారముదాల్పగా జనులు పావనమైన పరోపకార స
త్కార మెఱుంగులే రకట దాశరధీ కరుణాపయోనిధీ!
భావం: తల్లి, తండ్రి, గురువు, స్నేహితుడు నీవేనని కొలుతును. అటు వంటప్పుడు నా పాపములు మనోవికాసము కలిగించుచున్నవి. దయతో నన్ను కాపాడుము.
వారిచరావతారము వారిధిలో జొఱబాఱి క్రోధ వి
స్తారగుడైన యా నిగమతస్కరవీర నిశాచరేంద్రునిం
జేరి వధించి వేదముల చిక్కెడలించి విరించికి మహో
దారతనిచ్చితీవెగద దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: మత్స్యావతార మెత్తి సముద్రములో మునిగి వేదముల దొంగిలించినట్టి సొమకాసురుని జంపితివి. వేదములకు వచ్చిన కష్టము తొలగించితివి. బ్రహ్మకు మరల వేదములు నొసగితివి.
కరమనుర క్తిమందరము గవ్వముగా నహిరాజుద్రాడుగా
దొరకొన దేవదానవులు దుగ్ధపయోధిమథించుచున్నచో
ధరణిచలింపలోకములు తల్లడమందగ గూర్మమై ధరా
ధరము ధరించితీవెకద దాశరథీ కరుణాపయోనిధీ. 70
భావం: మందరము కవ్వము, వాసుకి పగ్గములు కాగా దేవదానవులు పాలసముద్రమును జిలికిరి. అప్పుడు భూమి లోకములు చెదర నీవు తాబేలవై యా పర్వతమును తాల్చితివి.
ధారుణి జాపజుట్టిన విధంబునగైకొని హేమనేత్రుడ
వ్వారిధిలోనదాగినను వానివధించి వరాహమూర్తివై
ధారుణిదొంటికై వడిని దక్షిణశృంగమున ధరించి వి
స్తార మొనర్చితీవే కద దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: చాపవలె జుట్టి భూమిని హిరణ్యాక్షుడు సముద్రమందు దాగికొన, వానిని వరహావతారమెత్తి చంపి కొమ్ముపై బెట్టికొని మరల భూమి ఏప్పటియట్లుంచితివి.
పెటపెటనుక్కు కంబమున భీకరదంత నఖాంతర ప్రభా
పటలము గప్ప నుప్పతిలి భండనవీధి నృసింహభీకర
స్ఫుటపటుశక్తి హేమకశిపు విదళించి సురారిపట్టి నం
తటగృపజూచితీవెకద దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: ఉక్కుకంబము పెతపెటమనగా, భయంకరమైన పండ్ల యొక్కయు, గోళ్ళ యొక్కయు కాంతులు కప్పుకొన నరసింహావతారము నెత్తిరణమునందు హిరణ్యకశిపుని సంహరించితివి. అతని కుమారుని రక్షించితివి.
పదయుగళంబు భూగగన భాగముల వెసనూని విక్రమా
స్పదమగునబ్బలీంద్రునొక పాదమునందల క్రిందనొత్తిమే
లొదవజగత్త్రయంబు బురు హూతునికియ్యవటుండవైనచి
త్సదమలమూర్తి వీవెకద దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: రెండు పాదముల నాకాశమును భూమి నాక్రమించి, బలి చక్రవర్తిని మరియోక పాదమున బాతాళమునకు త్రొక్కితివి. ముల్లోకములింద్రునకిచ్చితివి.
ఇరువదియొక్కమాఱు ధరణీశుల నెల్లవధించి తత్కళే
బర రుధిర ప్రవాహమున బైతృకతర్పణ మొప్పజేసి భూ
సురవరకోటికి ముదము సొప్పడ భార్గవరామమూర్తివై
ధరణినొసంగితీ వెకద దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: పరుశురామావతారమెత్తి యిరువది యొక్క మారు రాజుల నందర జయించి వారి రక్తముతో తల్లిదండ్రులకు తర్పణము చేసితివి, భూమిని బ్రాహ్మాణుల కొసంగితిని.
దురమున దాటకందునిమి ధూర్జటివిల్ దునుమాడిసీతనుం
బరిణయమంది తండ్రిపనుప ఘన కాననభూమి కేగి దు
స్తరపటుచండ కాండకులిశాహతి రావణకుంభకర్ణ భూ
ధరముల గూల్చితీ వెకద దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: తాతకను జంపి, శివధనువును విరిచి, సీతను పెండ్లాడితిని, తండ్రి పంపగా అరణ్యముల వేళితివి, వాడియైనట్టి బాణములచేత రావణ, కుంభకర్ణాదు సంహరించితి.
అనుపమయాదవాన్వయసు ధాబ్ధిసుధానిధి కృష్ణమూర్తినీ
కనుజుడుగాజనించి కుజనావళినెల్ల నడంచి రోహిణీ
తనయుడనంగ బాహుబల దర్పమున బలరామ మూర్తివై
తనరిన వేల్పవీవెకద దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: కృష్ణుడు తమ్ముడుగాబుట్ట దుర్మార్గుల వధించుటకై రోహిణీ దేవికి గుమారుడవై బలరామావతార మెత్తిన దేవుడవు నీవెకదా!
సురలునుతింపగా ద్రిపుర సుందరుల వరియింపబుద్ధరూ
పరయగ దాల్చితీవు త్రిపురాసురకోటి దహించునప్పుడా
హరునకుదోడుగా వరశ రాసన బాణముఖో గ్రసాధనో
త్కర మొనరించితీవుకద దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: త్రిపురములందరి స్త్రీలను వరించుటకై బౌద్ధావతార మెత్తితివి. త్రిపురాసురుల నీశ్వరుదు దహించినపుడు ధనుర్బాణములతో నతనికి తోడ్పదితివి.
సంకరదుర్గమై దురిత సంకులమైన జగంబుజూచి స
ర్వంకషలీల ను త్తమ తురంగమునెక్కి కరాసిబూని వీ
రాంకవిలాస మొప్ప గలి కాకృత సజ్జనకోటికి నిరా
తంక మొనర్చితీవుకద దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: జాతి వర్ణ సంకరముతొడను, పాపములతోడను సెగుడుదిగుడైన లొకమును ఉద్ధరించుటకు కలి పురుషావతారమెత్తి సజ్జనులకు మేలుగావించితివి.
మనముననూహపోషణలు మర్వకమున్నె కఫాదిరోగముల్
దనువుననంటి మేనిబిగి దప్పకమున్నెనరుండు మోక్ష సా
ధన మొనరింపఁగావలయుఁ దత్త్వవిచారము మానియుండుట
ల్తనువునకు విరోధమిది దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: ఊహలు తప్పక్ముందును, కఫము మొదలగు వ్యాధులు రాకముందును, దేహములొ గట్టితనము తప్పకముందును, మానవుడు మోక్ష సాధనకు తగిన మార్గము లాలోచింపవలెను. తత్త్వవిచారమును మాన కూడదు.
ముదమున కాటపట్టుభవ మోహమద్వ దిరదాంకుశంబు సం
పదల కొటారు కోరికల పంట పరంబున కాది వైరుల
న్నదన జయించుత్రోవ విపదబ్ధికినావగదా సదాభవ
త్సదమలనామసంస్మరణ దాశరథీ కరుణాపయోనిధీ. 80
భావం: నీ నామమును సంస్మరించుట యన సంతోషమున కునికిపట్టు, సంసారమోహమను మదపుటేనుగున కంకుశము. సంపసల కిల్లు. కోర్కేలకు పంట. మోక్షమునకు మూలము. శత్రుల జయించుతకు త్రోవ. విపత్సముద్రము దాటుటకు ఓదవంటిది.
దురిత లతానుసార భయ దుఃఖ కదంబము రామనామభీ
కరతల హేతిచేఁ దెగి వకావకలై చనకుండ నేర్చునే
దరికొని మండుచుండు శిఖ దార్కొనిన శలబాదికీటకో
త్కరము విలీనమైచనవె దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: పాపమును తీగెననుసరించి వచ్చు భయదుఃఖాదులు రామనామ స్మరణమను ఖడ్గముచేదె తెగిపోవును. ఎట్లన అగ్ని పై బడిన మిడతలు మొదలగు పురుగు అందులొ కలిసి నశించిపోవునట్లె అగును.
హరిపదభక్తినింద్రియజ యాన్వితుడుత్తముఁడింద్రిమంబులన్
మరుగక నిల్పనూదినను మధ్యముఁడింద్రియపారశ్యుడై
పరగినచో నికృష్టుడని పల్కగ దుర్మతినైన నన్ను నా
దరమున నెట్లుకాచెదవొ దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: ఇంద్రియముల జయించినవాడు ఉత్తముడు, జయింప దీక్షబూనినవాడు మధ్యముడు: ఇంద్రియముల జిక్కినవాధముడు. ఇక దుర్మతినైన నన్ను యెట్లు కాచెదవో!
వనకరిచిక్కు మైనసకు పాచవికిం జెడిపోయె మీనుతా
వినికికిఁజిక్కెఁజిల్వగను వేఁదుఱుఁ జెందెను లేళ్ళు తావిలో
మనికినశించె దేటితర మాయిరుమూఁటిని గెల్వనై దుసా
ధనములనీ వె కావనగు దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: చేశరీరచాపల్యముచే నడవి యేనుగు చిక్కును. నోటి రుచికై చేప వలలో పడును. రాగము వినుటకై పోయి పాము చిక్కును. కనుల యున్మత్తత చే జింకలు చిక్కుకొనును. వాసనలొ నుంటచేతుమ్మెద నసించిపోవును. కావున పంచేంద్రియములను గెల్చుటకు పంచేంద్రియములను గెల్చుటకు పంచసాధనము లొసగి రక్షింపుము.
కరములుమీకుమ్రొక్కులిడ కన్నులు మిమ్మునె చూడ జిహ్వ మీ
స్మరణదనర్పవీనులుభ వత్కథలన్ వినుచుండనాస మీ
యఱుతును బెట్టుపూసరుల కాసగొనం బరమార్థ సాధనో
త్కరమిది చేయవేకృపను దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: చేతులు నీకు మ్రొక్కునట్లును, కన్నులు నిన్ను చూచునట్లును, నాలుక స్మరించునట్లును, చెవులౌ నీ కథలు వినునట్లును, మక్కు మికువేసిన పూదండల కాసపదునట్లును చేయగల మోక్షసాధనలను నా కొసగును.
చిరతరభక్తి నొక్కతుళసీదళ మర్పణ చేయువాడు ఖే
చరగరు డోరగ ప్రముఖ సంఘములో వెలుగన్ సధా భవత్
సురుచిర ధీంద పాదముల బూజలొనర్చిన వారికెల్లద
త్పర మరచేతిధాత్రిగద దాశరధీ కరుణాపయోనిధీ!
భావం: భక్తితొనొక తులసీదళ మర్చించినను గరుడోరగ ప్రముఖులలో నొకడు కాగలడు. నీ పాదములను బూజించువారికి మొక్ష మరచేతి ఉసిరిక కాయ.
భానుడు తూర్పునందుగను పుట్టినఁ బావక చంద్ర తేజముల్
హీనత జెందినట్లు జగదేక విరాజితమైన నీ పద
ధ్యానము చేయుచున్నఁ బర దైవమరీచులడంగకుండు నే
దానవ గర్వ నిర్దళన దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: సూర్యుడు ఉదయించుతతోడనే అగ్ని, చంద్రుల కాంతులు కొంచెపడినట్లు నీ పదధ్యానము జేసినట్లైన యితర దేవతల కాంతు లడంగిపోవును.
నీమహనీయతత్త్వ రస నిర్ణ యబోధ కథామృతాబ్ధిలో
దామునుగ్రుంకులాడకవృ థాతనుకష్టముజెంది మానవుం
డీ మహిలోకతీర్థముల నెల్ల మునింగిన దుర్వికార హృ
తామసపంకముల్ విదునె దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: నీ కథామృత మను సముద్రములొ తాముమునగక శరీర కష్టముజెంది మానవు లెన్ని తీర్థముల మునిగినను మనస్సున కంటిన తమోగుణమను బురద వీడదు.
కాంచన వస్తుసంకలిత కల్మష మగ్ని పుటంబు బెట్టెవా
రించినరీతి నాత్మనిగిడించిన దుష్కర దుర్మలత్రయం
బంచిత భ క్తియోగ దహ నార్చిఁదగుల్పక పాయునే కన
త్కాంచనకుండలాభరణ దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: బంగారమున కంటిన మైల నగ్నిపుతమున బెట్టి శుద్ధము జేయునట్టు దుర్మలములతో గూడిన మనస్సును భక్తియోగ మనెడెనగ్నితో గాల్పనట్లైన పోజాలదు.
నీసతి పెక్కు గల్ములిడనేర్పిరి, లోక మకల్మషంబుగా
నీసుత సేయు పావనము నిర్మిత కార్యధురీణ దక్షుడై
నీసుతుడిచ్చు నాయువులు నిన్న భుజించినఁ గల్గకుండునే
దాసులకీప్సి తార్థముల దాశరథీ కరుణాపయోనిధీ. 90
భావం: నీభార్య (లక్ష్మి) సంపద లిడగలదు. నీ బిడ్డయైన గంగాదేవి లోకమును పావనము జేయును. నీ కుమారుడైన బ్రహ్మ స్ర్షిటి కార్యముల నెరవేర్చును. అట్టియెడ నిన్ను భజించినవారికి కోరిన కోర్కెలు సిద్ధించును.
వారిజపత్రమందిడిన వారివిధంబున వర్తనీయమం
దారయ రొంపిలోన దను వంటని కుమ్మరపుర్వురీతి సం
సారమున మెలంగుచు విచారడైపరమొందుగాదెస
త్కార మెఱింగి మానవుడు దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: తామరపాకు నీరువంటి చపలము గలది మానవుని శరీరము. రొంపిలో తిరుగుచుండు కుమ్మరి పుర్వువలె సంసారమందు విచారణగల్గి మెలఘెడివాడు మోక్షమందును.
ఎక్కడి తల్లిదండ్రి సుతులెక్కడి వారు కళత్ర బాంధవం
బెక్కడ జీవుఁడెట్టి తను వెత్తిన బుట్టును బోవుచున్న వా
డొక్కడెపాప పుణయ ఫల మొందిన నొక్కడె కానరాడువే
ఱొక్కడు వెంటనంటిభవ మొల్లనయాకృప జూడువయ్యనీ
టక్కరి మాయలందిడక దాశరథీ కరుణా పయోనిధీ.
భావం: తల్లిదండ్రు లెక్కడ? కొడుకు లెక్కడివారు? భార్య చుట్టము లెక్కడ? జీవు డెట్టి దేహమును ధరించి పుట్టుచు బోవుచున్నదు? పాపపుణ్యము లందుటకు తానొక్కదే కాని యితరు డెవ్వడును గనరాడు. ఏదైనను వెంట నంటదు కాన పుట్టుక లేకుండచేసి నన్ను కాపాడుము.
దొరసినకాయముల్ముదిమి తోచినఁజూచిప్రభుత్వముల్సిరు
ల్మెఱపులుగాగజూచిమఱి మేదినిలోఁదమతోడివారుముం
దరుగుటజూచిచూచి తెగు నాయువెఱుంగక మోహపాశము
ల్దరుగనివారికేమిగతి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: శరీరమునకు ముసలితనుము వచ్చుటతోడనే ప్రభుత్వము, సంపదలు, మెరపులవలె, (క్షణములొ వచి నశించునవి.) చూచి తన తోడివారు ముందె గతించుటను చూచి చావు నెరుగలేక మోహపుద్రాళ్ళు వదిలించుకొన లేనివారి గతి యేమొ కదా?
సిరిగలనాఁడు మైమఱచి చిక్కిననాఁడుదలంచి పుణ్యముల్
పొరిఁబొరి సేయనైతినని పొక్కినఁ గల్గు నెగాలిచిచ్చుపైఁ
గెరలిన వేళఁదప్పికొని కీడ్పడు వేళ జలంబు గోరి త
త్తరమునఁ ద్రవ్వినం గలదె దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: సంపద గల రోజు దేహము మరచి యుడిగిన పిమ్మట పుణ్య కార్యముల దలచికొని మాతికి జేయకపోతి ననుకొన్న నేమి లాభము? ఎట్లన గాలి యగ్నిని రెచ్చగొట్టునప్పు డార్పక నతిశయించిన పిమ్మట నీళ్ళకు బావి త్రవ్వినట్లుండును.
జీవనమింకఁ బంకమున జిక్కిన మీను చలింపకెంతయు
దావుననిల్చి జీవనమె దద్దయుఁ గోరువిధంబు చొప్పడం
దావలమైనఁగాని గుఱి తప్పనివాఁడు తరించువాఁడయా
తావకభక్తియో గమున దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: నీళ్ళింకగ బురదలో చిక్కిన చేప కదలకుండ నీటినే కోరుకునట్లు, నీ భక్తియోగముపై మనసుపెట్టి గురి తప్పక కొలుచువాడు తరించును.
సరసునిమానసంబు సర సజ్ఞుడెరుంగును ముష్కరాధముం
డెఱిఁగిగ్రహించువాడె కొల నేకనిసముఁ గాగదుర్దురం
బరయఁగ నేర్చునెట్లు విక చాబ్దమరంద రసైక సౌరభో
త్కరముమిళింద మొందుక్రియ దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: సరసుని మనస్సు సరసుడె గాక మూర్ఖుండెట్లెఱుంగును., ఎట్లు కొలనిలో నుండు కప్ప వికసించిన పద్మము లందలి మరంద వాసనను తుమ్మేదవలె ననుభవింపగోరనిరీతి.
నోఁచినతల్లిదండ్రికిఁ దనూభవుఁడొక్కడెచాలు మేటిచే
చాఁచనివాడు వేఱొకఁడు చాచిన లేదన కిచ్చువాఁడునో
రాఁచినిజంబకాని పలు కాడనివాఁడు రణంబులోన మేన్
దాచనివాఁడు భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: పూర్వ పుణ్యములు చేసిన తల్లిదంద్రులకు కొడుకు చేచాచని వాడు. అడిగిన లేదన కిచ్చువాడు, నోరు తెరచి నిజంబు మాత్రమే పలుకువాడు. యుద్ధములొ శరీరమును దాచనట్టివాడు నైన యొక్క కొడుకైన జాలును.
శ్రీయుతజానకీరమణ చిన్నయరూప రమేశరామ నా
రాయణ పాహిపాహియని బ్రస్తుతిఁ జేసితి నామనంబునం
బాయక కిల్బిషవ్రజ వి పాటనమందఁగ జేసి సత్కళా
దాయి ఫలంబునాకియవె దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: రామ! రక్షింపుము, రక్షింపుమని పొగడితిని. నా పాపముల తొలగించు మోక్షఫల మొసగుము.
ఎంతటిపుణ్యమో శబరి యెంగిలిగొంటివి వింతగాదె నీ
మంతన మెట్టిదో యుడుత మైనిక రాగ్ర నఖాంకురంబులన్
సంతసమందఁ జేసితివి సత్కులజన్మము లేమి లెక్క వే
దాంతముగాదె నీ మహిమ దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: శబరి పుణ్య మెంతటిదో యామె యెంగిలి దింటివి. ఉడుత దేహమును వ్రేలిగోళ్ళతో దాకి దానికి సంతోషము గల్లించితిని. మంచీ కులమున బుట్టుకలకేమి లెక్క? నీ ప్రభావము వేదాంతగోచరమైనది.
బొంకనివాఁడెయోగ్యుడరి బృందము లెత్తిన చోటజివ్వకుం
జంకనివాఁడెజోదు రభసంబున నర్థి కరంబుసాఁచినం
గొంకనివాఁడెదాత మిముఁ గొల్చిభజించిన వాఁడె పోనిరా
తంక మనస్కుఁ డెన్న గను దాశరథీ కరుణాపయోనిధీ. 100
భావం: అబద్ధము లాడనివాడె యోగ్యుడు. శత్రువు లెత్తివచ్చిన యుద్ధమునకు భయపడనివాడె వీరుదు. యాచకుడు చేయిసాచిన నిచ్చుటకు జింతింపనివాడె దాత. మిమ్ము గొల్చి భజించినవాడె యడ్డులేని మనస్సు గలవాడు.
భ్రమరముగీటకంబుఁ గొని పాల్పడి ఝాంకరణో కారియై
భ్రమరముగానొనర్చునని పల్కుటఁ జేసి భవాది దుఃఖసం
తమసమెడల్చి భక్తిసహి తంబుగ జీవుని విశ్వరూప త
త్త్వమునధరించు టేమరుదు దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: తుమ్మెద పురుగును గైకొని తన ఝంకారముతో దుమ్మెదగ మార్చునట్లు, పుట్టుక మొదలగు దుఃఖపు జీకటి బాపి జీవుని నీలో గలుపుకొనుట్లో విశేష మేమియును లేదు.
తరువులు పూచికాయలగు దక్కుసుమంబులు పూజగాభవ
చ్చరణము సోకిదాసులకు సారములో ధనధాన్యరాశులై
కరిభట ఘోటకాంబర నకాయములై విరజా సము
త్తరణ మొనర్చుజిత్రమిది దాశరధీ కరుణాపయోనిధీ!
భావం: చెట్టు పూచి కాయలగును, కాన ఆ పూవులను పూజకై నీ చరణములు సోకినట్లైన భక్తులకు ధనధాన్యములు, కరిభటఘోట కాదులునై విరాజానదిని దాటింపజేయును.
పట్టితిభట్టరార్యగురు పాదములిమ్మెయినూర్ధ్వ పుండ్రముల్
వెట్టితిమంత్రరాజ మొడి బెట్టితి నయ్యమకింక రాలికిం
గట్టితిబొమ్మమీచరణ కంజలందుఁ దలంపుపెట్టి బో
దట్టితిఁ బాపపుంజముల దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: భట్టరార్యుడను గురువు యొక్క పాదములబట్టితిని, నామముల బెట్టితిని. రామనామమును సాధించితిని. యమభటులకు బొమ్మ గట్టితిని. నీ పాదములపై దలపుపెట్టి పాపముల బోగొట్టితిని.
అల్లన లింగమంత్రి సుతుడత్రిజ గోత్రజుడాదిశాఖ కం
చెర్ల కులోద్బవుం దంబ్రసిద్ధిడనై భవదంకితంబుగా
నెల్లకవుల్ నుతింప రచియించితి గోపకవీంద్రుడన్ జగ
ద్వల్లభ నీకు దాసుడను దాశరధీ కరుణాపయోనిధీ! 104
భావం: లింగనమంత్రిపుత్రుడ, ఆత్రేయసగోత్రుడ, ఋక్శాఖవాడ, కంచర్ల వంశీయుడను, నీ భక్తుడనైన గోపకవీంద్రుద ననువాడ కవులందరు బొగడ నీ కర్పణయు శతకమును రచించితిని.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in