telugudanam.co.in

      telugudanam.co.in

   

పిల్లి తెచ్చిన తంటా

తెనాలి రామలింగడి ఇంట్లో ఎలుకలు బెడద విపరీతంగా ఉండేది. రామలింగడు, అతని భార్యకు ఇంట్లో ఉండడం ఒక నరకంగా అనిపించేది. ఒకరోజు రామలింగడి భార్య కొత్త పట్టుచీరని ఎలుకలు కొరికి లెక్కలేనన్ని రంధ్రాలు చేశాయి. ఇంక కోపం పట్టలేని రామలింగడు ఈ ఎలుకలు బెడద పోగొట్టుకోవాలంటే పిల్లిని పెంచడమే మార్గమని బలిష్టమైన పిల్లిని ఇంటికి తీసుకువచ్చాడు.

ఆ పిల్లి మెల్లమెల్లగా ఇంట్లో ఉన్న ఎలుకలన్నింటినీ స్వాహా చేయసాగింది. ఒకరోజు ఆ పిల్లి పారిపోతున్న ఒక ఎలుకను వెంబడిస్తూ పక్కింట్లోకి దూరింది. పక్కింట్లో ఉన్న పెంపుడు చిలక అరవడంతో అత్యుత్సాహంగా ముందుకు ఉరికింది. ఆ చిలకను చంపి తర్వాత ఎలుక అంతు చూసింది పిల్లి. చిలకను చంపిన రామలింగడి పెంపుడి పిల్లిని బంధించి పక్కింటివారు రామలింగడు చూస్తుండగానే దాని తలపై కర్రతో బలంగా కొట్టసాగారు. "అయ్యా! ఈ పిల్లి మా ఎలుకలు బెడదు దూరం చేసింది. పిల్లి తప్పు చేసినందుకు నేను మీకు క్షమాపణలు చెప్తున్నాను" అని బతిమాలుతుండగానే పిల్లి తలపై మళ్ళీ గట్టిగా కొట్టి తరిమేశారు పక్కింటి దంపతులు.

రామలింగడికి కోపం వచ్చింది. కాని బయట పడకుండా ఆపుకున్నాడు. రోజులు తర్వాత పక్కింటివారికి ఎవరో ఒక అందమైన బంగారు రంగులో ఉన్న పెట్టి పంపించారు. అది చూసిన ఆ దంపతులు తమకెవరో అద్భుతమైన బహుమతిని పంపారు, అందులో ఎలాంటి బహుమతులున్నాయో తెలుసుకోవాలని లోపలి గదిలోకెళ్ళి ఆ పెట్టెను తెరిచారు. అంతే వందలాది ఎలుకలు వాటికిష్టమున్నవైపు పరుగులు పెట్టాయి. మంచం కిందకు, అటక మీదకు, అట్టపెట్టెలోకి అన్ని వైపులకి వెళ్ళి దాక్కున్నాయి.

ఆ పెట్టెలో ఓ ఉత్తరం ఉంది. ఆ ఉత్తరంలో 'మీరు పిల్లి లేకుండా కూడా ఎలుకలను కట్టడిచేయవచ్చునని నాకు సలహా ఇచ్చారుగా. నేను మీకు పెట్టెనిండా ఎలుకలను పంపిస్తున్నాను. వాటిని మీరెలా కట్టడిచేస్తారో నాకు తెలియజేయండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి తెనాలి రామలింగడూ అని రాసి ఉంది. విషయం అర్ధమైన ఆ దంపతులు లబోదిబోమన్నారు. తమ తొందరపాటుకు చితించారు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: