telugudanam.co.in

      telugudanam.co.in

   

జానపద నృత్యాలు

అసంఖ్యాక జాతులతోనూ పతిస్థితులతోనూ కూడి ఉన్న భారతదేశం అనేక శతాబ్దాలుగా రకరకాల జానపద నృత్యాలకు నిలయంగా ఉంది. భారతదేశంలోని నేటి శాస్త్రీయ నృత్య విధానాలు చాలా కట్టుబాట్లకు లోబడి ఉండటంతోపాటు ఎంతో నాజూకుతనాన్ని చూపుతున్నది. ఆటవికుల గూడెములోనూ కర్షకుల కుటీరాలలోనూ నేటికి తమ పాటవాన్ని కోల్పోకుండా బ్రతికి ఉన్న సామాన్య ప్రజా నృత్యాలనుండి మన శాస్త్రీయ నృత్యాలు పుట్టాయి. భారతీయ జానపద నృత్యాలలో నిరాడంబరమైన సరళత ఉంది. వాటి సరళత వెనుక మహత్తర కళాభావాలు రెండు ఉన్నాయి. సహజమైన భావగాంభీర్యం, విస్పష్టమైన వ్యక్తీకరణ ఉన్నాయి. జానపద నృత్యానికి, దానినుండి ప్రధానంగా ఉధ్భవించిన శాస్త్రీయ నృత్యానికి ఉన్న భేదం రీతిలోనే. జానపద నృత్యంలో కళారీతిని ప్రయత్నం పూర్వకంగా తెచ్చుకోవటం అంటూ ఉండదు. ఇందుచేతనే జానపద నృత్యంలో చిరకాలం నుంచి వస్తున్న ప్రబలమైన సంప్రదాయాలు ఉన్నప్పటికీ అది స్వయం ప్రేరణతో ఉద్భవించేదిగానే ఉంది. ఈ నృత్యాలు ఇప్పటికీ బ్రతికి ఉండటమే ఈ విషయాన్ని దృవపరుస్తూ ఉంది. నృత్యం చేసే వాళ్ళకు కలిగే ఆనందాన్ని కూడా ఇందుకొక అదనపు ఋజువుగా చెప్పవచ్చును. ఈ నృత్య ప్రదర్శనలకు ప్రత్యేకంగా ప్రేక్షకులంటూ ఉండరు. చుట్టూ మూగి చెప్పేవాళ్ళు కూడా ఈ సామూహిక ఆత్మ వ్యక్తీకరణలో నర్తకులవలెనే భాగస్వాములుగా ఉంటారు. భావోద్రేకాన్ని ప్రదర్శించడంలో అభి వ్యక్తీకరణ సహజంగానూ, వాస్తవరూపంగానూ ఉండాలనేదే నిజమైనట్లైతే వాళ్ళకది తెలియదనే చెప్పవచ్చు. ఏ ఒక్క నర్తకుని సౌందర్యంగానీ ఏ ఒక్క భంగిమలోని విశిష్టత కానీ ముఖ్యం కాదు. పెల్లుబుకుతున్న ఆత్మానందం; దాన్ని సునాయాసంగా నృత్యం ద్వారా ద్యోతకం చెయ్యటం ఈ రెండిటి సమ్మేళనమే జానపద నృత్యంలో ప్రాధాన్యము వహిస్తుంది. ఆధునిక శాస్త్రీయ నృత్యరీతులలోవలె దీనిలో ప్రేక్షకులూ నర్తకులూ వేరు వేరు కాదు.

జానపద నృత్యాలు ప్రజా జీవితంలో పడుగు పేకలవలె అల్లుకొని ఉన్నాయి. ప్రజలు రోజూ చేసే పని పాటలలోని అవయవ సంచలనం నుంచే జానపద నృత్యాలకు భావ ప్రేరణ కలుగుచున్నది. ఈ నృత్యాలలో విత్తనాలు చల్లటం, కోతలు కొయ్యటం, వేటాడటంవంటి కొన్ని పనులకు లయాన్వితరీతులు సమకూర్చబడి, సౌందర్యవంతం చేయబడినవి. పొలాలలోనూ; అడవులలోనూ పని చెయ్యడానికి వెళ్ళక ముందే రైతుల పిల్లలు ఈ నృత్యాలు నేర్చుకుంటారు. దీనివల్ల వారు పెద్దయి పనిపాటలలో పాల్గొనే సందర్భంలో వారు చేసే ప్రతి అవయవ సంచలనం సుపరిచితంగానూ, సంతోషదాయకంగానూ ఉంటుంది. అడవి జంతువులతో తలపడవలసి వస్తే ఆటవికుల కుర్రవాడు జంకడు. ఎందుచేతనంటే చిన్నతనం నుండి అతడు వేట నృత్యాలు అభ్యాసనం చేసి ఉన్నాడు. ఆ నృత్యాలు కేవలం ఒక భావాన్ని స్పురింప జేసే ఆచార వ్యవహారం కాదు; అడవులలో సంచరించే భయంకర జంతువులను జయించడానికి అత్యవసరమైన అవయవ భంగిమలతో ఆ నృత్యాలు నిండి ఉన్నాయి. ఇలాటి ఉదాహరణలు ఎన్నో చెప్పవచ్చును. ఇవి కేవలం ఆ నృత్య ప్రయోజనాన్నే కాక, జానపద నృత్యాలకు ప్రజాల జీవితానికి ఎలాంటి సంబంధమున్నదో వివరిస్తాయి. భారతీయ జానపద నృత్యాలు జానపద నర్తకుల నిత్యజీవితంలో వేళ్ళు పాదుకొని ఉండటమే కాక,వారి పరిశరాలలో కూడా వ్రేళ్ళు తన్ని ఉన్నాయి. ఈ పరిశరాలు జనపదనృత్యాల అభివృద్దికి తీరు తెన్నులను కల్పించటమే కాక, నృత్య ప్రదర్శనలకు అర్హమైన రంగస్థలంగా కూడా ఉపకరిస్తున్నాయి.

జానపద నర్తకుల జీవితాలతోపాటు జానపద నృత్యాలను కూడా ప్రకృతి నిశ్శబ్దంగా, తెలియకుండా రూపొందిస్తున్నది. వైవిధ్యానికి వాసిగన్న భారతదేశంలో జానపద నృత్యాలలోని వైవిధ్యానికి చాలావరకు ఇదే కారణం. పర్వతప్రాంతాల నర్తకులు, ఒకరి చేతులొకరు పెనవేసుకొని, బారులుతీరి, వంగుతూ ఊగుతూ ఉంటే, అలలవలె ఉన్న హిమాలయ పర్వతపంక్తులను ప్రదర్శిస్తున్నారా అన్నట్లుంటుంది. మణిపుర నృత్యాలలోని ప్రసన్న రీతిలో ఆకస్మికంగా కనిపించే భంగిమలమార్పు, ఉద్దృత తాండవం-భయంకరమైన తుఫానులను, అవి చెట్టు చేమలను సమూలంగా వెళ్ళగించటాన్ని సూచిస్తాయి. నాగ, గోండ్ జాతుల నృత్యాలలో కంపించే నిరీక్షణ జాగరూకతలు అరణ్యాలలోని జ్ఞాతాజ్ఞాత అపాయలను ద్యోతకం చేస్తాయి.సౌరాష్ట్రంలోని మత్స్య పారిశ్రామికుల నృత్యాలు హోరుమనే సముద్రపు ఘోషను పెల్లుబికే సముద్ర తరంగాలను సూచిస్తాయి. మైదాన ప్రాంతాలలోని నృత్యాలకూ వీటికీ చాలా తేడా ఉంది. వాటిలో ప్రకృతి యొక్క సరళభావాన్ని వ్యక్తం చేసే ప్రశాంతత, ప్రసన్నత వ్యక్తమౌతాయి.

వాతావరణ పరిస్థితుల ననుసరించి, నైసర్గిక పరిస్థితులను అనుసరించి, ఆయా ప్రాంతాల జానపద నృత్యాల స్వభావాలలో మార్పు ఉంటుంది. అయితే, వీటన్నిటిలో సమాన ధర్మాలు కొన్ని కనిపిస్తాయి. సాంఘీక నృత్యాలని చెప్పబడే వాటిలో కూడా ఈ పోలికలు ఉండనే ఉన్నాయి. ఇందుకు కారణమేమిటో చెప్పటం ఏమంత కష్టం కాదు. భారతదేశంలోని జానపద నృత్యాలలో ఎక్కువ భాగం ఆచార క్రతువులు మొదలయిన ఋతువుల ఉత్సవాలవరకుగాని లేక పంట వేడుకలు మొదలయిన వాటివరకు ఉండే భౌతిక వ్యవహారాలలో వివిధ దశలలో ఇవి ఉండవచ్చు. చివరకు యుద్ధ నృత్యాలకు కూడా క్రమవిధులే పునాదిగా ఉన్నాయి. ఒక్కొక్కప్పుడు యుద్ద నృత్యాంలో కొంత భాగం ఒకానొక దేవతను ఆమంత్రణ చేసే విధంగా కూడా ఉంటుంది.

క్రమవిధులు పునాదిగా ఉన్నాయనే సంగతి అంగీకరించిన పిమ్మట, భారతీయ జానపద నృత్యాలను మూడు సామాన్య వర్గాలుగా విభజించవచ్చును.మత సంబంధమైన జానపద నృత్యాలలో, సామాన్యంగా కనిపించే అవకాశాన్ని మించి భావవైవిధ్యం ప్రదర్శితమౌతూ ఉంది. వీటిలో భక్తి నృత్యాలను, లేక పూజా నృత్యాలను ముందు పేర్కొనవచ్చును. ఈ నృత్యాలలో నర్తకులు తమ దేవతలకు ప్రణుతి చేసే భక్తులు మాత్రమే. ఇతర నృత్యాలలో దేవుళ్ళను, దేవతలను గూర్చి - రాజులకు ప్రభులకు చేసినట్లు విన్నపాళ్ళు వేడి కోళ్ళు చేస్తారు. ఈ విన్నపాలు దైవీ సహాయం లేకుండా మానవులు అదుపులో పెట్టలేని భూతప్రేతాల బారినుండి విముక్తి పొందటానికి చెయ్యవచ్చును.ఈ నృత్యాలే కాక ఒకానొక దేవతను స్తుతిస్తూ, పురాణగాథలను అభినయిస్తూ చేసే నృత్యాలు ఉన్నాయి. ఇలాంటి నృత్యాలకు రాథ కృష్ణుల గాథ అనంతమైన్ భావప్రేరణ కల్పిస్తూ ఉంది. రాథాకృష్ణుల అనంత ప్రేమ ప్రేమగాథలోని తీవ్రాకర్షణ వల్ల ఒక్కొక్కప్పుడా కథ స్థానిక రూపాంతరాలు పొందటం తరచు సంభవిస్తూ ఉంటుంది. ఈ అనుకరణలలో మత స్వభావం ఏమీ ఉండదు. సమకాలీన వృత్తాంతాలతో మామూలు ప్రేమగాథగా రూపొందుతాయి. శివుని వివాహ గాథ ఇట్టివాటిలో మరొక ఉదాహరణగా చెప్పవచ్చును. యుద్ద నృత్యాలు, వీర నృత్యాలు, వేట నృత్యాలు ముఖ్యంగా ఆటవిక ప్రజలలో విస్తారంగా వ్యాప్తిలో ఉన్నాయి. ఇందుకు కారణం, ఈ భావాలప్రేరణకు, అందుకు కావలసిన శిక్షణకు ఆస్పదమైన పరిస్థితులు ఈనాటికికూడా ఆటవిక ప్రాంతాలలోనూ దూరపు సరిహద్దు ప్రాంతాలలోనూ ఉండటమే అయితే వెనుకపడని ప్రాంతాలలోనూ, ప్రజాజీవితం సుస్థిరంగా ఉన్న ప్రాంతాలలోనూ కూడా యుద్ద నృత్యాలు జరుగుతూనే ఉన్నాయి కాని, ఇవి పురాణగాథల ప్రదర్శన రూపంగానో లేక ఏదో ఒక వీరగాథను అనువైన నృత్యంలో ప్రదర్శించే రీతిగానో ఉన్నాయి.

మూడవ సామాన్య వర్గం సాంఘీక నృత్యాలు, వీటిలో చాలా రకాలు ఇమిడి ఉన్నాయి. కేవలం జీవితానందాన్ని వ్యక్తం చేసేవి మొదలు, ప్రకృతిలోని అద్భుతాలను వ్యక్తం చేసేవి, చేసిన కష్టం యొక్క ఫలలబ్దిని, కుటుంబ సంఘటనలను, ప్రేమోదంతాలను వ్యక్తపరచే నృత్యాలు, లేదా సుసంఘటితమైన సమాజంగా జీవించటంలో ఉన్న సమైక్యభావాన్ని వ్యక్తపరచే నృత్యాలవరకు వీటిలో ఉన్నాయి. సాంఘీక నృత్యాలలో సైతం తక్కిన నృత్యాలలో వలెనే క్రతుభావం పూర్తిగా విలుప్తం కాదు.ఈ మూడు వర్గాలను కూడా పూర్తిగా వేరుపరచి చెప్పడానికి వీలులేదు. అక్కడక్కడ ఇవి ఒకదానిలో ఒకటి కలిసి పోయి ఉంటాయి. ఈ కారణం చేత వర్గీకరణ కొంతవరకు అసహజంగా కనిపిస్తుంది. ఉదాహరణకు ఆటవిక జాతిలో వేటాడటం నేటికీ సంఘటితమైన సాంఘీక కార్యకలాపంగా ఉంది.అలానే వేటనృత్యం వారి ఉత్తం సాంఘికాభి వ్యక్తీకరణంగా ఉండవచ్చు. ఇక వైవాహిక నృత్యం సంగతి చూస్తే ఈ విధమైన సాముదాయిక వివాహం కఠినమైన క్రతుకాండతో నిండి ఉండటం చేత మతాచారాలలో ఉండే గాభీర్యభావం ఈ నృత్యాలుకూడా సంతరించుకున్నాయి. ఈ కారణంచేత జానపద నృత్యాల వర్గీకరణ కచ్చితంగా నిర్ధేశించటానికి వీలులేదు. మనం ముఖ్యంగా జ్ఞాపకం ఉంచుకోవలసిన సంగతి ఇది-జానపద నృత్యంలో, జానపద జీవితం పరిపూర్ణంగా, సాముదాయకంగా ప్రతిఫలిస్తుంది. సరళత, నాగరిక రీతుల లేమి దాని నైజం; సంకీర్ణంతో నిండి ఉన్నా సుదృఢమైన, సజీవమైన చైతన్యవంతమైన సమరసత దానిలో ఉంది.


హిమాలయ ప్రాంతాలు :

హిమాలయ ఫోక్ డాన్స్ భారతీయ జానపద నృత్యాలను ఆయా ప్రాంతీయ భేధాలను బట్టీ, ఆయా జాతులను బట్టి కూడా విభజించవచ్చును.ఐనప్పటికీ వివిధ ప్రాంతాల నృత్యాలలో ఒకానొక సంప్రదాయ సామరస్యం ద్యోతికమవుతుంది.మరీ ఉత్తరపు ప్రాంతాలనుంచి, దక్షిణపు కొనవరకు, తూర్పుకొన ప్రాంతాలనుంచి పటమటి కొననున్న ప్రాంతాలవరకు మనం పర్యటించి చూస్తే అన్నిచోట్లా జానపద నృత్యాలలో ఒకేరకమైన కథాసంవిధానమూ,రీతులూ కనిపిస్తాయి.ఐతే ఆయా ప్రాంతాల విభిన్న పరిస్థితులను బట్టి ఆయా జానపద నృత్యాలలో భిన్న భిన్న సంప్రదాయాలేర్పడి ఉండటం చేత,రాష్ట్రాల వారీగా కాక,నైసర్గిక ప్రాంతాల వారీగా జానపద నృత్యాలను వర్గీకరణము చేశాము.హిమాలయ పర్వతప్రాంతం, కాశ్మీర్ నుండి హిమాచల్ ప్రదేశ్ వరకు,కుమౌన్ నుండి ఉత్తర నేపాలు వరకు,డార్జిలింగ్ వరకు,అచటి నుండి మణిపూర్,అస్సాం కొండలవరకు వ్యాపించి ఉంది. ఈ హిమాలయ ప్రాంతాలలో వివిధ జాతులకు, గిరిజనులకు సంబంధించిన వివిధ రీతుల జానపద నృత్యాలు మనకు గోచరిస్తాయి. మొత్తం మీద వీటిని ఈ క్రింది వర్గాలుగా విభజించవచ్చును. మణిపూర్, అస్సాం కొండలలో ఈశాన్య సరిహద్దు ప్రాంతాలలోనూ ఉన్న నాగజాతుల నృత్యాలు; మణిపూర్, అస్సాం, డార్జిలింగ్, హిమాచల్ ప్రదేశ్, కుమౌన్ ప్రాంతాల గ్రామసీమలలోని జానపద నృత్యాలు;ముఖ్యంగా మణిపూర్ హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాలలో నాగరికథా ప్రభావం సోకిన సాంఘీక నృత్యాలు.


అస్సాం :

అస్సాం ఫోక్ డాన్స్ అస్సాం, మణిపూర్ ప్రాంతాలు రెండు కూడా మహత్తరమైన జానపద నృత్యాలకూ, సంగీత సంప్రదాయానికి ప్రసిద్ది పొందినవి.అస్సంలోనూ,మణిపూర్లోనూ కూడా నాగరిక ప్రజలలో వైష్ణవ సాంప్రదాయబద్దమైన శ్రీ శంకర దేవబోధనల ప్రభావం ప్రస్పుటంగా కనిపిస్తుంది. వైష్ణవ సంప్రదాయానుసారంగా శ్రీ శంకర్ దేవ్ కామరూప నృత్యం అభ్యసించాడనీ, శాస్త్రీయ నృత్యరీతిని పెంపొందించాడనీ, దానినే నేటివరకూ వైష్ణవాచార్యులు అభ్యసిస్తూ, సంరక్షిస్తూ వస్తున్నారనీ అంటారు.ఈ నృత్యాలనీ భక్తి ప్రధానమైన నృత్యాలు;భగవంతుని యెడల భక్తుల భక్తి తాత్పర్యాన్ని ఉద్దీపింపజేయటానికే ఈ నృత్యాలు చేయబడుతున్నాయి. ఈ నృత్యాలలో చాలామట్టుకు శ్రీకృష్ణుని బాల్య క్రీడలకు, గోపికా నృత్యాలకు సంబంధించినవే. శ్రీకృష్ణుని జీవిత వృత్తాంతాలు ఈ నృత్యాలలో సుందరంగా రూపొందించబడినవి. శ్రీకృష్ణ భగవానునకు, గోపాలురకు సంబంధించిన ఇతి వృత్తాలలో కూడిన భక్తి నృత్యాలే కాక,అస్సాంలో ఋతువులకు సంబధించిన నృత్యాలు కూడా చాలా ఉన్నాయి.వీటిలో కొన్ని పేరుపొంది అస్సాం వెలుపల కూడా అభ్యసించబడుతున్నాయి.వాటిలో ముఖ్యమైనవి ఈ క్రింద ఉదహరించబడుతున్నాయి.


బగురంబ నృత్యం :

బగురంబ నృత్యంలో లావణ్యం పొంగిపొరలుతూ ఉంటుంది. బోడో యువతుల నైట్‌క్లబ్బులలో ఈ నృత్యం విశేషంగా కనిపిస్తుంది. పగలంతా కష్టపడి పని చేసిన తర్వాత,సాయంత్రం వేళల ఈ నృత్యం చేస్తారు. దీనిలో ఇతివృత్తం ప్రేమ.ఉత్సాహ వివశతకూ,మహోల్లాస గతులకు ఈ నృత్యం పేరుపొందింది.నృత్యగతులలో ఎక్కువభాగం ఏక దిశాగతులూ అర్ధచంద్రాకారగతులూ ఉంటాయి.స్థానికంగా తయారయ్యే బోడో సంగీత వాద్యాలగానం ఈ నృత్యాల ఆకర్షణను ద్విగుణీకృతం చేస్తుంది.


మెయ్‌గెనెయ్ నృత్యం :

మెయ్‌గెనెయ్ నృత్యం పంటకోతుల నృత్యం. పంటలు బాగా పండిన తర్వాత బోడో జాతి స్త్రీ,పురుషులు కోతలకు దిగుతారు.అప్పుడు వారు సంఘీభావాన్ని ద్యోతకం చేస్తూ చేసే నృత్యం ఇది.పంట కోతలకు సంబంధించిన వివిధ దశలను ఈ నృత్యంలో ప్రదర్శిస్తారు;పాత్రసామాగ్రులు,త్రవ్వుగోల తదితర పరికరాలు ఈ నృత్యంలో ఉపయోగిస్తారు.నర్తకులు రంగు రంగుల దుస్తులు వేసుకొంటారు.


బిహూ నృత్యం :

జానపద నృత్యాలు అస్సాంలో ఋతువులకు సంబంధించిన నృత్యాలలో బిహు నృత్యం ప్రముఖమైనది. చైత్రమాసం చివరిరోజున ఈ నృత్యం చేస్తారు.అదేరోజున,వైశాఖ అనే పేరుతో కూడా ఈ నృత్యం చేస్తారు.ఏప్రిలు నెల మధ్యకాలంలో,ప్రకృతి బహువర్ణవసనం ధరించి ఉండే సమయంలో బొహాగ్‌బిహు పండుగ వారం రోజులపాటు జరుగుతుంది. ఈ పండుగలో బిహునృత్యం ఒకభాగం. సందర్భానికి తగినట్లుగా ఉత్సాహాతిరేకంతో మైమరచి నృత్యం చెయ్యడమే ఈ నృత్యరీతిలోని ప్రత్యేకత. దీనికి ఉద్దీపనగా శృంగార గీతాలు, భావోద్రేకాన్ని కలిగించే గీతాలు పాడుతారు. ఈ నృత్యంలో స్త్రీ పురుషులు పాల్గొంటారు. దీనిలో ఉపయోగించే వాద్య విశేషాలు ఇవి: ఢోల్,గేదెకొమ్ముతో స్థానికంగా తయారు చేయబడిన పేపా అనే మురళి,వెదురు బొంగుతో తయారుచేసిన టాకా అనబడే వాద్యము.అస్సాం గిరిజనుల నృత్యాలలో ఖాశీజాతి వారి నృత్యం చాలా ప్రధానమైనది. భారతదేశంలోని గిరిజనులందరిలో ఖాశీజాతివారు చాలా అందంగా ఉంటారు. ఖాశీ నృత్యంలోని భంగిమలు - బిర్రబిగిసిన చందంగానూ, కొయ్యబారినట్లు ఉంటాయి.డోల్‌యొక్క తాళగతి తప్పకుండా పాదగతిని ఎంత సమన్వయం చేస్తూ ఎంత చక్కగా నృత్యం చేస్తే అది అంత చక్కని నృత్యంగా ఎంచబడుతుంది. వీరి నృత్యంలో హస్తాభినయం కూడా ఎక్కువగానే ఉంటుంది. జానపద నృత్యాలలో ఇంత ఎక్కువ హస్తాభినయం మరెక్కడా కనిపించదు.

ఈ ఖాశీజాతివారేగాక, లూషై కొండలలోనూ, గారో కొండలలోనూ, బ్రహ్మపుత్ర లోయలోను నివశించే ముఖ్యమైన గిరిజన జాతులు మరికొన్ని ఉన్నాయి. ఈ జాతులలో అనేకరకాల నృత్యాలు ఉన్నాయి. వీటిలో వెదురు నృత్యం,వేట నృత్యం వంటివి మొదలుకొని, నాగనృత్యాలకు అతి సన్నిహితంగా కనిపించే యుద్ద నృత్యాల వంటివి కూడా ఉన్నాయి. ఈ గిరిజనుల నృత్యాలలో సరళమైన వాటిలో లూషై వెదురు నృత్యం ఒకటి అని నిస్సందేహంగా చెప్పవచ్చు.ఈ నృత్యంలో స్త్రీలు, పురుషులుకూడా పాల్గొంటారు. లూషై జాతులు, మెజొ నాగజాతులు కూడా ఈ నృత్యం చేస్తారు. చదరంగా నేల మీద వెదురుబొంగులు ఉంచుతారు; రంగు రంగుల దుస్తులు వేసుకున్న కొందరు యువతులు పాటలు పాడుతూ, వాద్య గానానికి అనుగుణంగా, ఆ చదరాలను దాటుతారు. కొందరు నర్తకులు వెదురుబొంగులను చేతులతో పట్టుకొని ఒక దాని మీద ఒకటి కొట్తూ తాళ యుక్తమైన శబ్దాలను సృష్టిస్తారు.


ఖౌల్ల నృత్యం :

ఇది అస్సాంలోని మిజో జాతి వారు చేసే గిరిజననృత్యం.ఈ నృత్యం అతిథుల నృత్యం; ఎందుచేతనంటే - గృహస్థుల ఇండ్లకు వెళ్లేటప్పుడు అతిథులు ఈ నృత్యం చేస్తారు. పండుగ పబ్బాల సందర్భంలో అతిథులను ఆహ్వానించే గృహస్థు చేసే క్రతువులలో ఈ నృత్యం ఒక భాగంగా ఉంటుంది.ఇది బృందనృత్యం;స్త్రీలూ పురుషులూ కలిసి పాల్గొంటారు.మెల్లగా అడుగులు వేస్తూ సరళగతులతో నృత్యం ఆరంభమౌతుంది.కొంతసేపైన తర్వాత నర్తకులు వర్గాలుగా ఏర్పడుతారు;స్త్రీలూ,పురుషులూ తమతమ స్థానాలు మార్పిడి చేసుకుంటూ ఏక దశాగతులలోను అర్థచంద్రాకార గతులలోను సరళగతులతో నృత్యం చేస్తారు.


నాగ నృత్యాలు :

నాగ నృత్యాలు భారతదేశంలోని అత్యంత దర్శనీయమూ, వీర్యవంతమూనైన కొన్ని నృత్యాలు నాగజాతి ప్రజలలో ఉన్నాయి. అస్సాం, ఉత్తరబర్మా సరిహద్దు ప్రాంతంలో నాగజాతి ప్రజలు నివసిస్తునారు. నాగ ప్రజలలో అనేక జాతులున్నాయి. ప్రతి జాతికి విలక్షణమైన నృత్యాలున్నాయి. వీటిలో ఎక్కువ ప్రసిద్దిపొందిన నృత్యాలు నాగుల యుద్ద నృత్యాలు. ఈ నృత్యాలు అస్సాంలోనూ, మణిపూరులోనూ,వాటి పూర్వ రూపం ఏమాత్రం చెడకుండా సమ్రక్షించబడ్డాయి. నాగ నర్తకులు ముఖాలకు యుద్దవర్ణం పూసుకొని, తలపై కొమ్ములు,పిట్టల ఈకలు పెట్టుకొని, పూసలు, రాళ్ళు, కొమ్ములతో చేసిన సొమ్ములు, ఒక్కొక్కప్పుడు ఎముకలతో చేసిన ఆభరణాలు ధరించి నృత్యం చేస్తారు. అన్ని నాగజాతులవారూ శూలనృత్యం చేస్తారు. పొడవాటి శూలాలను నెత్తిమీద ఝుళిపిస్తూ, శత్రువులపైకి విసరివేస్తున్నట్లు నటిస్తూ, మహావేగంతో తన కాళ్ళమీదనే పొడుచుకుంటూ, తన ఆయుధం వ్రేటునుంచి తానే చమత్కారంగా తప్పుకుంటూ నృత్యం చేస్తారు. నుజ్మీనాగులు మృగాల గతులను అభినయించే కొనీ రకాల ప్రత్యేక నృత్యాలు చేస్తారు. వీరి నృత్యాలలో లీనృత్యం, ఇబెరితపక్షి నృత్యం ప్రత్యేకంగా పేర్కొనదగినవి. ఇబెరితపక్షి చాలా అరుదుగా కనిపిస్తుంది. నాగవీరులకు ఈ పక్షి ఈకలంటే చాలా ప్రీతి. కబూయ్ నాగజాతి స్త్రీలు ఒకరకమైన నృత్యం చేస్తారు. ఇది విలక్షణమైన అవయవ సంచలన రీతులతో నిండి ఉంటుంది. ఈ నృత్యం, క్రిందకూర్చుని చేతులను యంత్రాలవలె త్రిప్పుతూ, క్షేత్రగణిత రేఖలను బోలీనరీతుల ప్రదర్శిస్తూ ఆరంభిస్తారు. తర్వాత లేచి, ఒక కాలితో ముందడుగువేస్తూ రెండవకాలి పాదంతో ఆవలి పిరుదు క్రింది భాగాన్ని చరుస్తూ చప్పుడు పుట్టిస్తారు.

జెమీ జాతివారు ఉత్తర కచార్ కొండలలో నివసిస్తున్నారు. వీరుకూడా నాగజాతివారుగానే పరిగణించబడుతున్నప్పటికీని, కొండ ప్రాంతాలలో ఉండే నాగజాతివారికీ వీరికీ చాలా తేడా ఉంది. ఈ జాతివారు ముఖ్యంగా వేటాడే జాతివారైనప్పటికీ వీరి ప్రధానవృత్తి వ్యవసాయం;వీరు అనేక రకాల జానపద నృత్యాలకు ఆటపట్టుగా ఉన్నారు. ఈ నృత్యాలలో ఎక్కువ ప్రశస్తి పొందినవి ఖంబాలిం,న్రూయ్ రాలిం నృత్యాలు. పంటకోతలకాలం ఆరంభంలో స్త్రీపురుషులు వేర్వేరు బృందాలుగా ఏర్పడి ఖంబాలిం నృత్యం చేస్తారు. స్త్రీలు ఒక వరుసలోనూ పురుషులు ఒక వరుసలోను నిలుస్తారు. నృత్యం చేస్తూ తమతమ స్థానాలు మారుస్తూ ఉంటారు. కాని,రెండు వరసలూ చెదిరిపోకుండా ఉంటాయి. అస్సాంలోని నాగనృత్యాలన్నింటిలో అత్యంత ప్రసిద్ది పొందింది సెమనాగ నృత్యం. పెద్ద మంట చుట్టూ నర్తకులు యుద్ద నినాదాలు చేస్తూ వీరనృత్యం చేస్తారు. ఈ నినాదాల వల్ల నృత్యంలో భయానక వాతావరణం ఏర్పడుతుంది. ఈ వీరనర్తకులు ధరించే వేషం వారు చేసిన వీరసాహస కృత్యాలకు చిహ్నంగా ఉంటుంది.ఉదాహరణకు:తలమీద పెట్టుకునే ఈకలు,ఆ యుద్దవీరుడు అనేక శత్రువుల తలలు నరికినట్లు సూచిస్తాయి.నాగనృత్యాలన్నింటిలో పాదగతులకు ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది.వందలకొలది నర్తకులు అడుగు తప్పకుండా నృత్యం చేస్తున్న దృశ్యం చూస్తే ఎంతో ఉద్రేకం కలుగుతుంది.ఈ ప్రాంతపు నాగనృత్యాలలోని వేగం చూచి నమ్మవలసిందే గాని చెప్తే నమ్మకం కలుగదు.అయితే,నాగనృత్యాలు కేవలం యుద్దనృత్యాలకే పరిమితమైలేవు.తమ పూర్వికుల పూజకు సంబంధించిన ఇతి వృత్తాలు గల కొన్ని నృత్యాలుకూడా ఉన్నాయి.ఇలాంటి నృత్యాలలో ఒకటి అస్సాంలోని నాగకొండల జిల్లాలలో ఉన్న మొకుక్ చంగ్ ప్రాంతంలో ఉండే ఓసింగటంజాతులు చేస్తారు.తమ దైనందిన జీవితాన్ని ఉత్సాహపూరితం చెయ్యటానికి గిరిజనులు వేసే గంతులవంటివి కూడా ఈ నృత్యాలలో కొన్ని ఉంటాయి.

వీరు చేసే నృత్యాలలో ఒక నృత్యం మూడు భాగాలుగా ఉంటుంది.మొదటి భాగంలో యువకులు మెరిసే ఈకలను ధరించి,తళతళలాడే శూలాలనూ పట్టుకొని గ్రామం చుట్టూ నృత్యం చేస్తారు.రెండవ భాగంలో యుద్దపు విదులో మిగిలిపోయిన భోజనపదార్థాల చుట్టూ కాకులలాగా అభినయిస్తూ అటు ఇటు గంతులు వేస్తారు.చివరి భాగంలో చేసే నృత్యంలో వాళ్ళ పెంపుడు జంతువులు కూడా పాల్గొంటాయి.నృత్య రంగం మీద నర్తకులు కాళ్ళతో మట్టూతూ,మదించిన ఎనుబోతుల్లాగా డీకొంటారు.


మణిపూర్ :

మణిపూర్ ఫోక్ డాన్స్ అస్సాంలోవలేనే మణిపుర్‌లో కూడా అనేక రకాల గిరిజన నృత్యాలూ జానపద నృత్యాలూ ఉన్నాయి. భక్తి నృత్యాలలోనూ మతసంబంధమైన నృత్యాలలోనూ రాసనృత్యం, లాయ్‌హెరోబ, తబల్ చోంగ్‌బీ నృత్యాలు పేరుగన్నవి. నాగజాతి నృత్యాలలోనూ గిరిజన నృత్యాలలోనూ మోనాగాజాతి నృత్యాలు, కబుయ్ నాగాజాతి నృత్యాలు ప్రసిద్ధి పొందినవి. మణిపూరు జానపదనృత్యాలలోకెల్ల లాయ్‌హరోబి నృత్యం విస్తృత నృత్యమే కాకుండా అతి ప్రాచీనమైనదీ, చాలా నాజూకైనదీ కూడాను. ఈ నృత్యాలలో పురాణేతి హాస గాథలు ఇతివృత్తాలుగా ఉంటాయి. మణివూరు ప్రజా జీవితంలో పురాణేతిహాసాలు కలిసిపోయి ఉన్నాయి. శివపార్వతుల ఈ లీలను ప్రదర్శించేదే లైహరౌబా నృత్యం. ఇప్పుడది ప్రదర్శింపబడే రూపం గ్రామ దేవతలకు అంకితం చేయబడి ఉంది. ఈ నృత్య ప్రదర్శనంలో మైబాస్ (పురోహితుడు), మైబీస్ (పురోహితురాలు) ప్రముఖపాత్ర నిర్వహిస్తారు. ఈ నృత్యం కొంతభాగం క్రతువ్ధులతో నిండి ఉంటుంది; కొంత వినోదకరంగా ఉంటుంది. రాసలీలా నృత్యం ఎక్కువగా లాయ్‌హరోబా నృత్యాన్ని పోలి ఉంటుంది. రాసలీలా నృత్యంలోని ఇతి వృత్తం రాధాకృష్ణుల ప్రేమగాథ. మణిపూర్ రాసలీలా నృత్యాలు ఒక ప్రత్యేక వర్గమని చెప్పవచ్చును. వీటిని జానపద నృత్యాలుగానో శాస్త్రీయ నృత్యాలుగానో కూడా నిర్ధానరణ చెయ్యవచ్చును. భారతదేశంలోను ఇతర శాస్త్రీయ నృత్యరీతులన్నీ వీటీలో ఉన్నాయి. నేడు మణిపూర్‌లో వ్యాప్తిలో ఉన్న రాస నృత్యాలు చాలా ప్రాచీనమైనవి కావనీ, ఇవి నిజానికి మహారాజా జయసింగ్ చేత సృష్టించ బడినవనీ అంటారు.

మణిపూరి నృత్యంలో ప్రధానమైనవి పూర్ణచక్ర గతూలూ, అర్థచక్ర గతులున్నూ, కురుంబ, లేక వందన నృత్యంలో చేతిమణికట్టులు రెండూ జోడించి, రెండు పర్యాయాలు త్రిప్పుతారు. నృత్యంలోని ప్రతిదశ ఈ రీతితో అంతమవుతూ ఉంటుంది. చరఖా లేక వడకుట అనేది మరొక హస్త విన్యాసం; దీనిలో చేతివ్రేళ్ళను విప్పి, శరీరం వైపు మెలికలు త్రిప్పుతారు. మణిపూరీ నృత్యంలోని హస్త విన్యాసాలలో లాస్యభావం ప్రధానపాత్ర వహించటం గమనార్హం. అయితే, తాండవం లేక ఉద్ధృఅత నృత్యం పర్గ్ భోలంవంటి నృత్యాలలో పాదచలనం ద్వారా ప్రదర్శించబడుతునంది. ఋతువులకు సంబంధించిన మణిపూఉ నృత్యాలలో థాబల్‌చోంబీ నృత్యం ఎక్కువ ఉల్లాసకరమైన సాంఘిక నృత్యాలలో ఒకటి. ఈ నృత్యం హొలిపండుగ రోజులలో చేస్తారు. ఈ మాటకు వెన్నేలలో గంతులు వెయ్యటం అని అర్ధం. థాబల్ చోంబీనృత్యంలో కులము, హొదాలతో నిమిత్తం లేకుండా అందరూ పాల్గొనవచ్చును. రాస నృత్యాలలో పాల్గొనటానికిగానీ నృత్యం సందర్శించటానికిగానీ వైష్ణువులకు తప్ప ఇతరులకు వీలులేదు. థాబల్ చోంబీ నృత్యంలో అలాకాదు. ఈ నృత్యం జరిగేటప్పుడు కుల మత బేదాలు ఉండవు; ఆరోజు తక్కువ వాళ్ళూ, ఎక్కువ వాళ్ళూ యువతీయువకులు, వృద్థులూ అందరూ కలవవచ్చు.మణిపూరు బాలబాలికలకు, థబల్‌చోంబీ నృత్యం సందర్భంలో అంతులేని స్వేచ్చ ఇస్తారు. వాళ్ళూ తమ ఇష్టంవచ్చినంతసేపు బైట తిరగవచ్చు.


ఈశాన్య సరిహద్దు ప్రాంతము :

ఈ ప్రాంతమునందలి అడవినాగులు ప్రాచీనకాలపు వీరజాతులకు చెందినవారు; ఆ ప్రాంతపు స్థానిక సంస్కృతిని నేటికినీ భద్రపరచి ఉంచారు.


యాక్ నృత్యం :

ఈ ప్రాంతపు ప్రజల జవసత్త్వాలకు అనురూపంగా ఉండే నృత్యం యాక్ నృత్యం. ఒక ప్రాచీనగాథ దీనికి బీజం. ఒక మనిషి తండ్రిచేత ఇంటినుండి వెళ్ళగొట్టబడటం, చిట్ట చివరకు ఒక జడలబర్రె (యాక్) అతని కెదురుపడటం వంటి అసాధారణ అనుభవాలను ఈ నృత్యం ప్రదర్శిస్తుంది.


దుప్పి నృత్యం :

దుప్పులు, గొర్రెలు, పశులవంటి జంతువులయెడ దయాళుత్వము, వాటిని వధింపరాదనే ప్రాచీనాచారమూ, ఈ వేట నృత్యానికి ప్రధాన కథా వస్తువుగా రూపొందినవి. వేట అంటే మక్కువ గల ఒక ముసలి గొర్రెలకాపరి, అతని ఇద్దరు కుమారులూ, ఒక దుప్పిని వలపన్ని పట్టి ఇంటికి తీసుకురావటం ఈ నృత్యంలోని ప్రధాన కథావస్తువు. ఆ దుప్పిని వారు చంపబోతూ ఉండగా, గ్రమస్థులు కరుణాప్రేరితులై అక్కడకు చేరుతారు; దానిని చంపవద్దనీ, వదలిపెట్ట వలసిందనీ వారిని అర్థిస్తారు.


డార్జిలింగ్ :

హిమాలయ ప్రాంతాలయిన డార్జిలింగ్, భూటాన్ సిక్కింలలో బహువిధమైన జానపద నృత్యాలు కంపిస్తాయి. వీనిపై బౌద్ధలామాల సంప్రదాయ ప్రభావం విశేషంగా ఉంది. అందుచేత, ఈ ప్రాంతంలో ఆచారకర్మలకు సంబంధించిన కృత్రిమ ముఖాల నృత్యాలుగానీ లేక రాజులను గురించిన పాటలతో కూడిన పిరికితనపు తరహా నృత్యాలు గానీ చాలా రకాలు కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో బాగా పేరుపొందిన నృత్యాలలో లేపాచ్‌నృత్యం ఒకటి. దీనిలో స్త్రీ పురుషు లుభయులూ పాల్గొంటారు. ఈ నృత్యం నిదానపు కదలికతో ఆరంభమై పోను చలనరీతి మరింత ద్రుఢతర మవుతుంది.


హిమాచల్ ప్రదేశ్ :

హిమాచల్ ప్రదేశ్ ఫోక్ డాన్స్ ఉత్తర ప్రాంతాలయిన హిమాచల్ ప్రదేశ్, కుమౌన్ కొండల ప్రాంతలకు చేరేసరికి, కొండజాతుల స్వరూప స్వభావాలలోనూ, జానపద నృత్యాలలోనూ కూడా చాలా మార్పు కనిపిస్తుంది. ఈ ప్రాంతాలలో మనకు వేరు రకమైన నృత్యాలు కంపిస్తాయి. ఒకవైపు మణిపూరు, అస్సాం ప్రాంతాలకూ; మరొకవంక హిమాచల్ ప్రదేశ్, కుమౌన్ ప్రాంతలకు మధ్యనున్న శీతోష్ణపరిస్థితుల తారతమ్యాల ప్రత్యక్షఫలిత మీమార్పు. స్థూలంగా చూచినప్పుడు ఈ ప్రాంతాలలో కూడా నృత్యాలను గిరిజన నృత్యాలు, గ్రామీణ సాంఘిక నృత్యాలు అని విభజించవచ్చును. రెండవ రకంలో మరల, మతప్రభావం స్పష్టంగా గోచరిస్తుంది. మణిపూరు, అస్సాం నృత్యాలకు శ్రీకృష్ణ. శివ గాథలు ఇతివృత్తాలుగా ఉన్నట్లే, ఈ ప్రాంతపు నృత్యాలకు రామకథలుగాని, లేక ఒక్కొక్కప్పుడు శ్రీకృష్ణగాథలుగాని ఇతివృత్తంగా ఉంటాయి. దసరాఉత్సవాల సందర్భంలో బృందనృత్యం, హిమాచల్ ప్రదేశ్ అంతటా చాలా వ్యాప్తిలో ఉంది. ఈ ఋతువులో స్త్రీలు, పురుషులు, 10 రోజులు మొదలు 12 రోజుల వరకు కొనసాగే నృత్య పరంపరలో పాల్గొంటారు. 'రామ లీల ' పూర్తిగా ప్రదర్శిస్తూ, రోజు తర్వాత రోజు నృత్య పరంపర ప్రదర్శలు జరుపుతారు. దీపావళి ఉత్తవంలో, 'బురా' అనబడే నృత్యం చేస్తారు. దీనిలో స్త్రీపురుష లుభయులు పాల్గొంటారు. దీపావళీ ఉత్సవభావం ఈ న్ర్త్యంలోని ఆనందానికీ అందానికీ ప్రేరేపణ కల్గిస్తుంది. పురుషులు, స్త్రీలు, ఒకరిచేతులొకరు పట్టుకోకుండానే తమ తమ స్థానాలలో నిలువబడి, కుడివైపు నుండి ఎడమవైపుకు వలయగమనాన్ని అభివర్ణిస్తారు. ఇది అరంభంనుంచే వేగంగా సాగుతుంది. నర్తకుల కుడివైపున నిలువబడి ఉండే వాద్యగాండ్రు, ఆ తరువాత, నర్తక బృందంతో కలిసి వర్తులాకారంగా ఏర్పడతారు. ఈ నృత్యరీతిలోని ప్రత్యేకత, త్వరిత గతిని వేగాన్ని సంతరించుకోవటమే.


రాసనృత్యం :

పేరు తెలియపరుస్తున్న విధంగా, రాస నృత్యంలోని ప్రధానరసం శృంగారం; పాటకు అనురూపంగా నృత్యం సాగుతుంది. రాస నృత్యం ప్రత్యేకంగా, 'బిసుసంతా కాలంలోనూ, 'మాఘ్‌సంక్రాంతీ (ఫిబ్రవరి - మార్చి నెలమధ్య వస్తుంది) కాలంలోనూ చేస్తారు. ఒక్కొక్కప్పుడు, పాట, ఒకానొక చారిత్రక సంఘటనను వర్ణించటం కూడా కద్దు. ఈ రీతిగా, పురుషులు, స్త్రీలు, రంగురంగుల దుస్తులు ధరించి, ఒకరిచేయి ఒకరు పట్టుకొని మధ్యనున్న వాద్యగాళ్ళ చుట్టూ నృత్యం చేస్తారు. దంపతులు, ఒకరి తర్వాత ఒకరు, ఆనందంతో, వర్తులాకారంగా నృత్యం చేస్తారు.


ఉత్తరప్రదేష్ :

బరాదినటి నృత్యం :

యు పి ఫోక్ డాన్స్ ఉత్తరప్రదేశంలోని డెహ్రాడూన్ జిల్లాలో, జౌన్సార్ - బవర్ ప్రాంతంలో విశేష ప్రచారంలో ఉన్న నృత్యాలలో బరాదినటి నృత్యం ఒకటి. మతసంబంధమైన, సాంఘిక సంబంధమైన ఉత్సవాలలో ఈనృత్యం ప్రదర్శించబడుతుంది. ఈ నృత్యంలో పాల్గొనే యువతీ యువకులు నయనానండకరంగా వేషాలు ధరించి, రెండు అథచంద్రాకారాలుగా ఏర్పడి గిర్రు గిర్రున తిరుగుతారు. నృత్యానికి వంతగా, సంవాద రూపంలో స్థానిక ప్రేమగాథలను గానం చేస్తారు. నృత్యం సాగుతూఉండగా, బాలికలు, పళ్ళేలను వ్రేళ్ళమీద త్రిప్పుతారు; లేదా, ఒక్కొక్కప్పుడు నీళ్ళు నింపిన బిందెలను తలక్రిందులుగా నెత్తిమీద పెట్టుకొంటారు. వాటిని ఎంత నేర్పుగా నిలుపుతారంటే - వాటినుండి ఒక్క చుక్క నీరుకూడా క్రిందికి జారదు. తమ ప్రేమికులను అ బరచుకోవటానికి బాలికలు తమ తమ ప్రజ్ఞా విశేషాలను ప్రదర్శించటమే ఈ నృత్యంలోని ఇతి వృత్యం. జోహ్రా అనేది మరొక కుమౌన్ నృత్యం. దీనిలో పురుషులు, స్త్రీలు, ఉభయులూ, అతిథులుకూడా పాల్గొంటారు. చేతులు చేతులు పట్టుకొని వలయాకారంగా, నిదానంగా, సామాన్యమైన అడుగులు వేస్తూ వాళ్ళు నృత్యం చేస్తారు. చాలామంది వర్తకులు కలిసి జోహ్రాత్యం చేస్తారు. ఈ ప్రజాసమూహం అప్పుడప్పుడు నిలువబడుతూ, వంగుతూ, కూర్చూంటూ, కదులుతూ ఉంటే, ఈ నృత్యాలకు పూర్వ క్షేత్రంగా ఉన్న అపార హిమాలయశ్రేణులు, తిరిగి సృష్టింపబడుతూ ఉన్నట్లనిపిస్తుంది. గాల్వార్, ఆల్మోరా కొండలు - ఈ రెండు - నృత్య సంపదలో ఒకదానికొకటి తీసిపోవు. భోటియాలు రంగ్‌భంగ్ నృత్యం చేస్తారు. వీరు ఉత్తరప్రదేశ్‌లోని కొండలజిల్లాలయిన గార్వాల్‌లోనూ ఆల్మోరాలోనూ నివసిస్తూన్నారు. వాళ్ళ మామూలు క్రతువులన్నీ 'రాంబర్ ' అని పిలువబడే గ్రామచావడిదగ్గర జరుగుతాయి. వాళ్ళక్కడ సమావిష్ణులైనప్పుడు - పాడతారు, ఆడతారు; త్రాగుతారు. ఈ మనోహరమైన నృత్యాన్నీ గార్వాల్ జిల్లాలో భోటియా నృత్యం అని పిలుస్తారు.

ఉత్తరప్రదేశంలోని హిమాలయ ప్రాంతపు నృత్యాలయ గూర్చీ ప్రత్యేకంగా కుమౌన్ ప్రాంతపు నృత్యాలను గురించి మనం ముందే చెప్పుకొని ఉన్నాము. ఉత్తరప్రదేశ సాంఘిక కులాల జానపద నృత్యాలకున్నూ, అందులో ప్రత్యేకంగా లక్నో, కాశి, కాంపూరు మొదలైన చోట్ల నివసించే కులాల జానపద నృత్యాలకున్నూ కుమౌన్, హిమాలయ ప్రాంతపు గ్రామాలలోని నృత్యాలకున్నూ చాలా తేడా ఉంది. మైదాన ప్రాంతంలో, నృత్యం ప్రత్యేకంగా, మరీ శాస్త్రీయ రీతిని సంతరించుకొని, కథక్ అనబడే శాస్త్రీయ నృత్యానికి దారి తీసింది. ఈ రాష్ర్టాలలోని మహా రాజుల, నవాబుల దర్బారులలో కథక్ నృత్యం వర్థిల్లుతూ వచ్చింది. ఇదే కాలంలో, గ్రామీణ ప్రజలలోనూ పేద ప్రజలలోనూ, ఆదిమ నృత్యగుణాలు కొన్ని సంతరించుకొన్న నృత్య, నాట్య రూపాలు కొనసాగుతూ వచ్చినవి. అయితే వీనిలో కూడా కథక్ శాస్తీయ రీతులు కొన్ని ఉండనే ఉన్నాయి.

మధుర, బృందావనాలు కేంద్రాలుగాగల పురాతన వ్రజభూమిలో కృష్ణ-రాధ-గోపికా భక్తి మతం వ్యాప్తిలో ఉంది. ఇది భారతదేశ మంతటా అనేక జానపద గేయాల ద్వారానూ, నృత్యాలద్వారానూ ప్రదర్శించబడుతుంది. సహజంగానే ఈ ప్రాంతంలో అత్యంత వ్రజాదరణీయమైన నృత్యాలు రాసలీల పరంపరాని చెప్పవచ్చును. ఇవి, కృష్ణుని బాల్యాన్ని, ప్రౌఢ జీవితాన్ని, గోపికలతో ఆయన నెరపిన వినోద చేష్టలను, రాధపై గాఢ ప్రేమను ప్రదర్శిస్తాయి. వీనిలో గతులు సంకీర్ణంగా ఉండి, అభినయం కళామయం గానూ, సంగీతం ఆహ్లాదపూర్ణంగానూ ఉంటాయి. పాదగతులు ఎక్కువగా కథక్ రీతిని పోలిఉన్నా, శాస్తీయ బాణీలు తక్కువ.


పంజాబ్ :

పంజాబ్ ఫోక్ డాన్స్ హిమాచల్ ప్రదేశ్ కుమౌన్‌లతో పాటు హిమాలయపు కొండలను పంజాబ్ పంచుకొన్నది. హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో ఉన్నవని చెప్పబడిన కొన్ని నృత్యాలు పంజాబు కొండల ప్రాంతంలోకూడా ఉన్నాయి. కుమౌన్ ప్రాంతపు నృత్యాలలోనూ, హిమాచల్ ప్రదేశ్ నృత్యాలలోనూ కంపించే అద్భుత ప్రవాహగుణమే పంజాబ్ బృంద నృత్యాలలోకూడా మనకు కంపిస్తుంది. పంజాబు జానపద నృత్యాలలో అత్యంత ప్రజాదరణపొందిన నృత్యం భాంగ్రానృత్యం, స్వయంసిద్ధమైన ఉల్లాస స్వభావం గల ఈ నృత్యం అన్ని పండుగల సందార్భాలలోనూ ప్రీతి ప్రాత్రంగా ఉంటున్నది. భాంగ్రానృత్యం సరళమైన సమాజ నృత్యం. ఈనృత్యంలో ఎవరైనా ఏ సమయంలోనైనాపాల్గొన వచ్చును. గోధుమ విత్తనాలు చల్లడంతో భంగ్రానృత్య ఋతువు ఆరంభమవుతుంది. అప్పుడు భాంగ్రా భేరి మ్రోగగానే, పూర్ణ చంద్రుని వెన్నెలలో ఏదో ఒక విశాలమైదానంలో గ్రామంలోని యువకులు చేరుతారు. వర్తకులు వలయాకారంగా నృత్యం చేస్తుంటారు. అయితే నృత్యం జరుగుతున్నపుడు ఎంతమందిబడితే అంతమంది నృత్యానికి అడ్డురాకుండా చేరటానికి వీలుగా ఆ నలౌఅం వలయం ఏర్పడుతుంది. డోలు వాద్యగాడు, డోలు మెడకు తగిలించుకొని అప్పుడప్పుడు గమనవేగాన్ని పెంచవలసింగా నర్తకులకు సంజ్ఞచేస్తూ వలయం మధ్య నిలిచిఉంటాడు. డోలు వాద్యగాని వెనుక ఇద్దరు లేక ముగ్గురు వ్యక్తులు నిలిచి నృత్యాన్ని నడుపుతూ ఉంటారు; వీరు నృత్యం వృత్తిగాగలవారు కారు. సమాజంలోని సామాన్య సభ్యులలోనివారే. అయితే ఇతర సభ్యులకంటే సులభంగా అభినయం చేయగలరు. భాంగ్రాలో శాస్త్ర నిబంధనలేవీ లేవు. నృత్యం మామూలుగా సాగిపోతూ ఉంటుంది. నర్తకులు అడుగులు వేస్తూ చేతులు చరుస్తూ, కర్రలు ఆడిస్తూ, నృత్యంలోని ఆనంద పారవశ్యాన్ని ఉద్వేజితం చేయటానికి 'హొయ్,హొయ్; అప్అప్' అని అరుస్తూ గిర్రున తిరుగుతూ ఉంటారు.

నృత్యం మధ్యమధ్య ఆపి ధోల్లా లేక బోలీ (పంజాబు సంప్రదాయ జానపదగేయం) పాడుతారు. అటు తరువాత మరల నృత్య మారంభిస్తారు. నృత్యం చేయటానికి నర్తకులు సొగసైన దుస్తులు వేసుకొంటారు. నిండురంగుగల పట్టుపట్కా (శిరోవేష్టనము) లచ్‌చా 9అనురూప వర్ణంగల కటివస్త్రం లేక చుట్టుగుడ్డ), పొడవాటి తెల్లని పంజాబీ కుర్తా, తళతళ మెరిసే తెల్లని గుండీలు పొదిగిన నల్లటి చంకకోటు, ఈ వేషాన్ని పరిపూర్తి చేస్తాయి. వీనికితోడు చీలమండలమీద ఘంఘ్రాలు ధరిస్తారు. గోధుమ విత్తటంతో ప్రారంభమయ్యే భాంగ్రా ఋతువులో, ప్రతి పౌర్ణమి రోజున గ్రామంలోని యువకులు ఏదో ఒక ఖాళీ పొలంలో చేరి డోళ్ళు మ్రొగుతుండగా, అలసేవరకూ నృత్యం చేస్తూ పాటలు పాడుతారు. బైశాఖ- కోతపండుగతో భాంగ్రా ఋతువు అంతమవుతుంది; అప్పటికి, పసిడి గోధుమ పైరు కోయటం, గాదులు నిండటం జరుగుతుంది. యధార్ధానికి భాంగ్రాను పంజాబు పురుషులు చేసే జాతీయ సామాజిక నృత్య మని పిలువవచ్చును. పంజాబీ స్త్రీలు చేసే గిద్ధ నృత్యంకూడా ఇటువంటిదే. ఇది పాత కాలపు వలయనృత్యం. దీనిలోని సరళ సుందరగతులు అంత నేత్రపర్వంగా ఉంటాయి. ఒక గీతంలోని ఈ దిగువ చరణాలు స్త్రీల జీవితాలలో దీని ప్రాముఖ్యాన్ని సూచిస్తున్నాయి.


కాశ్మీర్ :

కాశ్మీర్ ఫోక్ డాన్స్ కాశ్మీరు లోయలోని ప్రజలు హిమాలయ దైవముల అంకంలో ఉన్నారు; భారతదేశంలోని ఇతర ప్రజాసంఘమేది కూడా ఇలా లేదు. వారి జీవితచక్రంలో 'ప్రకృతి ' కలిసిపోయి వుంది. హిమమయమైన కాశ్మీరు శీతాకాలము, అందమైన ఈ లోయలోని ప్రజలను, నెలల పర్యంతము, ఏ చీకటికోణంలోనో, కిక్కిరిసి కలిసి ఉండేటట్లు చేస్తుంది. వాళ్ళకు అత్యంత ప్రీతి పాత్రమైన నృత్యాలలో కజ్రీ ఒకటి - ఈ నృత్యాన్ని స్త్రీలు మాత్రమే చేస్తారు. అందరు గుంపుకూడుతారు; పాట పాడుతూ ఒకరిచేతులొకరు పట్టుకొని, ఒకరిచేతులొకరు చరుస్తారు; తర్వాత ఇద్దరిద్దరు కలిసి గిర్రున తిరుగుతారు; పాట పల్లవి నర్తకులతోపాటు చుట్టు నిలిచి ఉన్నవారు కూడా పాడుతారు. అప్పుడప్పుడు, రెండు వరుసలు ఏర్పడి, ఈ వరుసలగుండా స్త్రీలు జంటలుగా దూరివచ్చి; ఒకరితో ఒకరు నృత్యం చేస్తారు.


పశ్చిమ ప్రాంతము

గుజరాత్ దాండియ డాన్స్ భారతదేశపు పడమటి కోస్తాలోఉన్న ఈ ప్రాంతపు జానపద నృత్యాలు, దేశంలోని జానపద నృత్యాలలోకెల్ల సుసంపన్నమైనవీ, కష్టసాధ్యమైనవిన్నీ తూర్పురాష్ట్రాలయిన బెంగాల్, ఒరిస్సా, బీహార్‌ల నుండి పడమటి రాష్ట్రాలయిన సౌరాష్ట్ర, గుజరాత్, కధియవార్, మహారాష్ట్రాలకు వచ్చేటప్పటికి, సాంఘిక నృత్యాల జానపదనృత్యాల రూపం చాల వరకు మారిపోయినట్లు, మణిపూర్, సంతాలీల సుందర మంద నృత్యాలకు వీటికీ పోలికేలేనట్లు మనకు తోస్తుంది. మణిపూరు, బెంగాలులోని మధుర ప్రకృతిగాక, ఇచట సముద్రమూ సముద్రతీరమూ ఉండటం చేత కాబోలు ఇచటి నృత్యాలు వీర్యసంభరితంగానూ, పొంకంగానూ ఉంటాయి. ఇవి కొంతమట్టుకు రాజస్థాన్, మధ్యప్రదేశ్ నృత్యాలను పోలివుంటాయని చెపవచ్చు. సౌరాష్ట్ర నృత్యాలలో ఎడారి ప్రభావం స్పష్టంగా ద్యోతక మవుతుంది. సౌరాష్ట్ర మహారాష్ట్ర, గుజరాత్ నృత్యాలు మూడిటిలోనూ రాసనృత్యం ఉంటుంది. ఈ ప్రాంతాలలోని రాసనృత్యాల వైవిధ్య సంపదకు భారత దేశంలోని ఇతర ప్రాంతాలేవి ఈడురావు.

కృష్ణభగవానుని జీవితగాధలే రాసనృత్యాలకు మూలమని చెప్పవచ్చు. బృదావన సంప్రదాయపు పవిత్రరీతి, రాసనృత్యములోని విలోలగతుల సునిసిత రీతులలో ప్రతిధ్వనిస్తున్నది. వసంతపంచమి, వసంతావాహనము, నవరాత్రాలు, శక్తి పండుగ, శారద పూర్ణిమవంటి ఇంకా అనేక ఇతర పర్వదినాలలో రాసనృత్యం చేస్తారు. ఐతే, సౌరాష్ట్ర రాస నృత్యాలకున్నూ, మణిపూర్‌లో రాస నృత్యాలకున్నూ, చల తేడాఉంది. మణీపూర్ రాసనృత్యాలలో రాధాకృష్ణగాథ ప్రాధాన్యం వహించుటేకాక పరమాత్మ కోసం జీవాత్మపడే తాపత్రయం సంకేతము చేయబడింది. మణిపూర్‌లో ప్రచారంలోఉన్న ఐదురకాల రాసనృత్యాలలో కూడ గోపికృష్ణుల గాధయే ఇతివృత్తము. కాని, పూరు రాసనృత్యాలు కేవలం శృంగారమయమై ఉంటే సౌరాష్ట్ర రాసనృత్యాలలో పురుషులే పాల్గొంటారు. మణిపూరు రాసనృత్యాలు కేవలం శృంగారపరమయమై ఉంటే సౌరాష్ట్ర రాసనృత్యాలలో అట్లుగాక గోపికల బదులు శ్రీకృష్ణ గోపాలకుల గాథ ఇతివృత్తంగా ఉన్నది. ఈ నృత్యాలకున్నూమణీపూర్‌లోని రాఖాలు నృత్యాలకున్నూ కొంత పోలిక వున్నది. కోలాటపు కర్రలతోనూ అవి లేకుండా కూడ చేసే వల్లీనృత్యాల సంకీర్ణరీతులలో సౌరాష్ట్ర, గుజరాత్ రాసనృత్యాల రూపాలు గోచరిస్తాయి.

సౌరాష్ట్ర రాస నృత్యాలలో కెల్ల ఆకర్షణీయమైన ప్రసిద్ధ నృత్యం దాండియా రాసనృత్యం. గుజరాతు గార్బారితో ఈ నృత్యంచేస్తారు. దీనిలో నర్తకులు, మువ్వలుకట్టిన కోలాటపు కర్రలు పట్టుకొని కోలాటం వేస్తారు. కోలాటపు కర్రలు ఒకదానిపై ఒకటి కొట్టినప్పుడల్లా, గజ్జెలు గలుగల్లున మ్రోగుతుంటాయి. ఈ నృత్యంలోను లయ రీతి చాలా సంకీరంగా ఉంటుంది. నృత్యం నెమ్మదిగా ఆరంభమవుతుంది. క్రమంగా నృత్యవేగం హెచ్చుతుంది. నృత్య వలయంలోని ప్రతివ్యక్తికోలాటం వేస్తు తానంత తాను నృత్యం చేయటమే కాక తనకు ఇరువైపులా, అభిముఖంగానూ, వలయంలో ఉన్న నర్తకులతో కలిసి సంకీర్ణానుబంధాలతో నృత్యం చేస్తాడు. ఒక్కొక్కప్పుడు ఈ నృత్యవలయం రెండు వలయాలుగా విభక్తమై ఒకదానిలో ఒకటి ఉండేట్లు ఏర్పడటం కద్దు. మరికొన్నిమరికొన్ని సందర్భాలలో విశాలచక్ర రేఖపై మూడు లేక నాలుగు వలయాకృతులుగా ఏర్పడట్ఫం కద్దు. ఈ వలయాకృతులలో నృత్యగతులు చాలా స్వేచ్చగా ఉంటాయి. నిలచిన, కూర్చున్న, పడుకున్న భంగిమలలో కోలాటం వేస్తారు. అప్పుడప్పుడు యించుమించు వలయాకారపు రజ్జురీతిగా పురుషనర్తకులు నేలపై పరుండిచేలెత్తి కోలాటం వేస్తారు. ఒక్కొక్కప్పుడు చేతులకు బదులు కోలాటపు కర్రలను కాళ్ళతో పట్టుకొనడం కూడా కద్దు. దాండియా రాసనృత్యం చాలా పురాతనమైనదని నిస్సందేహంగా చెప్పవచ్చు. కొన్ని సంస్కృత నాటకాలను పట్టిచూస్తే ఇది ఆ కాలంలో భారతదేశమందంతటా ప్రచారంలో ఉన్న సర్వసామాన్యమైన నృత్య క్రీడా రీతియని తోస్తుంది. ఇలాంటి నృత్యం రాజశేఖరుని 'కర్పూరమంజరిలో ' కూడా ఉదహరించబడింది.


హొలీ నృత్యం :

హొలీ డాన్స్ హొలీ రోజున పల్లెకారులు తమ స్త్రీజనాలతో కూడి, 'హుటషాని ' అనబడే హొలీమంట చుట్టూ నృత్యం చేస్తారు. క్రొత్తగా పెండ్లాడిన ఆలుమగల జంట ఒకటి ఈ భక్తి నృత్యంలో వీరితో చేరుతుంది. సౌరాష్ట్రలో మనం చెప్పుకొన్న రాసనృత్యాలూ, గుజరాత్, మహారాష్ట్ర రాసనృత్యాలూ ఒకటే. రాస నృత్యాలు సౌరాష్ట్ర, మహరాష్ట్ర, గుజరాతులలో అంతట ప్రదర్శించబడుతున్నాయి. ప్రస్ఫుటమైన కొన్ని ప్రాంతీయ భేదాలను మినహాయిస్తే, ఈ ప్రాంతా లన్నింటిలోనూ ఇవి ఒకేమాదిరిగా ఉంటాయి. అయినప్పటికిన్నీ గుజరాతు గర్బానృత్యం, గుజరాతు జానపద నృత్యాలలో చాలా విలక్షణమైనది. సౌరాష్ట్ర, మహారాష్ట్ర రాసనృత్యాలకూ దీనికి చాలా తేడా ఉంది. గుజరాతులోని నృత్యాలలోకెల్ల సుప్రసిద్ధమైనది గర్బా. ఇదే పేరుగల అనుసరణగీతం పాడుతూ ఉండగా ఈ నృత్యం చేస్తారు. నవరాత్రి ఉత్సవ కాలంలో గర్బీఘటాన్ని ప్రతి యింటా పూజా పురస్కారాలతో నెలకొల్పుతారు. ఆకర్షణీయమైన నమూనాలు కుంభంమీద రచిస్తారు.


ఆంధ్రప్రదేశ్ :

ఆంద్ర ఫోక్ ఆంధ్రప్రదేశంలో గిరిజనుల నృత్యాలు, ప్రత్యేకంగా బంజారాల, సిద్దీల నృత్యాలు కొల్లలుగా ఉన్నాయి. బంజారాలు, హైదరాబాదులోని ముఖ్యమైన దేశత్రిమ్మరుల తెగ. ఈ తెగలోని పురుషులు కూలి నాలి చేస్తుంటారు. భారతీయ జానపద నర్తకులలోకెల్ల శోభాయమానమయిన దుస్తులు ధరించే వారి ఇల్లాండ్రు పశువులను మేపుతూ, చిల్లరదినసులు, చిత్రవిచిత్ర వస్తువులూ అమ్ముతూ తిరుగుతుంటారు. బంజారా నృత్యాలు సరళంగా ఉంటాయి. అయితే అందులో చక్కని సామరస్యం ఉంది. తమ జీవితాలకు సంబంధించిన నిత్యకృత్యాలయిన చేలు కోయటం, మొక్కలు నాటటం, విత్తనాలు చల్లటంవంటి పనులకు సంబంధించిన దేహసంచలనాలవల్ల ఈ నృత్యాలు ప్రేరితమౌతున్నవి. బంజారాలేకాక, గోడుల తెగ కూడా వుంది. ఇది, ఆంధ్రప్రదేశ్ గిరిజన జాతులలోకెల్ల పెద్దదేకాకుండా బలిష్ఠమైనది కూడాను దసరా అనంతరము ఇంచుమించు రెండు ఉత్సవోత్సాహంతో పరవశులై ఉంటారు. దాపుడుబట్టలు వేసుకొని, నర్తకులు జట్టులుగా ఆ గ్రామంవారు ఈ గ్రామానికీ, ఈ గ్రామంవారాగ్రామానికీ వెళ్తారు. వీరు వెళ్ళిన చోటల్లా గౌరవనీయులైన అతిధులులాగా మర్యాదలు చేస్తారు. మున్ముందుగా, యువజనం, గాయకులు వెంటారాగా చకచకా వస్తారు; ముసలివాళ్ళు చివరకు వస్తారు. పిమ్మట వాళ్ళణ్దరూ కలిసి, ఎడమనుండి కుడివైపునకు తిరుగుతూ, చేతులలోని కర్రలను ఒకదానిపై ఒకటి కొట్టి తాళంవేస్తూ నృత్యం చేస్తారు. వీళ్ళనే దందారియా నర్తకులంటారు. అనుశ్రుతంగా వచ్చే గాథనుబట్టి, పంచపాండవ జాతిలోద్ధికెక్కిన సృష్టించినట్లు చెపుతారు. ఇలాంటి ఆచారలవల్ల గ్రామలమధ్య ఉత్సవ వాతావరణంలోసాంఘికానుబంధా లేర్పడుతాయి. కనుక, ఈ తెగయొక్క ఐకమత్యమును పోషించటానికి ఇవి ఒక విశిష్టవిధానంగా ఉపచరిస్తున్నవి. తెలంగాణా ప్రాంతంలో, ఒక ప్రాచీన గాధపై ఆధారపడిన 'బతకమ్మ ' అనే స్త్రీల నృత్యం ఉంది. ఇది 'సైజన్‌బాయి ' కథను తెలుపుతుంది. హైదరాబాదులోని సిద్దీలు చేసే సిద్దీ నృత్యం, జానపద నృత్యాలలోకెల్ల భారతీయేతరమైనదని చెప్పవచ్చును. పుట్టుకతో ఆఫ్రికనులైన సిద్ధీలు, 14వ శతాబ్దం మధ్య భాగంలో, అరబ్బులు, టర్కులు, ఇరానీలు వంటి ఇతర ముస్లిము లతో పాటు హైదరాబాదుకు వలస వచ్చారు. హైదరాబాదు నవాబు సేవలలో సిద్దీలు నియమితులై నిజాము ప్రత్యేక అంగరక్షకదళంగా ఏర్పాటయినారు. నిజాము సైన్యాలలోని అద్వితీయ ఆశ్విక దళాలుగా వారు ప్రశస్తిపొందారు. సిద్దీల నృత్యాలలో వాటి పూర్వపు ఆఫ్రికారీతులు ఇంకా నిలిచి ఉన్నాయి.


కర్ణాటక :

కర్నాటక ఫోక్

కర్ణాటక ప్రాంతం నాటకరీతులు కలిగిన జానపద నృత్యాలు చాలా పదిలపరచి వుంచింది. ఈనాడు మనకు గోచరమవుతున్న రీతులలో ఒకటి రెండు జానపద నృత్యాలను కూడా కర్ణాటకము భద్రపరచింది. ఏది యేమైనప్పటికీ కర్ణాటక జానపద నృత్యాలను గురించి చెప్పేటప్పుడు యక్షగానము, పురవిఅట్టం ముందు తోస్తాయి. జానపదుల వినోదం కొరకు సృష్టంపబడిన సరళ నాటకాల పరిపూర్ణ రూపమే యక్షగానం. మలబారులోని కథాకళితో ఈ యక్షగానానికి సన్నిహిత సంబంధం ఉన్నదని చెప్పటం అతిశయోక్తి కాదు. యక్షగానాన్ని బయలాట అని కూడా అనటం కద్దు; కారణం- ఇది తరచు బహిరంగ ప్రదేశంలో ప్రదర్శించబడుతూ ఉండటమే. ప్రత్యేకంగా రామాయణ, మహాభారత గాథలే యక్షగానానికి ఇతివృత్తాలుగా ఉన్నాయి. నర్తకులు ఎవరిపాటలు వారే పాడుతారు; రంగానికీ రంగానికీ మధ్య విరామ కాలంలోగానీ లేక సంభాషణ అనంతరంగానీ, ప్రధాన రంగంలో ఒక్కొక్క భాగం ముగిసిన తర్వాతగాని నృత్యం చేస్తారు. ఐతే, యక్షగానంలోని కథలలో ఎక్కువభాగం యుద్ధానికి చెందినవే.


తమిళనాడు :

తమిళనాడు ఫోక్

నేడు భరత నాట్యానికి ఆలవాలంగా ఉన్న తమిళనాడు శాస్త్రీయ రీతులలోనే కాక, దేశినృత్య, నాటక రీతులనబడే వానిలో కూడా సుసంపన్నంగా ఉంది. తమిళనాడులో చాలా జానపద నృత్యాలు ప్రచారంలో ఉండేవి. ఇవి, ఒకవైపు శాస్త్రీయ నృత్యాలకూ, మరొకవైపు 'ఆదిమ ' నృత్యాలకూ, సంబంధించి ఉండేవి. ఈ నృత్యాలలో చాలా మట్టుకు అదృశ్యమై పోయినవి. కాని, నేటికికూడా, వీనిలోకొన్ని పదిల పరచబడి ఉండటం, తమిళనాడు ప్రజల సజీవ సంప్రదాయంలో అవి అంతర్భాగంగా ఉండటం మనకు గోచరిస్తుంది.



కేరళ :

కేరళ ఫోక్

తమిళనాడువలెనే కేరళ కూడ మహాశక్తి మంతమైన భారతీయశాస్త్రీయ నృత్యరీతులకు ప్రసిద్ధిపొందినది; అట్టి వానిలో కథాకళి ఒకటి. మలబారువంటి ప్రాంతపు ప్రజలకు కథాకళి, ప్రజారంజకమైన వినోదమేకాక, అత్యంత శాస్త్రీయమూ, ఆధునికమూనైన హాస్యనాటకము కూడ. అయినప్పటికినీ, మలబారులో నున్నది ఈ ఒక్కరకం నృత్యమే కాదు; నిజానికి, మలబారులోనూ, కేరళలోనూ, పలయార్ కలివంటి మిక్కిలి యుద్ధరీతి నృత్యములు మొదలు మోహిని యాట్టంవంటి సుందర శృంగార నృత్యాలవరకు అనేక రకాల జానపదనృత్యాలు కన్పిస్తాయి.


అనువాదం : ఊట్ల కొండయ్య

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: